logo

ఆగని పోడు

ప్రభుత్వం అడవుల పెంపకం, సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా పోడు జరగుతున్న తీరును చూస్తే లక్ష్యం నీరుగారుతోంది.

Published : 30 Jun 2022 05:52 IST


నరికివేతకు గురైన చెట్లు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి మహాముత్తారం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అడవుల పెంపకం, సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా పోడు జరగుతున్న తీరును చూస్తే లక్ష్యం నీరుగారుతోంది. ఆజాంనగర్‌ రేంజి కార్యాలయానికి కూతవేటు దూరంలో వృక్షాలను నేలకూల్చుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న అనుమానాలకు తావిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా పోడు జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

ఐదు ఎకరాల్లో చెట్ల నరికివేత..

ఆజాంనగర్‌-యామన్‌పల్లి రహదారి పక్కనే పోడు జరగుతున్నా నియంత్రించే అధికారులు కరవయ్యారు. బ్లేడ్‌ బిగించిన ట్రాక్టర్లతో సుమారు ఐదు ఎకరాల్లో అక్రమార్కులు అడవిని నాశనం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం పలుచగా ఉండటంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. అక్కడక్కడ ఉన్న చెట్లను తొలగించి పంటలు సాగు చేసేందుకు సిద్ధం చేశారు. ఎకరం విసీ్తీర్ణం చదును చేసేందుకు ట్రాక్టర్‌ యజమానికి రూ.40 వేల చొప్పున చెల్లిస్తున్నట్లుగా సమాచారం.

ఆయనే హస్తమేనట....

ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి కనుసన్నల్లోనే పోడు జరుగుతున్నట్లు ఆరోపణులున్నాయి. ఇదివరకు అటవీభూములను అక్రమార్కులకు ఇదే కోవలో కట్టబెట్టి లక్షల రూపాయలు గడించారని పలువురు చేస్తున్న ప్రధాన ఆరోపణ. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటే గానీ పోడును నియంత్రించడం సాధ్యం కాదని గ్రామస్థులు చెప్పారు. ఎక్కడా కొత్త పోడు జరగడం లేదు. కాని ఈ ప్రాంతంలో మాత్రం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

మా దృష్టికి వచ్చింది: ఆసిఫ్‌, ఇన్‌ఛార్జి రేంజర్‌ అజాంనగర్‌

ఈ విషయం మా దృష్టికి వచ్చింది. దాదాపు ఆరున్నర ఎకరాల్లో పోడు జరిగినట్లు గుర్తించాం. ముగ్గురిపై కేసు నమోదు చేశాం. ఇంకా ఆప్రాంతాల్లో పరిశీలించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని