logo
Published : 06 Aug 2022 03:01 IST

ధరణి సమస్యల పరిష్కారానికి దారేది..?

న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌, నర్సంపేట

కలెక్టరేట్‌లోని ధరణి కేంద్రం వద్ద..

భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైసా లంచం చెల్లించకుండా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా.. పారదర్శకంగా పోర్టల్‌ను తీర్చిదిద్దారు. అయితే ఆ పోర్టలే..పెద్ద సమస్యగా మారింది. ప్రతి సోమవారం ప్రజావాణిలో దాదాపు 90 శాతం మంది భూ లబ్ధిదారులు ధరణి ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొన్ని సమస్యలకు సంబంధించి కొత్త ఐచ్ఛికాలు ధరణిలో పొందుపరిచినా.. అవసరమైన ఐచ్ఛికాలు లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యుటేషన్ల పై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలను తొలుత తహశీల్దార్‌ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే.. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తహశీల్దార్‌ నుంచి పరిశీలన నివేదికలు కలెక్టర్‌కు వెళ్లేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకు పోర్టల్‌లో సాంకేతిక లోపాలు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్‌ అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన తీరులో పనులు జరగడం లేదు.

పని చేయని టీఎం-33

ప్రభుత్వం ఈ మధ్య టీఎం-33 (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్‌) చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు వంటి సవరణకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్‌ పరిశీలన చేసి ఆర్డీవోకు పంపితే పరిశీలన తరువాత కలెక్టర్‌ లాగిన్‌కు నివేదిస్తే అన్ని విధాలా పరిశీలన చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఐచ్చికం సరిగా పనిచేయనందున ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అనే చందంగా మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అయినా పని కావడం లేదని ఒక రైతు వాపోయారు.  ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అప్‌డేషన్‌ చేయించినా సిస్టమ్‌లో జనరేట్‌ కావడం లేదు. అలాగే నిషేధిత జాబితా(పీవోబీ) మాడ్యూల్స్‌లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా లేదు.

సవరణల కోసం తిప్పలు తప్పట్లేదు..

ధరణి పోర్టల్‌ ప్రారంభ సమయంలో ఏర్పడ్డ లోపాలను సవరించే క్రమంలో భూ లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. కొందరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య విధుల కారణంగా ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములు, సర్వే నంబర్లలో లోపాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అవసరానికి అమ్ముకోలేని దుస్థితి. గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాపాసుపుస్తకాలు జారీచేస్తుండడంతో.. కొనుగోలు దార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసినా.. కుంటిసాకులతో అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు తమ బాధను వ్యక్తంచేస్తున్నారు.


అధికారుల నిర్లక్ష్యం మాకు శాపం

-బానోతు శ్రీనివాస్‌, నాగారం, నెక్కొండ

గత 40 ఏళ్లుగా నాగారం శివారులో సర్వే నంబరు 302, 303లో 2.20 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్నాం. ధరణి పోర్టల్‌ అమలు సమయంలో అధికారులు 311 సర్వే నంబరులోని అసైన్డ్‌ భూమి జాబితాలో తప్పుగా నమోదు చేశారు. తద్వారా రైతుబంధు పొందలేక.. క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. పలుమార్లు సర్వేచేయించినా.. అధికారులు సమస్యను పరిష్కరించట్లేదు.


మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం

-చిలువేరు నరసింహస్వామి, గీసుకొండ

2019లో గీసుకొండ, విశ్వనాథపురంలోని సర్వే నంబరు 362/1లో గల ఎకరం ఏడు గుôటలు కొనుగోలు చేశా. అధికారులు ఎకరం 33 గుంటలుగా ధరణిలో నమోదుచేశారు. రైతుబంధుతో పాటు పట్టా పాస్‌బుక్‌ జారీ అవ్వడంలేదు. మూడేఏళ్లుగా తహశీల్దార్‌, కలెక్టరేట్‌ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని