logo

భావి భారతం.. ఆరోగ్యరహితం

బడికెళ్తున్న బాల్యం బక్క చిక్కిపోతోంది.. పోషకాహారం అందక నీరసించిపోతోంది.. దృష్టి లోపంతో బాధపడుతోంది.. స్పష్టంగా మాట్లాలేకపోతోంది.. గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతోంది..

Published : 08 Aug 2022 05:38 IST

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి


ఎంజీఎంలో డైయిక్‌ కేంద్రంలో చిన్నారికి మాటలు నేర్పుతున్న నిపుణురాలు

బడికెళ్తున్న బాల్యం బక్క చిక్కిపోతోంది.. పోషకాహారం అందక నీరసించిపోతోంది.. దృష్టి లోపంతో బాధపడుతోంది.. స్పష్టంగా మాట్లాలేకపోతోంది.. గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతోంది.. అనారోగ్య సమస్యలతో అల్లాడుతోంది.. పేదరికం భావి భారత పౌరులను ఎదగకుండా చేస్తోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం కింద వివిధ పాఠశాలల్లో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో 1614 మంది బాలలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారందరినీ ఎంజీఎం ఆసుపత్రిలోని డైయిక్‌ కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందేలా వైద్యఆరోగ్యశాఖ, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు.  ప్రధానంగా పోషకాహార లోపం, దృష్టి లోపాలు, దంత సమస్యలు, పుట్టుకతో గుండె వ్యాధులతో బాధపడే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనందున ఈ సంవత్సరం పిల్లల ఆరోగ్యంపై అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల ఉపాధ్యాయులు, ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలు దృష్టి సారించాల్సిన అవసరముంది.

పోషకాహార లోపాలతో వచ్చే సమస్యలు
అలసట, చిరాకు, బుద్ధిమాంద్యం, శ్వాసక్రియ కష్టమవ్వడం, ఛర్మం నిర్జీవంగా మారడం, ముఖంపై బుగ్గలు తగ్గిపోవడం, శ్వాస వైఫల్యం, గుండె సంబంధిత జబ్బులు, పిల్లల్లో పెరుగుదల తగ్గడం, మాటలు సరిగా రాకపోవడం, మానసిక సమస్యలు పెరగడం, జీర్ణలోపాలు, కంటిచూపు తగ్గడం, రక్తహీనత వంటి వ్యాధులు చుట్టుముడతాయి.

గుర్తించింది ఇలా
జాతీయ ఆరోగ్య మండలి ఆర్థిక సహకారంతో నడుస్తున్న రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం ద్వారా ప్రత్యేక నియామకం చేసిన వైద్యులు ఉంటారు.  బృందంలో ఇద్దరు వైద్యులు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఫార్మసిస్టు ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 38 బృందాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో 32 అంశాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స కోసం ఎంజీఎంలోని డైయిక్‌ కేంద్రానికి రిఫర్‌ చేస్తారు. నిపుణులు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. విటమిన్‌ ఏ లోపాలు, విటమిన్‌ డి, శుక్లాలు, పెదవి చీలిక, థైరాయిడ్‌ పమప్య, పెరుగుదలలోపం, రుతుక్రమ రహితం వంటి మరో 23 రకాల సమస్యలతో బాధపడేవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

తల్లిదండ్రులూ తెలుసుకోండి
* పిల్లలు జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల వాటిలో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వు పదార్థాలు పిల్లల ఎదుగుదలకు హని చేస్తాయి.

* కార్బనేట్‌ డ్రింకులు తాగితే శరీరంలోని కాల్షియంపై ప్రభావం పడి ఎముకలు క్షీణిస్తాయి. పండ్ల రసాలు ఇస్తే మంచిది.

* రాత్రి పొద్దుపోయే వరకు టీవీ, చరవాణులు చేస్తుంటారు. నిద్రలేమితో రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి నిద్రపట్టడానికి గోరువెచ్చటి పాలు తాగించాలి.

* ఇన్‌డోర్‌ గేమ్స్‌కు ఎక్కువ అలవాటుపడ్డారు. ఫలితంగా ఎదుగుదల తగ్గుతోంది. పిల్లలను బయట ఆడించాలి.

* దోమ కాటు నుంచి రక్షణకు పొడవాటి చేతుల దుస్తులు వేస్తే మంచిది. కొబ్బరినూనే రాసినట్లయితే చర్మం తేమను సంతరించుకొని దద్దుర్లు, పొడిపారడం తగ్గుతాయి.


జాగ్రత్తలు తీసుకోవాలి

-రోహిణి సింధూరి, పోషకాహార నిపుణురాలు, ఎంజీఎం ఆసుపత్రి

ఎదిగే వయస్సులో పిల్లలకు పోషకాహారం అందేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. రక్తహీనత కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, పండ్లు, ఆహారంలో తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి. కంటిచూపు తగ్గకుండా ప్రతి రోజు తీసుకునే ఆహారంలో విటమిన్‌ ఏ ఉండే ఆహారం తీసుకోవాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని జిల్లా డైయిక్‌ కేంద్రానికి, పోషకాహార కేంద్రానికి తీసుకొస్తే వారికి మంచి చికిత్స అందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని