logo

కాలిపోతున్న నియంత్రికలు.. కర్షకుల కష్టాలు..!

అన్నదాతకు ఆది నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు.. విత్తనాలు, ఎరువుల పెరిగిన ధరలు మరో వైపు ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నా..

Published : 08 Aug 2022 05:26 IST


జనగామలో నియంత్రికలను మరమ్మతు చేస్తున్న సిబ్బంది

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: అన్నదాతకు ఆది నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు.. విత్తనాలు, ఎరువుల పెరిగిన ధరలు మరో వైపు ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నా.. నియంత్రిక కాలిపోతే దానిని బాగు చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటకు నీరందే సమయంలో కాలిపోతే.. కొత్తది అమర్చడానికి సమయం పడుతుందని ఆ శాఖ అధికారులు చెబుతుండడంతో చేసేది లేక.. స్వయంగా వారే తీసుకెళ్లి బాగు చేయించుకుంటున్నారు. ఈ అంశాలపై జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

రోజుల తరబడి ఎదురుచూపులు..
సాధారణంగా వర్షాకాలంలో పిడుగుల, భారీ వర్షాలతో, వేసవిలో అయితే అధిక ఉష్ణోగ్రత ఓవర్‌ లోడ్‌ సమస్యతో నియంత్రికలు కాలిపోతుంటాయి. వ్యవసాయ బావుల వద్ద కాలిపోతే విద్యుత్తు శాఖ వారే వాహనంలో తీసుకెళ్లి, బాగు చేసి తిరిగి వారే తీసుకొచ్చి బిగించాలి. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలా జరగడం లేదు. రైతులే సొంత ఖర్చులతో వాహనం సమకూర్చుకొని సమీపంలోని మరమ్మతు కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడా రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఏ ప్రాంతంలోనైనా ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే, తిరిగి బిగించే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, కరెంటు సరఫరా చేయాల్సి ఉన్నా, చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పలుమార్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తలా కొంత డబ్బులు వేసుకుని మరమ్మతు కేంద్రానికి దూరాన్ని బట్టి రూ.2వేలు, 3వేల వరకు వాహన కిరాయి భరిస్తున్నారు.

రవాణా ఖర్చుల భారం..
జనగామ, సింగరాజుపల్లి, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి మండలాల్లో విద్యుత్తు శాఖాపరంగా పది నియంత్రికల మరమ్మతు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆ కేంద్రాల వద్ద విద్యుత్తు శాఖాపరంగా కేవలం 25 కేవీ నియంత్రిక ఒకటి తీసుకెళ్లేందుకు చిన్న వాహనం అందుబాటులో ఉంది. అయితే పెద్ద వాటిని తీసుకెళ్లేందుకు మాత్రం వాహనం అందుబాటులో లేదు. ఎక్కువగా వ్యవసాయ బావుల వద్ద ఉన్న 60, 100, 160 కేవీ సామర్థ్యం కలిగినవి కాలిపోతే రైతులే ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు. జనగామ విద్యుత్తు డివిజన్‌ కేంద్రానికి 3 టన్నుల సామర్థ్యం బరువు తీసుకెళ్లే వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ శాఖ ఉంచి ఆదేశాలు వచ్చాయి. ఆ వాహనం అందుబాటులోకి వస్తే జనగామ డివిజన్‌కు సంబంధించి రైతులకు రవాణా భారం తప్పే అవకాశాలున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని మరమ్మతు కేంద్రాల వద్ద పెద్ద వాహనాలను అందుబాటులో ఉంచి, తమపై భారం పడకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.


పాలకుర్తిలో కిరాయి వాహనంలో తీసుకెళ్తూ..

జిల్లాలో వ్యవసాయ సంబంధిత నియంత్రికలు : 13,447
మరమ్మతు కేంద్రాలు : 10


మరమ్మతుకు వారం రోజులైంది

-  బోడ మల్లన్న, కిష్టాపురం తండా, పాలకుర్తి మండలం

నియంత్రిక కాలిపోతే పాలకుర్తి మరమ్మతు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులైంది. ఎట్టకేలకు శనివారం మరమ్మతు పూర్తి అయింది. మా సొంత వాహనంలోనే తీసుకెళ్తున్నాం. రవాణా ఖర్చులు మాకు భారంగా మారాయి. రవాణా కోసం విద్యుత్తు శాఖనే వాహనాన్ని సమకూరిస్తే బాగుంటుంది.


త్వరలో అందుబాటులోకి పెద్ద వాహనం

- మల్లికార్జున్‌, ఎస్‌ఈ, జనగామ సర్కిల్‌

వ్యవసాయ నియంత్రికలు కాలిపోతే కొన్ని సమస్యలైతే ఉన్నాయి. మరమ్మతు కేంద్రాల వద్ద కేవలం 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను తీసుకెళ్లేందుకు చిన్న వాహనం అందుబాటులో ఉంది. జనగామ డివిజన్‌కు రవాణా సేవల కోసం ఇటీవలనే 3 టన్నుల బరువు మోసేందుకు పెద్ద వాహనం కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇతర మరమ్మతు కేంద్రాల వద్ద కూడా రైతులపై రవాణా భారం పడకుండా చర్యలు చేపడతాం. వ్యవసాయ బావుల వద్ద రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని