logo

బాలికలదే పైచేయి!

జిల్లాలో ప్రథమ సంవత్సర జనరల్‌, వృత్తి విద్య కోర్సుల్లో  మొత్తం 6,039 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,009 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 49.8 గా ఉంది. ద్వితీయ సంవత్సరంలో జనరల్‌, వృత్తి

Published : 29 Jun 2022 03:17 IST

ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం
తగ్గినా సత్తా చాటారు

మానుకోట, నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రథమ సంవత్సర జనరల్‌, వృత్తి విద్య కోర్సుల్లో  మొత్తం 6,039 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,009 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 49.8 గా ఉంది. ద్వితీయ సంవత్సరంలో జనరల్‌, వృత్తి విద్య కోర్సులకు రెగ్యులర్‌, ప్రైవేట్ విద్యార్థులు 5,826 మంది హాజరుకాగా 3,178 మంది మాత్రమే పాసయి 54.5 శాతం ఉత్తీర్ణత ఉంది. కాగా ద్వితీయ సంవత్సరంలో ప్రైవేట్ విద్యార్థులు 104 మంది హాజరు కాగా వీరిలో 23 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్య కోర్సుల్లో ఇద్దరు హాజరు కాగా ఒకరే పాసయ్యారు.  

30వ స్థానం
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లా బాగా వెనకబడి ఉంది. ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లాను మూడు విభాగాలుగా కలిపి మొత్తం రాష్ట్రంలో 35 జిల్లాలుగా ఉత్తీర్ణత స్థానాలను నిర్ణయించారు. ఇందులో ప్రథమ సంవత్సర జనరల్‌ గ్రూపుల్లో జిల్లా 52 శాతం ఉత్తీర్ణతతో 32వ స్థానం, వృత్తివిద్య కోర్సుల్లో 41 శాతంతో 31వ స్థానం, ద్వితీయ సంవత్సర జనరల్‌ గ్రూపుల్లో 58 శాతంతో 30వ స్థానం, వృత్తి విద్య కోర్సుల్లో 48 శాతంతో 34వ స్థానం పొందింది.
ఈ తీరు విద్యాభిమానులకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఇలా జరగడానికి కారణాలు ఏమిటా అని పలువురు విశ్లేషిస్తున్నారు. గత  విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా పరీక్షలను నిర్వహించకుండానే అందర్ని ఉత్తీర్ణులను చేశారు. రెండేళ్లుగా ప్రధానంగా ఆన్‌లైన్‌ తరగతులతోనే సాగాయి. 2021-22 విద్యా సంవత్సరంలో జూన్‌లో జూనియర్‌ కళాశాలలు తెరచుకున్నా అవి జూమ్‌ తరగతులకే పరిమితమయ్యాయి.

పరీక్షలకు తగ్గిన హాజరు
ద్వితీయ సంవత్సర ప్రయోగ పరీక్షలతో పాటుగా వార్షిక పరీక్షలకు జిల్లాలో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రయోగ పరీక్షలకు 90.42 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ జనరల్‌ గ్రూపుల పరీక్షలకు కూడా పలువురు గైర్హాజరు అయ్యారు. ఐతే గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాక విద్యార్థులు ప్రథమ సంవత్సర పరీక్షలను మళ్లీ రాయాలనడంతో విద్యార్థులు ఒకింత అయోమయానికి, ఆందోళనకు గురయ్యారు. ఇక కరోనా కాలంలో విద్యార్థులు కళాశాలలకు దూరం కావడం.. మళ్లీ కళాశాలలు తెరిచాక కూడా  తరగతులకు హాజరు విషయంలో వెసులుబాటు పరిస్థితే ఉండడంతో కళాశాలలకు వచ్చేందుకు అంతగా ఆసక్తిని చూపలేదన్నది కొందరు అధ్యాపకుల అభిప్రాయం.

వెనుకబడింది
జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే  ఈ విద్యా సంవత్సరం (2021-22)లో జిల్లా ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. ఐదు విద్యా సంవత్సరాల్లో జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత శాతం 60 శాతానికి మించే ఉంది. 2019-20లో 80 శాతానికి పైగా నమోదైంది. కరోనా కాలంలోని 2020-21 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాయకుండానే అందరూ పాసయ్యారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఫలితాల సరళి ఇలా ఉంది.


ప్రత్యేక శ్రద్ధతో సాగుతాం..
- సమ్మెట సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి

కరోనా తర్వాత ప్రత్యక్ష తరగతులను ప్రారంభించినా విద్యార్థులు హాజరయ్యేందుకు ఆసక్తిని చూపలేదు. అంతేగాక ప్రధానంగా వృత్తి విద్యాకోర్సుల పరీక్షలకు హాజరు తక్కువగా ఉంది. దీంతో ఫలితాలపై ఆ ప్రభావం పడింది. ఈ విద్యా సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి రాకుండా  పలు చర్యలతో ముందుకు సాగుతాం. తరగతుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.


తొర్రూరు టౌన్‌: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన లింగాల దివ్యశ్రీ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 984 మార్కులతో ప్రతిభ చాటింది. మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన దివ్యశ్రీ తండ్రి ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. సివిల్‌ సాధించడమే తన లక్ష్యమన్నారు.


తొర్రూరుటౌన్‌: ఇతని పేరు జి.యశ్వంత్‌. ఆదర్శ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. 983 మార్కులు సాధించాడు. వీరిది పేద కుటుంబం. తండ్రి వెంకన్న చీపురుకట్టల వ్యాపారం చేస్తున్నారు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువులో రాణిస్తున్నారు.


నెల్లికుదురు: నెల్లికుదురులోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రధమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని సుంకరి లక్ష్మీప్రసన్న 470 మార్కులకు 464 సాధించింది.  తల్లిదండ్రులు అరుణ, శ్రీనివాస్‌ వ్యవసాయం చేస్తారు.


కురవి: కురవి మండలం సీరోలు గురుకులం విద్యార్థిని ధరంసోతు సుష్మిత ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది.  470 మార్కులకు 464 సాధించింది. ఉగ్గంపల్లితండాకు చెందిన సుష్మిత తల్లిదండ్రులు: స్వరూప, హన్మంతునాయక్‌. తండ్రి గురుకులంలో ఉద్యోగి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని