logo

ఆపదలో ఆదుకున్నవారే శ్రీమంతులు

ఆపదలో ఉన్న పేదలను ఆదుకున్న వారే అసలైన శ్రీమంతులని ఐటీడీఏ పీవో అంకిత్‌ పొన్ను పేర్కొన్నారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలనే సంకల్పంతో ‘ఈనాడు’.....

Published : 10 Aug 2022 04:16 IST


వరద బాధితులకు దుప్పట్లు, సామగ్రి పంపిణీ చేస్తున్న వైద్యులు

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న పేదలను ఆదుకున్న వారే అసలైన శ్రీమంతులని ఐటీడీఏ పీవో అంకిత్‌ పొన్ను పేర్కొన్నారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలనే సంకల్పంతో ‘ఈనాడు’ ఇచ్చిన పిలుపునకు వరంగల్‌ జిల్లా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సహాయ శిబిరం నిర్వహించి ఆపన్నహస్తం అందించింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యుల సంకల్పం మరెందరికో ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా.బాలాజీ, ప్రధాన కార్యదర్శి డా.నాగార్జున్‌రెడ్డి, కోశాధికారి డా.సనత్‌కుమార్‌, సీనియర్‌ సభ్యులు డా.బందెల మోహన్‌రావు, డా.సంధ్యారాణి, డా.కవిత, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ డా.తుమ్మ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయమందించారు. సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం 450 మందికి రూ. లక్ష విలువైన దుప్పట్లు, వంట గిన్నెలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. సర్పంచి రామ్మూర్తి, ఎంపీపీ విజయ, జడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న, స్థానిక వైద్యుడు వరప్రసాద్‌ పాల్గొన్నారు.

సంతోషంగా ఉంది : -జంగపల్లి కాంతయ్య, ఏటూరునాగారం
నేను కూలీ పనులు చేసుకుంటేనే జీవనం సాగుతుంది. ఇటీవల ఇల్లు మునిగి సర్వం కోల్పోయాను. నెల రోజులుగా నా భార్యా పిల్లలకు తిండిపెట్టలేని దీనమైన స్థితిలో ఇబ్బంది పడుతున్నా. నాలాంటి పేదల కోసం ‘ఈనాడు’ పిలుపు మేరకు ఐఎంఏ డాక్టర్లు వచ్చి సాయమందించడం సంతోషంగా ఉంది.

ఆదుకునే అవకాశం రావడం మా అదృష్టం : -డా.బాలాజీ, ఐఎంఏ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు
కష్టంలో ఉన్నవారిని ఆదుకునే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల్లో మరిన్ని శిబిరాలు నిర్వహించేందుకు ఐఎంఏ సిద్ధంగా ఉంది. ఆపదలో ఉన్న వారు సంప్రదించవచ్చు. సభ్యులందరి సహకారం, సమన్వయంతో మున్ముందు సేవలు విస్తరిస్తాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని