logo
Updated : 28 Jun 2022 07:08 IST

మన పీవీ.. పదిలం చేద్దాం జ్ఞాపకం

స్వగ్రామం వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలి

నేడు 101వ జయంతి

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 101వ జయంతి నేడు. ఓరుగల్లు బిడ్డగా ఆయన మనందరికీ గర్వకారణం. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.11 కోట్లు మంజూరు చేసి అందులో రూ.7 కోట్లు విడుదల చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేశవరావు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్‌ 28.. శతజయంతి ఉత్సవాల నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా నిర్ధేశించారు. కొవిడ్‌ కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. ఇలాగే ఉంటే మరో ఐదేళ్లైనా పనులు పూర్తి కావు.


విజ్ఞాన పార్కు నమూనా..


అటకెక్కిన స్వాగత తోరణం

హనుమకొండ-సిద్దిపేట రహదారిలో వంగర క్రాస్‌ (సమ్మక్క బోటీ) నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయాలి. రెండు ద్వారాలు కలిగిన తోరణం మధ్యలో పీవీ నిలువెత్తు కాంస్య విగ్రహం, నాలుగు వరుసల రహదారి నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌తో తీర్చిదిద్దాలి. 

ఇప్పటి వరకు ఏం చేశారంటే: రహదారిపై ఏర్పడిన గుంతలను కంకరతో పూడ్చారు.


మ్యూజియం ఏర్పాటు అంతేనా..

పీవీ స్వగృహాన్ని ప్రదర్శనశాలగా మార్చుతామని చెప్పారు. ఇంటి ముందు పీవీ విగ్రహం, ఆహ్లాదకరంగా పరిసరాలను తీర్చిదిద్దడంతో పాటు ఆయన వినియోగించిన అనేక వస్తువులను మ్యూజియంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఊర చెరువును ట్యాంకు బండ్‌గా మార్చడంతో పాటు సిమెంటు రహదారులు, మురుగునీటి కాలువలు నిర్మిస్తామన్నారు.

* ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. పీవీ తనయుడు ప్రభాకర్‌ తన సొంత నిధులతో ఇంటికి మరమ్మతులు చేయించారు. పీవీ ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు.


అసంపూర్తిగా విజ్ఞానవేదిక పార్కు

పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ స్మృతివనంలో ప్రవేశద్వారం, ఫుడ్‌ కోర్టు, గ్యాలరీ, ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. ధ్యాన కేంద్రం, అంపీ థియేటర్‌, సైన్సు మ్యూజియం, వాటర్‌ ఫౌంటేన్‌, శౌచాలయాలు, లోపల నడకదారులు, పూలవనాలు, చారిత్రక శిల్పాలు, సమరయోధుల చిత్రాలు, కూర్చునేందుకు రాతి బల్లలు, పిల్లల ఆట స్థలం తదితరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

* గుత్తేదారు ఏడాది కాలంగా ప్రహరీ నిర్మించి.. లోపల స్లాబులు వేసి సరిపెట్టారు.


బాల్యానికి సజీవ సాక్ష్యం

వంగరలో పీవీ ఇంటి ముందు 150 ఏళ్ల వేప చెట్టు పీవీ జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పీవీ బాల్యం, యుక్తవయసులో ఈ చెట్టు కిందనే ఆడుకునేవారు.


కారు.. ఠీవీగా

వంగరలోని ఇంటి ముందు ఆవరణలో ఉన్న పీవీ స్వయంగా నడిపిన కారు. ఈ ఫియేట్‌ ఎన్‌ఈ మోడల్‌ కారును 1984లో కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో ఆయన కొనుగోలు చేశారు. ప్రభుత్వ వాహనాలు సొంత పనులకు వాడొద్దని కుటుంబ సభ్యులకు చెప్పేవారని పీవీ తనయ, ఎమ్మెల్సీ వాణిదేవి తెలిపారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని