logo
Published : 06 Aug 2022 03:01 IST

‘హద్దు’ల్లేని ఆక్రమణలు

చెరువులను తలపిస్తున్న కాలనీలు

ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, కార్పొరేషన్‌  

గూగుల్‌ మ్యాప్‌లో కనిపిస్తున్న భద్రకాళి చెరువు శిఖంలో వెలసిన నిర్మాణాలు

ఓరుగల్లూ.. ఓరుగల్లూ వాన కురవగానే నువ్వెందుకు  మునిగిపోతున్నావు? వరదలు నాపైకి పోటెత్తితే మునిగిపోనా మరి.. వరదా వరదా నువ్వెందుకు పోటెత్తుతున్నావు అంటే.. చెరువు నిండి బయటకెళ్లే సరైన దారి లేక అంది. చెరువు చెరువూ దారెందుకు ఇవ్వడం లేదు అని అడిగితే.. వరద వెళ్లే మార్గంలో అక్రమ కట్టడాలు కడితే దారెలా ఇస్తానని తన గోడు వెళ్లబోసుకుంది.

ఓరుగల్లులో వరదలకు కారణం ఏమిటని వెతికితే ఏటికేడు ఆక్రమణకు గురవుతున్న చెరువు శిఖం భూములే కనిపిస్తాయి. నగరంలోని 20కి పైగా గొలుసు కట్టు చెరువుల శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. వాటి గొలుసు కట్టు మార్గం దెబ్బతినడంతో వరదలు వచ్చినప్పుడు మరో చెరువులోకి వెళ్లాల్సిన నీరు.. ఆక్రమణలు అడ్డు రావడం వల్ల వీధుల్లోకి పోటెత్తి కాలనీలు మునిగిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు చెరువుల పరిరక్షణ కమిటీ వేసినా నగరంలోని తటాకాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షాలకు దాదాపు అన్ని చెరువుల్లో నుంచి వరద పోటెత్తడంతో పరిసర కాలనీలు నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


    తటాకాలు నిండి.. దిగువకు  ప్రవాహం

ఈ నీరంతా నాలాల ద్వారా  ప్రవహించి వరంగల్‌ న్యూ సంతోషిమాత కాలనీని ముంచెత్తింది.

* తిమ్మాపూర్‌, కొండపర్తి, అమ్మవారిపేట దామెర చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, మద్దెలకుంట, భట్టుపల్లి, న్యూశాయంపేట కోటి చెరువు, ఉర్సు రంగసముద్రం అలుగు పోయడంతో ఉర్సు మియాగాని మాటు, హంటర్‌రోడ్‌ బొందివాగు నాలాల్లో వరద ఉదృతి ఎక్కువైంది. దిగువున కాలనీలు నీట మునిగాయి.

* వసంతపూర్‌, స్తంభంపల్లి, ఖిలావరంగల్‌ అగుర్తు చెరువులు మత్తడి పోయడంతో శివనగర్‌, అండర్‌బ్రిడ్జి, పెరుకవాడ, 12 మోరీలు, భద్రకాళి నాలాల్లో వరద ఉదృతి పెరిగింది. ఐదారు కాలనీలు జలమయ్యాయి.


ఇంకెప్పుడు నిర్ణయిస్తారు?

నగరంలో ఇప్పటికే 58 చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగైనట్టు ఉపగ్రహం ద్వారా సమాచారం ఇచ్చే రిమోట్ సెన్సింగ్‌ గణాంకాలే చెబుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని చెరువుల పరిరక్షణకు లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని వేశారు. రెండు నెలల కిందట వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లతోపాటు, గ్రేటర్‌ కమిషనర్‌, అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు సమావేశమై నగరంలోని భద్రకాళి చెరువు, పెద్ద వడ్డెపల్లి చెరువు, చిన్న వడ్డెపల్లి చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు తదితర ప్రధాన తటాకాలను సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ హద్దులు నిర్ణయించి పరిరక్షించాలని తీర్మానించారు. వీటిని మోడల్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎలాంటి సర్వే లేదు. దీంతో శిఖం భూములను కబ్జాదారులు అవకాశం వచ్చినప్పుడల్లా ఆక్రమించేస్తున్నారు.  


ఈ రెండు నెలలు కీలకం

ఆక్రమణల వల్ల కుంచించుకుపోయిన కాజీపేట బంధం చెరువు

* గత 15 ఏళ్లుగా వరంగల్‌ నగరానికి ముంపు తప్పడం లేదు. ఏటా వరద తీవ్రత పెరగడం తప్ప తగ్గడం లేదని నిపుణులంటున్నారు. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే వరంగల్‌ నగరం ముంపునకు గురైంది. 2016, 2017, 2018,. 2019 వరుసగా ఇవే నెలల్లో వరదలొచ్చాయి.

* 2020లో ఆగస్టు 14-18 తేదీల్లో నాలుగు రోజుల పాటు 20 సె.మీ. వర్షం కురిసింది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో 45 కాలనీలు నీట మునిగాయి. వారం, పది రోజుల పాటు వరంగల్‌ నగరం వణికి పోయింది.

* ఈసారి ఆగస్టు నెల మొదలైంది. నాలుగు రోజులు భారీ వర్షాలు పడటంతో 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి.


ఉదాహరణలు  ఎన్నో

* భద్రకాళి చెరువు మొత్తం విస్తీర్ణం 520 ఎకరాల వరకు ఉంటుంది. కొన్నేళ్లుగా అనేక చోట్ల శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. సుమారు వంద ఎకరాలకుపైగా కాజేస్తున్నా దీన్ని కాపాడాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

* గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువులో శిఖం హద్దురాళ్లను ఏర్పాటుచేయాలని స్థానికులు బల్దియా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

* మామునూరు బెస్తం చెరువు మత్తడి ప్రవాహానికి అడ్డుగా ఆక్రమణలు పుట్టుకురావడంతో గొలుసుకట్టు మార్గం మాయమైంది. దీంతో నీళ్లు పక్కనున్న రహదారిపైకి పోటెత్తి అది కోతకు గురై పక్కనున్న పొలాల్లోకి  రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతీ వానాకాలంలో ఇదే పరిస్థితి.

* కాజీపేట బంధం చెరువు, హసన్‌పర్తి చెరువు, ఉర్సు రంగ సముద్రం, చిన్న వడ్డెపల్లి చెరువులకు శిఖం హద్దురాళ్లు నిర్ణయించకపోవడంతో ఏటికేడు ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.

* వంద ఫీట్ల రహదారి వద్ద డ్రైనేజీ నిర్మాణం కోసం తీసిన మట్టిని గోపాల్‌పూర్‌ ఊర చెరువులో డంపింగ్‌ చేశారు. మళ్లీ దాన్ని తొలగించాలనేది ఒప్పందం. పనులు పూర్తి కాకముందే వానాకాలం రావడంతో చెరువులోకి వచ్చే నీరంతా పరిసర కాలనీల్లోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* చెరువులు, కుంటలే కాకుండా ఖిలావరంగల్‌లోని రక్షిత ప్రాంతమైన మోటును కూడా రియల్‌ మాఫియా పూడ్చేస్తోంది. దీంతో వరద నీరు ప్రవహించే మార్గం లేక రాదారులే గోదారిని తలపిస్తున్నాయి.


శివారు వరద వల్లే..  

- గుండు సుధారాణి, మేయర్‌, గ్రేటర్‌ వరంగల్‌

చుట్టు పక్కల గ్రామాల చెరువులు, కుంటలతోనే వరంగల్‌ నగరం మునుగుతోంది. శివారు వరదను ఎలా ఎదుర్కొవాలి?, మళ్లీంచేందుకు దారులున్నాయా?, ఎలా చేస్తే బాగుంటుందనే దానిపై ఇరిగేషన్‌ శాఖ నిపుణులతో మాట్లాడుతాం. బొందివాగు, పెరుకవాడ నాలాలు విస్తరిస్తాం.


 

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts