logo

అంబరాన్నంటేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్ని తాకేలా సోమవారం నుంచి ఈనెల 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.

Published : 08 Aug 2022 05:38 IST

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, చిత్రంలో జడ్పీ ఛైర్మన్‌  సుధీర్‌కుమార్‌, ఎంపీ దయాకర్‌,
చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు రాజయ్య, ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌ తదితరులు

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్ని తాకేలా సోమవారం నుంచి ఈనెల 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. కవి సమ్మేళనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు గాంధీ చలన చిత్రాన్ని చూపించాలన్నారు. ఇందుకోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ రవీందర్‌రావు, కలెక్టర్లు గోపి, శివలింగయ్య, బల్దియా కమిషనర్‌ ప్రావీణ్య, సీపీ తరుణ్‌జోషి, హనుమకొండ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా పరిషత్తు ఛైర్మన్లు సుధీర్‌కుమార్‌, గండ్ర జ్యోతి, సంపత్‌రెడ్డి, కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌  పాల్గొన్నారు.

15 రోజులపాటు కార్యక్రమాలు ఇలా..
8న ఉత్సవాల సమారోహం, 9న ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ, 10న గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్‌, 12న రాఖీ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవాలపై ప్రసారాలు, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ సామాజిక వర్గాలతో ర్యాలీలు, 14న సాంస్కృతిక సారథి కళాకారులతో నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రత్యేక జానపద కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ, 16న ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడే జాతీయ గీతాలపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ, 19న ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ, 20న దేశభక్తి జాతీయ స్పూర్తిని నింపేలా స్వయం సహాయక సంఘాలతో ముగ్గుల పోటీలు, 21న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు, నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల ప్రత్యేక సమావేశాల నిర్వహణ, 22న ఉత్సవాల ముగింపు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని