logo

ఆర్జీయూకేటీ.. ఉద్యోగావకాశాల గని

బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ).. ఈసారి పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువర్ణ అవకాశం. మంచి క్రమానుగత శ్రేణి (జీపీఏ) సాధించిన విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది.

Published : 30 Jun 2022 06:14 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వరం

నేడు వెలువడనున్న పదో తరగతి ఫలితాలు

బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ).. ఈసారి పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువర్ణ అవకాశం. మంచి క్రమానుగత శ్రేణి (జీపీఏ) సాధించిన విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. కరోనా వల్ల రెండేళ్లుగా పదో తరగతి పరీక్షల రద్దుతో ఆర్జీయూకేటీలో ప్రవేశానికి నిబంధనలు మార్చారు. గతేడాది పాలిటెక్నిక్‌లో ర్యాంకు ఆధారంగా తీసుకోవడంతో పట్టణ ప్రాంతాల్లో చదివిన ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూరింది. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నష్టపోయారు. ఈసారి పబ్లిక్‌ పరీక్షలు జరగడంతో మళ్లీ పాత పద్ధతినే కొనసాగించనున్నారు. గురువారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. మరోవైపు బాసర ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రవేశాల విధానంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

- దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే

ఈసారి కలిసొచ్చే అంశాలు..

కరోనా అనంతరం పాఠశాలలు ఆలస్యంగా తెరిచి, ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులను విద్యాపరంగా దత్తత తీసుకున్నారు. 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. మిగతా వారికి సెలవులు ప్రకటించినా పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధులను చేశారు. సిలబస్‌ తగ్గించడం, పదకొండు పేపర్ల బదులు ఆరే నిర్వహించడం, ప్రశ్నపత్రం కూర్పులో మార్పులు చేసి ప్రశ్నల సంఖ్య పెంచి సమాధానాలు రాయాల్సిన వాటి సంఖ్య తగ్గించడంతో సంతృప్తికరంగా పరీక్షలు రాశారు. ఇవన్నీ బాగా చదివే గ్రామీణ విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించే అవకాశాలు పెంచాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఎంపిక విధానం..

* గురువారం వెలువడనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలలో వచ్చిన మార్కుల క్రమానుగత శ్రేణి (జీపీఏ) ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో పదికి పది జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులకు అవకాశాలు ఎక్కువ.

* ఆర్జీయూకేటీ ప్రకటన వెలువడగానే విద్యార్థులు తమ జయపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.

* రిజర్వేషన్‌ నిబంధనలు వర్తిస్తాయి.

* జీపీఏ పదికి పది వచ్చినవారు అధికంగా ఉంటే వారిలో వయసు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

* వయసు ఒకే విధంగా ఉంటే గణితం, సామాన్యశాస్త్రం పాఠ్యాంశాలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు.

సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు :- కారుసోతుల సాత్విక్‌ చరణ్‌, ట్రిపుల్‌ ఐటీ ద్వితీయ సంవత్సరం, దేవరుప్పుల

నాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుంది. ఒకప్పటితో పోలిస్తే వసతుల కొరత ఉండడంతో మేమందరం కలిసి ఉద్యమం నడిపించాం. వాటిని సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. పది జీపీఏ సాధించిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆకర్షణీయ వేతనం.. : - సల్మా సుల్తానా, దేవరుప్పుల

2007-08లో పదో తరగతి పూర్తికాగానే మార్కుల ఆధారంగా మొదటి బ్యాచ్‌లో చేరాను. నిరంతర అనుశీలన ఉంటుంది. కోర్సు పూర్తికాగానే ఇంజినీరింగ్‌లో స్నాతకోత్తర విద్య (పీజీ) పూర్తి చేసి పేరుపొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరి ఉన్నత స్థానంలో ఉంటూ ఆకర్షణీయమైన వేతనం పొందుతున్నాను. పదోతరగతి అభ్యసించి.. ఈ క్యాంపస్‌లో చదివిన తర్వాత ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. మంచి మార్కులు సాధించినవారు సద్వినియోగం చేసుకోవాలి.

పేద పిల్లలకు మంచి అవకాశం.. : - వంగాల రాజేందర్‌, ప్రధానోపాధ్యాయుడు, జిపసె పాఠశాల, గానుగపహాడ్‌

పదోతరగతి వరకు చదివి పదికి పది జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులు తక్కువ ఫీజులకు ఇంజినీరింగ్‌ ఆవాస పద్ధతిలో పేరొందిన సంస్థలో చదవాలనుకునే వారికి ట్రిపుల్‌ ఐటీ మంచి వేదిక. పదో తరగతి జీపీఏనే ప్రమాణంగా తీసుకోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. మా పాఠశాల నుంచి విద్యార్థులు ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని