logo

ఆరు నెలల్లో 4జీ సేవలు

ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నేడు ప్రైవేట్‌ సంస్థలతో పోటీ పడలేకపోతోంది. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది. 4జీ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ సేవల అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శ్రీలత ‘న్యూస్‌టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

Published : 30 Jun 2022 06:14 IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం శ్రీలత

ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నేడు ప్రైవేట్‌ సంస్థలతో పోటీ పడలేకపోతోంది. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది. 4జీ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ సేవల అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శ్రీలత ‘న్యూస్‌టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

- న్యూస్‌టుడే, ములుగు రోడ్డు

వినియోగదారులను ఫైబర్‌ టు ది హోం (ఎఫ్‌టీటీహెచ్‌) తీసుకోవాలని బలవంతం చేస్తున్నారట. దీని వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందా?

ప్రస్తుతం కాపర్‌ వైర్‌తో ఉన్న కనెక్షన్‌ వారిని ఎఫ్‌టీటీహెచ్‌కు మారాలని చెప్తున్నామే కానీ బలవంతం చేయడం లేదు. ఫైబర్‌తో లభించే సౌలభ్యం కాపర్‌వైర్‌తో ఉండదు. ఫైబర్‌, కాపర్‌ వైర్‌లలో వాయిస్‌ కాల్స్‌లోనూ తేడా ఉంటుంది. వేగవంతమైన నెట్‌వర్క్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్‌లైన్‌ డిపాజిట్‌ను ఎఫ్‌టీటీహెచ్‌కు బదిలీ చేస్తాం. అదనంగా డిపాజిట్‌ చేయాల్సిన అవసరం లేదు. అయితే అదనంగా రూటర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వినియోగదారులకు లీగల్‌ నోటీసులు ఇస్తున్నారట ఎందుకు?

బీఎస్‌ఎన్‌ఎల్‌కు బిల్లులు కొంత మంది సరిగ్గా చెల్లించడం లేదు. వాటిని రాబట్టడానికి 126 మందికి లీగల్‌ నోటీసులు ఇచ్చాం. ఇటీవల జరిగిన లోక్‌ అదాలత్‌లోనూ పాల్గొన్నాం. రూ.3కోట్ల బకాయిలు ఉన్నాయి.

విద్యుత్తు సరఫరా నిలిచినప్పుడు సేవలకు పూర్తిగా ఎందుకు అంతరాయం ఏర్పడుతోంది? ఆ సమస్యను అధిగమించలేరా?

విద్యుత్తు సరఫరా నిలిచినప్పుడు ఎక్స్ఛేంజిలో ఉండే జనరేటర్‌ పనిచేయనప్పుడే అలా జరుగుతుంది. జనరేటర్లు మరమ్మతు చేయించాం. ఇక సమస్య ఉండదు. కాజీపేటలో జనరేటర్‌ మరమ్మతు చేయించడంతోపాటు ఫైబర్‌ లైన్లు కూడా వేస్తున్నాం. పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయి. కాజీపేట నుంచి రెండు లైన్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి రెండు ఫైబర్‌ లైన్లు వేస్తున్నాం. దీంతో కాజీపేట, మడికొండ, రాంపూర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచినా ఇక సమస్య ఉండదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రైవేట్‌ వారికి వ్యాపార భాగస్వామ్యం కల్పిస్తున్నారా?

సంస్థ అభివృద్ధిలో భాగంగా ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు వ్యాపార భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఇప్పటికే డిష్‌ నడిపేవారు భాగస్వాములయ్యారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌లో పెట్టుబడి పెట్టి, వినియోగదారులను పెంచుకోవాలి. వ్యాపార విస్తరణ చేసుకోవాలి. వచ్చే రెవెన్యూలో 50 శాతం వాటా కల్పిస్తున్నాం.

కొత్త ప్యాకేజీలు ఏమైనా ఉన్నాయా?

ప్రైవేట్‌ సంస్థలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్యాకేజీలు బాగుంటాయి. నెట్‌, ల్యాండ్‌ ఫోన్స్‌, మొబైల్‌లో వివిధ ప్యాకేజీలు ఉన్నాయి. వాయిస్‌ మెసెజ్‌లు, బల్క్‌ మెసేజ్‌లు, ఇంటర్‌నెట్‌ లీజ్డ్‌ లైన్స్‌ అందిస్తున్నాం. ప్రైవేట్‌ సంస్థల్లో కంటే తక్కువ టారిఫ్‌ ఉంది.

తరచూ ఏదో ఒక ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు?

ఇటీవల కాలంలో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్లు వేస్తున్నారు. ఈ పనులు చేసే సమయంలో వైర్లు దెబ్బతింటున్నాయి. దీంతో అవి సరిచేయాల్సి వస్తోంది. ఆ సమయంలో కాస్త అంతరాయం ఏర్పడుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు ప్రజలు ఎందుకు మొగ్గుచూపడం లేదు? నగరంలోనే నెట్‌వర్క్‌ ఉండదు, గ్రామాల్లో పరిస్థితి ఏంటి?

వినియోగదారులకు తగ్గ టవర్లు నగరంలో లేకపోవడం కొన్ని చోట్ల సమస్య ఉన్న మాట వాస్తవమే. ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తాం. గ్రామాల్లో మంచి నెట్‌వర్కే ఉంది. ఈ ఆగస్టులో 4జీ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. వరంగల్‌లో 2023 మొదట్లో 4జీ ప్రారంభమవుతుంది. అప్పుడు సేవలు మరింత మెరుగవుతాయి. 310 సెల్‌టవర్లు ఉన్నాయి. 116 ఎఫ్‌టీటీహెచ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటి సంఖ్య పెంచుతాం. టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీలు 105 ఉండగా ప్రస్తుతం 50 మాత్రమే పనిచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని