logo

నాన్న ఆటో కష్టం.. కొడుకు ఐఎఫ్‌ఎస్‌ ఫలం

ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడానికి ఆ తండ్రి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆటో నడుపుతున్నారు. తల్లి వ్యవసాయ కూలీగా చెమటోడుస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారు.

Updated : 30 Jun 2022 07:16 IST

ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడానికి ఆ తండ్రి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆటో నడుపుతున్నారు. తల్లి వ్యవసాయ కూలీగా చెమటోడుస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారు. వారి కష్టం వృథాగా పోలేదు. తల్లిదండ్రుల కలలు నిజం చేశాడు పెద్ద కొడుకు. పుట్టెడు పేదరికం అనుభవించినా చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) లో అఖిల భారత స్థాయిలో 86వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన 24 ఏళ్ల కాసర్ల రాజు. ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం.

ఈనాడు, వరంగల్‌, జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే

రాజు తండ్రి కాసర్ల అంజయ్య 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నారు. తల్లి శోభ వ్యవసాయ కూలీ. వీరికి ముగ్గురికి కొడుకులు కాగా రాజు పెద్దవాడు. మరో ఇద్దరు కొడుకులు డిగ్రీ చదువుతున్నారు. రాజు నాలుగో తరగతి వరకు స్వగ్రామం సూరారం పాఠశాలలో చదివారు. అయిదో తరగతి నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ అక్కడే ఇంటర్‌ పూర్తి చేశారు. పెద్దాయ్యాక సివిల్స్‌ సాధించాలని ఆరో తరగతి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని అప్పుడప్పుడే వచ్చిన బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో చేరారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ములుగులో నెలకొల్పిన అటవీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీలో సీటు వచ్చింది. పీజీ మొదటి సెమిస్టర్‌ చదువుతుండగానే ఇప్పుడు ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. సివిల్స్‌ కోసం రోజుకు 8 గంటలపాటు సిద్ధం కాగా.. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌ సాధించగలిగారు.

వస్తే పుస్తకాలే లోకం..

కాసర్ల రాజు గ్రామంలో అనేక మందికి తెలియదు. పుస్తకాల పురుగని అంతా అంటుంటారు. హాస్టల్‌ నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా గంటల తరబడి పుస్తకాలు చదువుతూనే కూర్చునేవాడని తల్లిదండ్రులు చెప్పారు.

తల్లిదండ్రుల కష్టం వల్లే..

తండ్రికి ఎలాంటి ఆస్తులు లేవు. ఈ విజయానికి ఎవరు స్ఫూర్తి ఇచ్చారని రాజును అడగ్గా.. తల్లిదండ్రుల కష్టం వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని.. ఏ ఆస్తులూ లేకున్నా నాన్న ఆటోనడుపుతూ అప్పుసప్పూ చేసి ఆ విషయం తెలియకుండా పెంచాడని చెప్పారు. ఇక నుంచి అమ్మానాన్నలు కష్టపడకుండా చూసుకుంటానన్నారు. తన విజయంలో బంధుమిత్రుల ప్రోత్సాహం ఉందన్నారు. ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యం ఉందని కాసర్ల రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని