logo

నిలువెత్తు తెలుగుదనం.. పోరుగడ్డతో అనుబంధం

దాశరథి రంగాచార్యులు, వనమామలై వరదాచార్యులు, కాళోజీ సోదరులు వంటి మహాకవులు కాకతీయుల సాంస్కృతిక వారసత్వాన్ని తెలుగు ప్రజలకు అందించారు.

Updated : 10 Aug 2022 05:04 IST

వెంకయ్యనాయుడి సేవలను గుర్తు చేసుకుందాం

దాశరథి రంగాచార్యులు, వనమామలై వరదాచార్యులు, కాళోజీ సోదరులు వంటి మహాకవులు కాకతీయుల సాంస్కృతిక వారసత్వాన్ని తెలుగు ప్రజలకు అందించారు.

- ఏవీవీ విద్యాసంస్థ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో వెంకయ్య నాయుడు

పరిచయం అక్కరలేని మహామనిషి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఎక్కడ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కారం చూపి అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో సేవలందించి తెలుగువారి కీర్తిని హిమాలయాల ఎత్తుకు పెంచారు. దేశంలో అత్యున్నత స్థానాల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా ఆ పదవికి వన్నెతెచ్చారు.  బుధవారంతో ఆ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ‘ప్రత్యేక కథనం’..

కాజీపేట, న్యూస్‌టుడే

వివిధ హోదాల్లో వెంకయ్యనాయుడు వరంగల్‌ జిల్లాలో దాదాపు 25 సార్లు పర్యటించారు. ఇక్కడ సమావేశం అంటే ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. అనేక సభలు, భాజపా చేపట్టిన యాత్ర, ముఖ్యమైన కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం ఆయన వరంగల్‌కు వచ్చారు.

సామాన్య కార్యకర్తగా..
1969లో కాకతీయ మెడికల్‌ కళాశాలలో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో వెంకయ్య నాయుడు ఒక సామాన్య కార్యకర్తగా పాల్గొన్నారు. ఆయన గొప్ప పదవులు అలంకరించాక గానీ వరంగల్‌కు ఇలా వచ్చారని తెలియదు. ఈ సభలు జరిగాక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.


కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైలు దిగి వస్తూ..

గ్రామాలకు తరలండి..
* 1983లో ములుగురోడ్‌ సమీపంలో ఏకశిలా హోటల్‌లో జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కార్యకర్తలతో గడిపి తన ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు.
* 1987-88లో భాజపా గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌లో 9 రోజుల పాటు ఉన్నారు. రోజుకు ఒకటి చొప్పున 9 గ్రామాల్లో ఆయనతో పాటు తాను నిద్రించానని మార్తినేని ధర్మారావు చెప్పారు. ఈ తర్వాత మూడు సార్లు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ హాజరయ్యారు.

ప్రతి యాత్రలో..
భాజపా చేపట్టిన యాత్రలు వరంగల్‌కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ మనకు వెంకయ్యనాయుడు కనిపిస్తారు. 1990లో ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రాం రథయాత్ర, 1991లో మురళీ మనోహర్‌ జోషి చేపట్టిన ఏకతాయాత్ర, స్వాతంత్య్ర సిద్ధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1996లో చేపట్టిన స్వర్ణజయంతి యాత్రలో ఎల్‌కే అడ్వాణీతో పాటు పాల్గొన్నారు.


స్వర్ణజయంతి యాత్రలో (ఎడమ నుంచి కుడికి) వెంకయ్య నాయుడు, రాజయ్య యాదవ్‌, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌కే అడ్వానీ, ఏలే నరేంద్ర

స్కూటరు మీద హనుమకొండకు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఏకతాయాత్రలో పాల్గొనడానికి రైలులో కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగారు. నడుచుకుంటూ చౌరస్తాకు వచ్చి అక్కడ నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నార్లగిరి రామలింగం ఏర్పాటు చేసిన భాజపా జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి వెళ్లడానికి ఒక నాయకుడి కారు రావాల్సింది కానీ రాలేదు. కొంత సేపు రోడ్డుమీదే వేచి చూసి ఆ తర్వాత నరహరి వేణుగోపాల్‌ స్కూటరుపై వెనక కూర్చుని గెస్ట్‌ హౌస్‌కు వెళ్లారు.

ప్రగతి సింగారానికి పేరుపెట్టింది ఆయనే..
శాయంపేట మండలంలో ప్రస్తుతం ప్రగతి సింగారంగా పిలుచుకునే గ్రామానికి ఆ పేరు పెట్టింది వెంకయ్యనాయుడే. అంతకు ముందు ఈ గ్రామాన్ని దొంగల సింగారం అని పిలిచేవారు. ఒక పర్యటనలో ఈ పేరు విని అప్పటి ఎంపీ జంగారెడ్డిని పిలిచి ఈ పేరు బాగాలేదు ప్రగతి సింగారం అని పేరు పెట్టమని సూచించారు.. జంగారెడ్డి దాన్ని అనుసరించారు.

ఉపరాష్ట్రపతిగా మొదటిసారి వరంగల్‌కు
ఎన్‌ఐటీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు 2018 అక్టోబర్‌ 8న వరంగల్‌కు వచ్చారు. ఇక్కడ రూ.25 కోట్లతో నిర్మించిన అల్యూమినీ భవనానికి శంకుస్థాన చేశారు. వరంగల్‌ ఎన్‌ఐటీ లాంటి గొప్ప విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులని.. వారు లక్ష్యాన్ని గొప్పగా ఎంచుకుని వాటిని సాధించుకునే దిశలో సాగాలని సందేశం ఇచ్చారు.


ఎన్‌ఐటీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభిస్తూ..

స్మార్ట్‌ సిటీపై మక్కువ..
వరంగల్‌ను స్మార్ట్‌ సిటీగా చూడాలనేది ఆయన కోరిక. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2014లో వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ పనులను ప్రారంభించారు. వరంగల్‌కు హెరిటేజ్‌ సిటీగా, అమృత్‌, హృదయ్‌ పథకాలు రావడానికి చొరవ చూపారు.
* రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతోనూ ఆయన పాత్ర గొప్పగా చెబుతారు. హెరిటేజ్‌ సిటీ అభివృద్ధి పనులపై వెయ్యి స్తంభాల ఆలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

తెలుగు భాషాభివృద్ధికి..
చందాకాంతయ్య నిజాం సర్కారును ఎదిరించి వరంగల్‌లో స్థాపించిన ఏవీవీ  తెలుగు విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు 2020 ఫిబ్రవరి 23న ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ మాతృభాషా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక భాషల్లో ఉపాధిని అనుసంధానం చేయాలన్నారు
* ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 నియోజక వర్గాల్లో ఏదో ఒక సమయంలో వెంకయ్యనాయుడు సందర్శించి అక్కడి ప్రజలపై చెరగని ముద్ర వేశారు. గత 40 ఏళ్లుగా వరంగల్‌లో ఆయన చేసిన ప్రతి యాత్రలోను నేను పక్కనే ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.

- సీనియర్‌ భాజపా నాయకుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి

* వరంగల్‌ జిల్లా అంటే నాయుడుకు ఎనలేని ప్రేమ. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వరంగల్‌ను భాగస్వామ్యం చేయడంలో ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. అందుకే మనకు హృదయ్‌, స్మార్ట్‌సిటీ, అమృత్‌లాంటి పథకాలు వచ్చాయి.

- మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే


ఆయన ఉపన్యాసం కోసం..


సస్యశ్యామల యాత్రలో విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ,  వెంకయ్యనాయుడు, కృష్ణంరాజు తదితరులు

సస్యశ్యామల యాత్రలో భాగంగా 1998లో ములుగుకు వచ్చారు. అప్పట్లో భాజపా సభలకు అంతగా జనం వచ్చేవారు కాదు.. నాయకులు ఊహించనంతగా సుమారు 30 వేల మంది దీనికి హాజరయ్యారు. వారంతా వెంకయ్యనాయుడి ఉపన్యాసం వినడానికి వచ్చినట్లు నాయకులు గుర్తించారు.
* గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా హసన్‌పర్తి మండలంలోని జయగిరి నుంచి పెంబర్తికి రోడ్డును మంజూరు చేశారు. దాని శంకుస్థాపన కార్యక్రమానికీ వచ్చారు. అప్పుడు మార్తినేని ధర్మారావు ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts