logo

జడ్పీ కార్యాలయానికి భవనమేదీ?

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. మూడు మాసాలకోసారి జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాల్సి ఉంటుంది.

Published : 30 Jun 2022 05:52 IST


నిరుపయోగంగా ఉన్న డీపీఆర్సీ భవనం

జనగామ, న్యూస్‌టుడే: జడ్పీ ఛైర్‌పర్సన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. మూడు మాసాలకోసారి జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాల్సి ఉంటుంది. సుమారు 30 శాఖలకు సంబంధించిన అజెండా అంశాలపై చర్చ జరుగుతుంది. కానీ ఐదారు శాఖలకు మించి చర్చ జరగడం లేదు. స్థాయీ సంఘాల సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రావడం లేదు. జడ్పీ సమావేశాలకు కలెక్టర్‌ రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సమావేశానికి రావాలనే సభ్యుల కోరిక నెరవేరడం లేదు.

వృథాగా రూ.2 కోట్ల భవనం

రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌ పథకం కింద, పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి, పంచాయతీరాజ్‌ పాలకులు, సిబ్బంది, గ్రామ పరిపాలనతో అనుబంధంగా ఉన్న వివిధ శాఖల వారికి నైపుణ్యాలను పెంచేందుకు రూ.2 కోట్లతో చంపక్‌హిల్స్‌లోని గోదాముల సమీపంలో రెండెకరాల స్థలంలో జిల్లా పంచాయతీ రిసోర్సు సెంటర్‌(డీపీఆర్‌సీ) నిర్మించారు. భవనం చుట్టూ, ఆవరణలో కంపచెట్లు పెరిగాయి. భవనాన్ని నిర్మించిన గత్తేదారు జడ్పీకి అప్పగించి ఏడాది దాటింది. విశాలమైన సమావేశ మందిరం, ఆడిటోరియం, శిక్షకులకు వసతితో సుమారు 3 వేల చదరపు అడుగుల్లో ఉన్న భవనం వృథాగా ఉంది. భవనంలో 16 ఏసీలను సైతం అమర్చారు. జడ్పీ కార్యాలయానికి సొంత భవనం నిర్మించే దాకా ఈ భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై జిల్లా పరిషత్‌ సభ్యులు సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. పంచాయతీరాజ్‌ విశ్రాంత వర్కు ఇన్‌స్పెక్టర్లు, గ్యాంగ్‌మెన్‌ తదితరులు 80 ఏళ్ల వయసున్న వారికి మూడేళ్లుగా నెలవారి పింఛన్‌ రావడం లేదు. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుతో వారికి దురవస్థ ఏర్పడింది. సభ్యులు ఈ అంశంపై గళం విప్పాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమావేశానికి మంత్రి వస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.

సొంత గూడు లేక..

జిల్లా ఏర్పాటులో భాగంగా జడ్పీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన జనగామ మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జాతీయ దినోత్సవాలు తదితర సందర్భాల్లో ప్రొటోకాల్‌ తదితర విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనగామ ఎంపీపీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌లలో ఎవరు పతాకావిష్కరణ చేయాలనే అంశంపై తర్జనభర్జన తప్పడం లేదు. సొంత భవనం సమకూర్చాలని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. స్థానికంగా వృథాగా ఉన్న పురపాలిక భవనాలు, ఇతర శాఖల భవనాలను పరిశీలించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని