logo

‘హద్దులు’ దాటి బెదిరింపులు

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. రాజకీయ అండదండలతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రెచ్చి పోతున్నారు.

Published : 30 Jun 2022 05:52 IST

వెంచర్లలోకి అధికారులు రాకుండా అడ్డుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే


వరంగల్‌ శివారు స్తంభంపల్లి వ్యవసాయ భూమిలో వెలిసిన వెంచర్‌

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. రాజకీయ అండదండలతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రెచ్చి పోతున్నారు. అనధికారిక లేఅవుట్‌లు అడ్డుకునేందుకు వెళ్తున్న టౌన్‌ప్లానింగ్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలను బెదిరిస్తున్నారు. రెండు రోజుల క్రితం శంభునిపేట శివారులోని విలీన గ్రామంలో అక్రమ లేఅవుట్‌ హద్దు రాళ్లు తొలగిస్తుండగా అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌, మండల స్థాయి నాయకుడు ఫోన్‌ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ వెంచరు ఎవరిదో తెలుసా.. హద్దు రాళ్లు తొలగిస్తే నీ ఉద్యోగం ఉండదంటూ అధికారులను బెదిరించారని తెలిసింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వెంచర్లతో బల్దియా ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. భూ పేరు మార్పిడి, నాలా కన్జర్వేషన్‌ చేయకుండానే అనధికారిక లేఅవుట్‌లు చేస్తున్నట్లు తెలిసింది.

విలీన గ్రామాల్లోనే..

* విలీన గ్రామాల్లో చిన్న చిన్న లేఅవుట్‌లు వందలాదిగా వెలుస్తున్నాయి. 1-3 ఎకరాల భూములు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేస్తున్నారు. అంతర్గత రోడ్లు చూపించి కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ స్తంభాలు, రహదారులు, నీటి సరఫరా తదితర అంశాల ప్రస్తావనే లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఎప్పటికైనా భూములు లాక్కుంటారని కొందరు స్థిరాస్తి వ్యాపారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిసింది. ఔటరు రింగురోడ్డు, గ్రీన్‌ ఫీీల్డ్‌ తదితరాల పేరు చెప్పి రైతులను బురిడీ కొట్టిస్తున్నారు.

* స్తంభంపల్లి, వసంతపూర్‌, వెంకటాపురం, బొల్లికుంట, సింగారం, తిమ్మాపూర్‌, గాడిపల్లి, దూపకుంట, ఖిలావరంగల్‌ కోట శివారు, పోతరాజుపల్లి, ధర్మారం, గొర్రెకుంట, మొగిలిచర్ల, పైడిపల్లి, ఆరెపల్లి, హసన్‌పర్తి, ఎల్లాపూర్‌, రెడ్డిపురం, గుండ్ల సింగారం, హనుమకొండ వడ్డేపల్లి చెరువు శిఖం, కోమటిపల్లి, దేవన్నపేట, మడికొండ, రాంపూర్‌, కడిపికొండ, భట్టుపల్లి, అమ్మవారిపేట శివారుల్లో చిన్నాచితక అక్రమ లేఅవుట్లు వెలిశాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం : -వెంకన్న, నగర ప్రణాళికాధికారి, గ్రేటర్‌ వరంగల్‌

విలీన గ్రామాల్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా చిన్న చిన్న అనధికారిక లేఅవుట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 వరకు గుర్తించాం. అన్ని ప్రాంతాల్లో హద్దురాళ్లు తొలగించేశాం. అక్రమ లేఅవుట్ల ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్ధు భవిష్యతుతలో ఇబ్బందులు వస్తాయి. అక్రమ లేఅవుట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు