logo

నీతి ఆయోగ్‌ సిఫారసులు తప్పని నిరూపిస్తే రాజీనామా

తెలంగాణ రాష్ట్రానికి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారుసు చేసిందని,....

Updated : 08 Aug 2022 10:34 IST


మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, పక్కన ప్రజాప్రతినిధులు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రానికి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారుసు చేసిందని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఒకవేళ నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేయలేదని పాదయాత్ర చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముత్తిరెడ్డి సవాల్‌ విసిరారు. జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా జనగామకు రానున్న బండి సంజయ్‌ తన పాదయాత్రను మానుకుని, నీతి అయోగ్‌ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన రూ.24 వేల కోట్ల కోసం దిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి నిధులను తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ముంపు వార్డుల సమస్య పరిష్కారానికి నిధులు
ప్రతి వర్షాకాలం వరద ముంపు వార్డుల పరిధిలో సమస్యను శాశ్వతంగా తొలగించడానికి రూ.9.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య కళాశాలకు రూ.190 కోట్లు మంజూరైన సందర్భంగా పార్టీ శ్రేణులతో మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. మొదట ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిని తెరాస నాయకులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో వరద ముంపు లేకుండా 3, 4 వార్డుల్లో ప్రణాళిక ప్రకారం భారీ మురుగు కాల్వలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. కొమురవెల్లిలో సిద్దిపేట కమాన్‌ నుంచి కొమురవెల్లి దేవస్థానం వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పోకల జమున, రైబస జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ బాల్దె విజయ, ఎంపీపీ కళింగరాజు, డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, నాయకులు బాల్దె సిద్ధిలింగం, ఉడుగుల నర్సింహులు, పోకల లింగయ్య, అనిత, కిష్టయ్య, మామిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని