logo
Published : 29 Jun 2022 03:17 IST

ఈసారీ అమ్మాయిలదే హవా..!

ప్రథమ 13, ద్వితీయ 14 స్థానాలు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ఇంటర్మీడియెట్‌ ఫలితాల సరళిలో గతంతో పోలిస్తే జిల్లా ఈసారి మెరుగైన ఫలితాలే సాధించింది. గతేడాది ఫలితాల్లో అందర్ని ఉత్తీర్ణులుగా పరిగణించిన విషయం తెలిసిందే. అయిదేళ్ల ఫలితాలను పోల్చుకుంటే ఈసారి ఫలితాలు జిల్లాకు కాస్తంత ఉపశమనం కలిగించాయి.

ఒకేషనల్‌ కోర్సుల్లో ఎందుకిలా..
జిల్లాలో జనరల్‌ కోర్సుల్లోని విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరం 62 శాతం, ద్వితీయ సంవత్సరం 67 శాతం కాగా ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో 40 శాతం, ద్వితీయ సంవత్సరంలో 55 శాతం వచ్చాయి. ఒకేషనల్‌ కోర్సుల ఫలితాలు రాష్ట్ర స్థాయి నివేదికలో వెనుకంజలో ఉన్నాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 63 శాతంతో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంకు, ఒకేషనల్‌లో 41 శాతంతో 21వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 68 శాతంతో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు, ఒకేషనల్‌లో 55 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలోనే ఉత్తీర్ణత శాతం పెరిగింది.

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 2,318 మందికిగాను 1,004 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,718 మంది బాలికల్లో 1869 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర 43.3 శాతం కాగా బాలికలది 68.8శాతంగా ఉంది. ద్వితీయ సంవత్సరంలో 2147 మంది బాలురకుగాను 1194 మంది, 2580 మంది బాలికల్లో 1868 మంది ఉత్తీర్ణులయ్యారు. 54 శాతంగా బాలికలు, 72.5 శాతంగా బాలుర ఉత్తీర్ణత శాతం నమోదైంది.

పాలకుర్తి : పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డి. అశ్విని 977 మార్కులు సాధించింది. ఈమె తల్లిదండ్రులు అరుణ, కుమారస్వామి. వీరిది వ్యవసాయ కుటుంబం. స్వగ్రామం వరంగల్‌ జిల్లా దామెర. సర్కారు కొలువే లక్ష్యమని చెప్పింది.

కొడకండ్ల : కొడకండ్ల బాలికల గురుకుల కళాశాలలో చదివిన బొల్లం సింధుశ్రీకి ఎంపీపీలో 970 మార్కులు వచ్చాయి. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వీరిది దామెర మండలం పులుకుర్తి. సాఫ్ట్‌వేరు ఇంజినీరు కావాలనేది ఈమె లక్ష్యం.

కొడకండ్ల : కొడకండ్ల ఆదర్శ పాఠశాలలో చదివిన జె.మణిదీపిక బైపీసీ ద్వితీయ సంవత్సరంలో 968 మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అంగన్‌వాడీ కార్యకర్త. వీరిది కొడకండ్ల మండలం రంగాపురం. డాక్టర్‌ కావడమే ఈమె ధ్యేయం.

బచ్చన్నపేట : బచ్చన్నపేట ఆదర్శ కళాశాలలో చదివిన శ్రీజకు  ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 957 మార్కులు వచ్చాయి. తల్లి మరణించారు. తాత, అమ్మమ్మ బీరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మి వద్ద ఉండి చదువుతోంది. వీరు వ్యవసాయం చేస్తున్నారు. సాఫ్ట్‌వేరు ఇంజినీరు కావడమే లక్ష్యం.


జనగామ రూరల్‌ : జనగామ మండలం చౌడారం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న గుండు సాత్విక ఇంటర్‌లో 948 మార్కులు సాధించింది. జనగామకు చెందిన గుండు శ్రీనివాస్‌-రజని దంపతులు టైలరింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సాత్వికను చౌడారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ విద్యాధర్‌, ఉపాధ్యాయ బృందం అభినందించింది.


జనగామ అర్బన్‌ : జనగామ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివిన రుద్రోజు దీపిక ఎంపీసీ మొదటి సంవత్సరంలో 460 మార్కులు సాధించింది. ఈమె తండ్రి ఏడాదిన్నర కిందట గుండెపోటుతో మరణించారు. నాటి నుంచి ఈమె చదువుకు ఆటంకం కలగకుండా ఇద్దరు సోదరులు సహకరిస్తున్నారు.  ఇదే స్ఫూర్తితో ద్వితీయ సంవత్సరంలోనూ ప్రతిభ చాటుతానని తెలిపింది.


జనగామ అర్బన్‌ : రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో పుట్టి, ప్రతిభ కనబరిచాడు పాలకుర్తి మండలంలోని మల్లంపల్లికి చెందిన జాటోతు సుమన్‌. ఇతని తల్లిదండ్రులు రైతులు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 932 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని