logo

పెరుగుతున్న గోదారి.. ఆందోళనలో ప్రజలు

గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గతనెలలో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలు.. మళ్లీ వరద పెరుగుతుండడంతో భయాందోళనలకు గురవుతున్నారు.

Published : 10 Aug 2022 04:21 IST


కంకలవాగు ఉద్ధృతికి వెంకటాపురం, మల్లాపురం మధ్య నిలిచిన రాకపోకలు

వాజేడు, మంగపేట, న్యూస్‌టుడే: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గతనెలలో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలు.. మళ్లీ వరద పెరుగుతుండడంతో భయాందోళనలకు గురవుతున్నారు. జాతీయరహదారిలోని పూసూరు-ముల్లెకట్ట హైలెవెల్‌ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువప్రాంతంలోని ప్రాజెక్టులు, ప్రాణహిత, ఇంద్రావతి గోదావరి ఉపనదుల నుంచి వస్తున్న వరదనీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలోని టేకులగూడెం సమీపంలో జాతీయరహదారి ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు-గుమ్మడిదొడ్డి గ్రామాలమధ్య రహదారిపై కొంగాలవాగు వరద చేరింది. రెండురోజులుగా స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రి నుంచి వేగంగా పెరుగుతోంది. పేరూరులో మంగళవారం సాయంత్రం 6 గంటలకు 47.39 అడుగులకు (14.45 మీటర్లు) చేరుకుంది.

ఉప్పొంగిన వాగులు
వెంకటాపురం: మండలంలోని వాగులకు గోదావరి వరద పోటెత్తింది. పెంకవాగు, కంకలవాగు, జిన్నెలవాగు, బల్లకట్టువాగు, కుక్కతోగువాగులు మంగళవారం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం అధికం కావడంతో వాగులు ప్రమాదకరంగా మారాయి. వెంకటాపురం-మల్లాపురం మార్గ మధ్యలో కంకలవాగు ఉద్ధృతికి రాకపోకలు ఆగాయి. పెంకవాగు లోలెవల్‌ చప్టా వరద నీటి ముంపునకు గురైంది. ఆవలి ప్రాంతంలోని గిరిజనులు ప్రవాహంలోనే రాకపోకలు సాగించారు. ద్విచక్రవాహనాలను సైతం మోసుకొని వాగు దాటించుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో మళ్లీ కష్టాలు తప్పేలా లేవని గిరిజనం ఆందోళన చెందుతున్నారు.


కమలాపురం ఇన్‌టేక్‌వెల్‌ వద్ద నది ప్రవాహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని