logo

విలీనం.. సమస్యలమయం

జిల్లా ఆవిర్భవానికి ముందు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ ఆరు గ్రామాలు పురపాలక సంఘానికి సమీపంలో ఉండడమే శాపంగా మారింది. 

Published : 08 Aug 2022 05:26 IST


అనంతారంలో రాంసింగ్‌ తండాలో పర్యటిస్తున్న పురపాలక ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్‌ ప్రసన్నరాణి

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా ఆవిర్భవానికి ముందు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ ఆరు గ్రామాలు పురపాలక సంఘానికి సమీపంలో ఉండడమే శాపంగా మారింది.  మహబూబాబాద్‌ పురపాలక సంఘంలో కలిసిన ఆ ఆరు గ్రామాల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత రహదారులు, మురుగునీటి కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. మౌలిక సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. పురపాలక సంఘానికి వచ్చే ఆదాయంలో 40 శాతం నిధులు విలీన గ్రామాలకు కేటాయించాలనే నిబంధనలు అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సమస్యలు ఇవే
* ఈదులపూసపల్లిలో వైఎస్సార్‌ కాలనీ, కొత్తబోడ్‌ గడ్డమీది కాలనీలో కనిపించని అంతర్గత రహదారులు, సీసీ డ్రైయిన్ల నిర్మాణం
* అనంతారం గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి.. కొత్తగా ఏర్పాటైన నున్న నారాయణనగర్‌ కాలనీతో ఆవిర్భవించిన గాంధీపురంలో మౌలిక వసతుల కొరత నెలకొంది. నున్న నారాయణ నగర్‌లో అంతర్గత రహదారులు లేవు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసి నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు.
* శనగపురంలో రెండు వార్డులు ఏర్పడ్డాయి. వీటి నాలుగైదు తండాల్లో అంతర్గతర రహదారుల, మురుగు నీటి కాలువలు లేవు. వైకుంఠధామానికి  నిధులు మంజూరు చేసినా స్థలం లేక పనులు ప్రారంభం కాలేదు.
* రజాలిపేటలో ఎస్సీ కాలనీతో పాటు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు.
* జమాండ్లపల్లిలో రెండు వార్డులు ఏర్పాటు చేశారు. జంగాల బజార్‌, ఎస్సీ, కాలనీ, యాదవనగర్‌తో ముత్యాలమ్మగూడెం, నాయకులగూడెం, చాకలి బజార్‌లో అంతర్గత రహదారులు, మురుగు నీటి కాలువలు లేవు.

సమంగా నిధుల కేటాయిస్తున్నాం : -డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, ఛైర్మన్‌.
సమస్యల ప్రాతిపదికన అన్ని వార్డులకు సమానంగా నిధులు మంజూరు చేస్తున్నాం. విలీన గ్రామాల పరిధిలో ఉన్న కొన్ని వార్డుల్లో 40 శాతానికంటే ఎక్కువ నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రస్తుతం విలీన గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ప్రత్యేకంగా రూ. 6 కోట్లు ప్రతిపాదించాం. ఆ నిధులు మంజూరైతే సమస్యలు పరిష్కారమవుతాయి.


వర్షం పడితే రహదారిపైనే నీరు

ఈ చిత్రంలో కనిపిస్తుంది.. మహబూబాబాద్‌ పురపాలక సంఘం 6వ వార్డు పరిధిలోని బేతోలు మాన్‌సింగ్‌ తండా. చిన్నపాటి వర్షం వస్తే చాలు రహదారిపైనే నిలిచి ఇరువైపుల ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతోంది. సైడు కాలువలు లేకపోవడంతో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.


ఇది అంతర్గత రహదారే..

మహబూబాబాద్‌ పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఉన్న అనంతారంలో ఉపేంద్రనగర్‌కు వెళ్లే రహదారి ఇది. రెండు వైపుల పచ్చని చెట్ల మధ్య ఉన్న దారి డొంక మార్గంలా ఉంది. ఈ ప్రాంతంలో సుమారు యాభైకి పైగా ఇళ్లు ఉంటాయి. రాత్రిపూట నడిచివెళ్లేందుకు స్థానికులకు కష్టాలు తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని