logo

పాలకవర్గాల నియామకమెప్పుడో?

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాల నియామకంలో అధికారుల నిర్లక్ష్యంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెండు మార్కెట్‌ కమిటీలు ఎప్పుడు కొలువుదీరుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Published : 08 Aug 2022 05:26 IST


నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం

నర్సంపేట, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాల నియామకంలో అధికారుల నిర్లక్ష్యంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెండు మార్కెట్‌ కమిటీలు ఎప్పుడు కొలువుదీరుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.  జిల్లాలో ఎనుమాముల, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్‌లు ఉండగా వర్ధన్నపేట, ఎనుమాముల మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. నర్సంపేట, నెక్కొండ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించలేదు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్కొండ మార్కెట్‌లో పాలకవర్గం రెండేళ్ల పాటు పనిచేయగా  నర్సంపేటలో మాత్రం ఏడాది మాత్రమే పని చేసింది. అప్పటి నుంచి ఈ రెండు మార్కెట్లలో కమిటీలు లేవు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంలో, మార్కెట్‌ యార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కమిటీలదే కీలక భూమిక. ఈ కమిటీల నియామకంలో కొంత కాలంగా జాప్యం జరగడంతో నర్సంపేట, నెక్కొండలో ఛైర్మన్‌, డైరెక్టర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు.

సంధానకర్తలుగా కమిటీలు
రైతులు, వ్యాపారుల మధ్య మార్కెట్‌ కమిటీల పాలకవర్గాలు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. ఏదైనా సమస్య వస్తే హలధారులు పాలకవర్గ కమిటీలకు గోడు చెప్పుకుంటే పరిష్కరిస్తారు.

ఆదాయంలో మిన్న
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎనుమాముల మార్కెట్‌ తరువాత అధిక ఆదాయం వచ్చే రెండో పెద్ద మార్కెట్‌గా నర్సంపేట గుర్తింపు పొందింది. ఈ మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్నల వ్యాపారం జోరుగా సాగుతోంది. పంట ఉత్పత్తులు చేతికొచ్చే తరుణంలో పాలక వర్గాన్ని నియమిస్తేనే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్నల సీజన్‌లో పొరుగున ఉన్న మహబూబాబాద్‌, ములుగు జిల్లాలోని అటవీ గ్రామాల రైతులు పండించిన ఉత్పత్తులను ఈ మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తారు.

బీసీ జనరల్‌కు రిజర్వు
నర్సంపేట, నెక్కొండ మార్కెట్‌ కమిటీల ఛైర్మన్‌ పదవులు బీసీ జనరల్‌ కేటగిరీలకు రిజర్వు అయ్యాయి. 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదవుల కోసం బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాని ఏళ్లతరబడి నియామకంపై నీలినీడలు కమ్ముకోవడంతో వారి ఆశలు నీరుగారాయి. ఈ చోట్ల బీసీలకు రిజర్వు కావడం వల్లే పాలకవర్గ కమిటీలను నియమించడం లేదనే గుసగుసలు అధికార పార్టీలో వినబడుతున్నాయి.

పెరిగిన పదవీకాలం
మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల పదవీ కాలం మూడేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశించినట్లు మార్కెట్‌ అధికారి ప్రసాదరావు తెలిపారు. కమిటీ సభ్యుల సంఖ్య 14 ఉండగా కొత్త ఆదేశాలతో ఆ సంఖ్య 18కి పెరిగింది. వీరిలో మార్కెట్‌ పరిధిలోని గ్రామాలకు చెందిన 12 మంది రైతులు డైరెక్టర్లుగా ఉంటారు. వారిలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గా నియమిస్తారు. మరో మార్కెట్‌లో లైసెన్సు పొందిన వ్యాపారులను  డైరెక్టర్లుగా నియమిస్తారు. మరో నలుగురిని ఎక్స్‌ అఫీ‡షియో సభ్యులుగా నియమిస్తారు. గతంలో పాలకవర్గ పదవీ కాలం ఏడాది మాత్రమే ఉండేది. సర్కారు జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది. ప్రభుత్వ ఆమోదంతో ఆరు నెలలు, మరో ఆరు మాసాలు ఇలా రెండు సార్లు పదవీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. దీంతో మూడేళ్లు పదవీ కాలం చేపట్టే అవకాశం ఉండడంతో ఈ సారి మార్కెట్‌ కమిటీ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని