logo
Updated : 15 Jul 2022 08:46 IST

Godavari : బాహు‘బలి’.. గోదావరి!

లక్ష్మీ పంప్‌హౌస్‌.. మూడేళ్లలోనే మునిగే!

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి:, (కాళేశ్వరం, న్యూస్‌టుడే):  గోదావరి వరద కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను నిండా ముంచింది. భారీ బాహుబలి మోటార్లు, పంపులు నీటిలో మునిగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేశారు. భారీ పైకప్పును నిర్మించారు. మూడేళ్లలోనే దీని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

* కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 70 టన్నుల బరువుండే 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 భారీ బాహుబలి మోటార్లను అమర్చారు. మోటార్లు, వాటి విడిభాగాలను జర్మనీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్‌ దేశాల నుంచి తెప్పించారు. వీటికి రూ.850 కోట్లను వెచ్చించారు. ఇవన్నీ నీటమునిగాయి.

* కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మొదటి పంప్‌హౌస్‌ ఇదే.. దీని నిర్మాణం, పంపుల బిగింపు పనులకు వర్షాల వల్ల ఆటంకం కలగకుండా ముందస్తుగా 315 మీటర్ల పొడువు శాశ్వత పైకప్పు నిర్మాణం చేపట్టారు. 20 మీటర్ల ఎత్తు, 32 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు.

నిర్మాణానికి 100 టన్నుల క్రేన్‌.. : లక్ష్మీ పంప్‌ హౌస్‌ పనులకు 100 టన్నుల ఈఓటీ (ఎలక్ట్రిక్‌ ఓవర్‌హెడ్‌ ట్రావెలింగ్‌) క్రేన్‌ను వినియోగించారు. ఇది కూడా రూఫింగ్‌ నిర్మాణంతో పాటు శాశ్వతంగా ఉంటుంది. పంపులు, వాటి విడిభాగాలను కిందకు దించేందుకు ఈ క్రేన్లను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో మరమ్మతులు, ఇతరాత్ర అవసరాలకు క్రేన్‌ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

2020లో వర్షాలకు పంపుల్లోకి కొద్దిగా నీరు చేరింది. అప్పుడు మరమ్మతులు చేపట్టారు.  ఈసారి వచ్చిన వరదలతో పూర్తిగా మునిగిపోయింది.

క్లుప్తంగా వివరాలు..

* 2016 మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

* వ్యయం రూ.3900 కోట్లు.

* 2019 జూన్‌ 21న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించారు.

* మొదటి దశలో 11 మోటార్లను అమర్చారు. (2 టీఎంసీలను ఎత్తిపోసేందుకు)

* రెండో దశలో 6 మోటార్లను (1 టీఎంసీని ఎత్తి పోసేందుకు).. 2020 కరోనా సమయంలో పనులు పూర్తిచేశారు.

* 40 మీటర్లకు అడుగున మోటార్లను అమర్చారు.

* కిందకు వెళ్లేందుకు 3 లిఫ్టులు ఉంటాయి.

* రెండు అంతస్తుల్లో పంపుల నిర్వహణక కంట్రోల్‌ రూములు ఉన్నాయి..


అంచనా వేయలేకనే..

రద పరిస్థితిని గత ఐదు రోజులుగా పంప్‌హౌస్‌ ఇంజినీర్లు గమనిస్తూ వచ్చారు. బుధవారం 105 మీటర్లకు చేరువకు వస్తోందని గుర్తించి ఓ మోటారును ఆన్‌ చేశారు. గురువారం ఊహించని విధంగా వచ్చిన వరద పంపుల్లోకి చేరింది. ముందస్తుగా మరిన్ని మోటార్లు ఆన్‌ చేసి వరదను ఎత్తిపోస్తే పంప్‌హౌస్‌ సురక్షితంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరదను అంచనా వేయకపోవడమే ఇంతటి ప్రమాదానికి దారి తీసిందని భావిస్తున్నారు. ముందుగా అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందిని తరలించారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగేది.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని