logo

7 ప్రాంతాలు.. 7 అంశాలు.. 525 గొంతుకలు

జాతీయభావం ఉప్పొంగేలా 75 మంది చిన్నారుల దేశభక్తి నినాదాలు అందరినీ ఆకర్షించాయి. త్రివర్ణ పతాకాలు చేతపట్టి మహిళలు నిర్వహించిన స్వేచ్ఛా ర్యాలీ పలువురిని ఆలోచింపజేసింది.  ఇలా ఉమ్మడి జిల్లాలోని 7 ప్రాంతాల్లో ‘ఈనాడు-ఈటీవీ’

Updated : 11 Aug 2022 04:26 IST

వజ్రోత్సవాలకు గుర్తుగా ప్రతిచోట 75 మంది..

-ఈనాడు, వరంగల్‌

జాతీయభావం ఉప్పొంగేలా 75 మంది చిన్నారుల దేశభక్తి నినాదాలు అందరినీ ఆకర్షించాయి. త్రివర్ణ పతాకాలు చేతపట్టి మహిళలు నిర్వహించిన స్వేచ్ఛా ర్యాలీ పలువురిని ఆలోచింపజేసింది.  ఇలా ఉమ్మడి జిల్లాలోని 7 ప్రాంతాల్లో ‘ఈనాడు-ఈటీవీ’ నిర్వహించిన 7 కార్యక్రమాలు అమృతోత్సవాల స్ఫూర్తిని చాటాయి.  మహిళలు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ప్రగతిని ప్రతిఫలించే ఈ కార్యక్రమాలతో  గొప్ప సందేశం ఇచ్చారు.  


యోగా.. ఆరోగ్య భారతం

దామెర: దామెర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 75 మంది కలిసి ఒకేసారి యోగాసనాలు వేశారు. తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, పద్మాసనం, ఉష్ట్రాసనం, చక్రాసనంలతో పాటు మరికొన్ని ఆసనాలను సాధన చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు కమలాకర్‌ మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


సైకిల్‌..  దేశ ప్రగతి చక్రం

మట్టెవాడ: వరంగల్‌ మట్టెవాడ ప్రభుత్వ, హంటర్‌రోడ్డు ఆర్యవైశ్య పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలను కట్టడి చేయడానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి సైకిల్‌ తొక్కడం ఎంతో ప్రయోజనమని ప్రధానోపాధ్యాయుడు డి.పూసారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీవీ అశోక్‌కుమార్‌, వి.కిరణ్‌, డి.కిరణ్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


జయజయ ధ్వనులే నినాదమై..

న్యూశాయంపేట: జై జవాన్‌ జైకిసాన్‌..డూ ఆర్‌ డై.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఇలాంటి నినాదాలెన్నో ప్రజల్లో దేశభక్తిని రగిలించాయి. ఇలాంటి 75 నినాదాలను  న్యూశాయంపేట బస్తీ బడి విద్యార్థులు ఘనంగా నినదించారు. ప్రేరణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు స్వాతంత్య్ర ఘట్టాలను గుర్తు చేసుకోవాలని, అందుకే ప్లకార్డులు చేసి ఇచ్చామని తెలిపారు.


అవయవదానం.. సేవా స్ఫూర్తి

స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ నేత్ర, అవయవ దానానికి యువత ముందుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా అవయవదానం, శరీర దానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న  తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి బుధవారం వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో 75 మంది ఎన్‌సీసీ, ఇతర విద్యార్థులకు అవగాహన కల్పించి వారి నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, సదానందం, సుమన్‌, వెంకన్న, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


పచ్చదనం.. పర్యావరణ సోపానం

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌:  పట్టణంలోని ఏకశిల పాఠశాల 75 మంది విద్యార్థులు  నందినగర్‌లో ప్రభుత్వ స్థలంలో మొక్కలను నాటారు. వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మహబూబాబాద్‌ పట్టణంలోని నలంద జూనియర్‌, డిగ్రీ కళాశాల ఎన్‌ఎన్‌ఎస్‌ వాలంటీర్లు, విస్‌డం పాఠశాల విద్యార్థులు కలిసి స్థానిక మార్కండేయ ఆలయం సమీపంలో పారిశుద్ధ్య పనులు చేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రసాద్‌, అధ్యాపకులు గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.


చిత్రం.. దేశ వైభవం నిక్షిప్తం

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతులకు చెందిన 75 మంది విద్యార్థులు స్వాతంత్య్ర వజ్రోత్సవాల వైభవాన్ని చిత్రాలు గీసి ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ..విద్యార్థుల్లో జాతీయతను ఇనుమడింపజేసే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.  చిత్రలేఖనం ఉపాధ్యాయుడు సయ్యద్‌ హష్మతుల్లా పాల్గొన్నారు.


స్వేచ్ఛకు ప్రతిరూపం

భూపాలపల్లి, న్యూస్‌టుడే: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జాతీయ జెండాలతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుభాష్‌కాలనీ రామాలయం నుంచి జయశంకర్‌ పార్కు వరకు ఇది కొనసాగింది. స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన వీరులను స్మరించుకున్నారు. ఇంటింటా జాతీయ జెండాలను మహిళలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీవో నిర్మల, ఆర్‌పీ మల్లేశ్వరి, 17వ వార్డు అధ్యక్షురాలు లలిత, మంజుల, హజీరా, శోభారాణి, రాధా, సుజాత తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని