logo

Tholi Ekadashi: చైతన్యానికి తొలి ఏకాదశి! త్యాగ నిరతికి బక్రీద్‌!!

ఉమ్మడి జిల్లాలో బక్రీద్‌ ఆచరించడానికి ముస్లిం సోదరులు, తొలి ఏకాదశిని జరుపుకోవడానికి హిందువులు సన్నద్ధమవుతున్నారు. ఈ రెండు పండగలూ ధైర్యాన్ని నూరిపోసేవి. ఇవి ఆదివారం ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ తొణికిసలాడుతోంది. ఒకటేమో త్యాగ నిరతికి ప్రతీక. మరొకటి చైతన్యానికి నిలుపుటద్దం. విశ్వాసం, దాన గుణం అలవర్చేది బక్రీద్‌. వేసవిలో మోడు బారిన ప్రకృతి ఇప్పుడు చిగురిస్తున్నట్లే ఈ వర్షాకాలం ఆరంభంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసేది తొలి ఏకాదశి.

Updated : 10 Jul 2022 09:50 IST

ఉమ్మడి జిల్లాకు ఆధ్యాత్మిక శోభ

డోర్నకల్‌, న్యూస్‌టుడే

ఉమ్మడి జిల్లాలో బక్రీద్‌ ఆచరించడానికి ముస్లిం సోదరులు, తొలి ఏకాదశిని జరుపుకోవడానికి హిందువులు సన్నద్ధమవుతున్నారు. ఈ రెండు పండగలూ ధైర్యాన్ని నూరిపోసేవి. ఇవి ఆదివారం ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ తొణికిసలాడుతోంది. ఒకటేమో త్యాగ నిరతికి ప్రతీక. మరొకటి చైతన్యానికి నిలుపుటద్దం. విశ్వాసం, దాన గుణం అలవర్చేది బక్రీద్‌. వేసవిలో మోడు బారిన ప్రకృతి ఇప్పుడు చిగురిస్తున్నట్లే ఈ వర్షాకాలం ఆరంభంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసేది తొలి ఏకాదశి.


ఆనందం.. ఆరోగ్యం!

 

హిందువుల తొలి పండగ ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా హిందువులు దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పాటిస్తారు. పూర్వకాలం ఇదే రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. డోర్నకల్‌లోని శ్రీషిర్డీసాయి ధ్యాన మందిరం అర్చకులు లోకేష్‌ పండగ విశేషాలను ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

* తొలి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదం స్వీకరించాక భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయనేది నమ్మకం.

* ఏకాదశి అంటే పదకొండు. జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, మనసు ఒకటి. వీటిని మానవుడు తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటిని ఏకం చేసి దేవుడికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల మనిషిలోని బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరి చేరవు. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అందుకే తొలి ఏకాదశి ఆరోగ్యానికి తోడు ఆనందం సొంతం చేస్తుంది.


సేవకు, విశ్వాసానికి వారధి

మహ్మద్‌ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్‌ జరుపుకొంటారు. ఇస్లాం పరిభాషలో దీనిని ఈద్‌-ఉల్‌-జుహా అంటారు. రంజాన్‌ తర్వాత ముస్లింలు అమితంగా ఇష్టపడే ప్రధానమైన పండగ ఇది. పండగ రోజు వేకువజామున స్నానాలు ఆచరించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈద్గాకు వెళ్లి ప్రత్యేక నమాజ్‌ చదువుతారు. గత రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఈద్గాకు బదులు మసీదుల్లో ఈద్‌ ప్రార్థన ఆచరించడానికి ముస్లిం సోదరులు సన్నద్ధమవుతున్నారు. నమాజ్‌ చదివాక ఇళ్లకు వెళ్లి మతాచారం, సంప్రదాయం ప్రకారం ‘ఖుర్బాని’ ఇస్తారు. దీనిని బంధుమిత్రులతో పాటు పేదలకు పంపిణీ చేస్తారు.

* సందర్భం ఏదైనా కావచ్ఛు..ఇస్లాం పేదలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పండగప్పుడు ‘ఖుర్బానీ’ ప్రధాన భూమిక పోషిస్తుంది. బక్రీద్‌ సందర్భంగా ఖుర్బానీ ఇచ్చే జంతువుల మాంసంలోనూ పేదలకు కచ్చితమైన ‘వాటా’ని ఇస్లాం నిర్ధేశించింది. బలి ఇచ్చాక జంతు మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం కుటుంబసభ్యులు, రెండో భాగం బంధు మిత్రులు, మూడో భాగం పేదల కోసమని ఖాయం చేస్తారు. వాటాల పంపిణీలో ఏ కొద్ది తేడా వచ్చినా ఖుర్బానీ లక్ష్యం నెరవేరదని పవిత్ర గ్రంథం ఖురాన్‌ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని