logo

డబ్బులిస్తేనే పనులు.. నిబంధనలకు నీళ్లు

కాలిపోయిన విద్యుత్తు నియంత్రికలకు మరమ్మతులు చేయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనల ప్రకారం రైతులు డీడీ కడితే నియంత్రిక ఇవ్వాలి.

Published : 08 Aug 2022 05:26 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే: కాలిపోయిన విద్యుత్తు నియంత్రికలకు మరమ్మతులు చేయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనల ప్రకారం రైతులు డీడీ కడితే నియంత్రిక ఇవ్వాలి. అది కాలిపోతే విద్యుత్తు సంస్థ వాహనాన్ని ఏర్పాటు చేసి దాన్ని మరమ్మతు కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. మరమ్మతు చేశాక సంబంధిత గ్రామానికి చేర్చాలి. మరమ్మతు పనులు పూర్తయి బిగించే వరకు కాలిపోయినచోట రోలింగ్‌ (ప్రత్యామ్నాయ) నియంత్రిక అమర్చాలి. కానీ ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నియంత్రికలు కాలిపోతే రైతులే వాటిని పొలాల నుంచి భుజాలపై లేదా ఎడ్లబండ్లపై, రోడ్డు సౌకర్యం ఉంటే ట్రాక్టర్లలో మరమ్మతు కేంద్రాలకు తీసుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

రెండు జిల్లాల్లో ఐదు మరమ్మతు కేంద్రాలు..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేగొండ, జంగేడు, కాటారం, ములుగు జిల్లాలో ఏటూరునాగారం, ములుగు ప్రాంతంలో నియంత్రికలకు మరమ్మతు కేంద్రాలున్నాయి. రెండు జిల్లాల్లో వివిధ సామర్థ్యాలు కలిగిన నియంత్రికలు 17 వేల వరకు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికల్లో కొన్ని నేలకొరిగి, వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్తు సబ్‌స్టేషన్లల్లోకి సైతం వరద నీరు ప్రవేశించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు వరి నాట్లు వేసుకోవడానికి, మరి కొందరు వరి నార్లు పోసుకోవడానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాడైపోయిన నియంత్రికలను బాగు చేయించేందుకు మరమ్మతు కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. నియంత్రికలను మరమ్మతు కేంద్రాలకు చేర్చడానికి విద్యుత్తు సంస్థ డివిజన్‌ను ఒక వాహనాన్ని ఏర్పాటు చేసింది. సబ్‌ డివిజన్‌ పరిధిలో ఏడీఈలకు ఇచ్చిన వాహనాలను సైతం వీటిని చేర్చేందుకు వినియోగించాల్సి ఉంది. ఆ వాహనాలతో అధికారుల పర్యవేక్షణ, అన్ని చోట్లకు వెళ్లి నియంత్రికలను తీసుకురావడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో పాడైపోయిన వాటిని రైతులే ప్రైవేటు వాహనం మాట్లాడుకొని, లేదా ఎడ్లబండిపైనే మరమ్మతు కేంద్రానికి తీసుకొస్తున్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత మళ్లీ రైతులే వాహనాల్లో తిరిగి తీసుకెళ్తున్నారు.


జంగేడులోని మరమ్మతుల కేంద్రానికి ట్రాక్టర్‌లో నియంత్రికను తీసుకొచ్చిన గణపురం మండలం బస్వరాజుపల్లి రైతులు

గుత్తేదారుల చేతివాటం
నియంత్రికల మరమ్మతు కేంద్రాల్లో ఒక్కోదాని మరమ్మతుకు మూడు, నాలుగు రోజులు పడుతోంది. ఆ సమయంలో ప్రత్యామ్నాయంగా నియంత్రిక ఏర్పాటు చేయకపోవడంతో పంటలు నాశనమైపోతున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని గుత్తేదారులు, కొందరు అధికారులు అనధికారికంగా నియంత్రికలు ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాల్లో సైతం ఒక్కోదాని మరమ్మతుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మరమ్మతు కేంద్రం వద్ద రైతులు డబ్బులు ఇవ్వకుంటే వారికి వారం రోజుల పాటు నియంత్రిక ఇవ్వకుండా అడ్డుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు వారికి ముడుపులు ముట్టజెప్పి నియంత్రికను తీసుకెళ్లారు. సిబ్బందికి అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మరమ్మతు పనులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకూడదని రైతులకు కొందరు సిబ్బంది చెప్పడం గమనార్హం.  

ఎవరికీ డబ్బులివ్వొద్దు : - మల్చూర్‌నాయక్‌, ఎస్‌ఈ, విద్యుత్తుశాఖ
నియంత్రికల మరమ్మతుల కోసం రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. నిబంధనల ప్రకారం ఉచితంగా మరమ్మతులు చేసి ఇస్తున్నాం. కేటాయించిన వాహనాల ద్వారా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో నియంత్రికలను చేరవేయడం అప్పుడప్పుడు కష్టంగా ఉండటంతో రైతులకు కొంత ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవం. మరమ్మతుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావచ్చు.

వ్యవసాయ కనెక్షన్లు
జయశంకర్‌  : 43,166, ములుగు : 9,000
రెండు జిల్లాల్లో నియంత్రికలు : 17 వేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు