logo

తారస్థాయికి చేరిన భూ వివాదం

వెంకటాపురం మండలంలోని బెస్తగూడెంలో భూ వివాదం భగ్గుమంది. గ్రామస్థులు, ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీల మధ్య శుక్రవారం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు, పదునైన గొడ్డళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గ్రామంలోని వరసిద్ధివినాయక ఆలయానికి అధికారుల

Published : 06 Aug 2022 03:01 IST

కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు

వెంకటాపురం, న్యూస్‌టుడే: వెంకటాపురం మండలంలోని బెస్తగూడెంలో భూ వివాదం భగ్గుమంది. గ్రామస్థులు, ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీల మధ్య శుక్రవారం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు, పదునైన గొడ్డళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గ్రామంలోని వరసిద్ధివినాయక ఆలయానికి అధికారుల సహకారంతో కొంత భూమిని గ్రామస్థులు ఆధీనంలోకి తీసుకున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో చుట్టూ ఫెన్సింగ్‌ సైతం ఏర్పాటు చేశారు. ఆ భూమిలోకి ప్రవేశించిన ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీలు నాగళ్లు కట్టి దుక్కి దున్నుతుండగా బెస్తగూడెం గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి బాహాబాహీకి దారి తీసింది. కోపోద్రిక్తులైన పలువురు కర్రలతో కొట్టుకోవడంతో బెస్తగూడేనికి చెందిన మాటూరి దేవేందర్‌ తలకు తీవ్రగాయమైంది. తీవ్ర రస్తస్రావం కావడంతో అతడిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వరంగల్‌కు మెరుగైన వైద్య సేవలకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీ మహిళ తలకు సైతం గాయం కావడంతో వైద్యసేవలు పొందారు. ఇరు వర్గాలు వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణకు దారి తీసిన పరిస్థితులను ఎస్సై జి.తిరుపతి ఆరా తీయడంతో పాటు పలువురిని మందలించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు నాగరాజును కలిసిన బెస్తగూడెం వాసులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. గతంలోనూ ఈ భూమిలోకి ప్రవేశించడంతో సామరస్యంగా చెప్పినా పట్టించుకోలేదని, ఈ క్రమంలో మరో ప్రాంతానికి చెందిన వలస ఆదివాసీలను తీసుకొచ్చి దున్నుతుండగా తాము అడ్డగించినట్లు విన్నవించారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దారు బెస్తగూడెం రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 44లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూశాఖ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. గతంలోనూ ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీలు చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మళ్లీ అదే ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని