logo

వజ్రోత్సవాలకు సమన్వయంతో పనిచేయాలి

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 15న ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద జరిగే  వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి గోపి ఆదేశించారు.

Published : 11 Aug 2022 03:48 IST

స్థల పరిశీలన చేస్తున్న కలెక్టర్‌ గోపి, ఆర్డీవో మహేందర్‌జీ, ఏసీపీ నరేష్‌కుమార్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 15న ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద జరిగే  వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి గోపి ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్‌ సెమినార్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  వివిధ శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు. అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే: ఖిలావరంగల్‌ కోటలో ఈ నెల 15న స్వాతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కలెక్టర్‌ గోపి బుధవారం పరిశీలించారు. మధ్యకోట ఖుష్‌మహల్‌ పక్కన ఖాళీ స్థలం అనుకూలంగా ఉందా, వేరే ప్రాంతంలో చేయాలా అనే విషయాలపై ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ ఫణికుమార్‌, మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌, డీపీఆర్వో పల్లవి, కోట కోర్డినేటర్‌ శ్రీకాంత్‌, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌తో చర్చించారు.

విస్తృత ఏర్పాట్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యకూడళ్లను మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించాలని మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య కోరారు. బుధవారం సాయంత్రం అన్ని విభాగాల వింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 వరకు వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ 13వ తేదీలోగా పూర్తవ్వాలని, అదే రోజూ మైదానాల్లో బెలూన్లు ఎగుర వేయాలని, 16న 66 డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన, 19న పలివేల్పుల, క్రిస్టియన్‌ కాలనీలో నిరాశ్రయుల కేంద్రాల్లో పండ్ల పంపిణీ, 20న ఎస్‌హెచ్‌జీ మహిళలకు ముగ్గుల పోటీలు, 21న ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మేయర్‌, కమిషనర్లు సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ రషీద్‌, ఉపకమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ విజయలక్ష్మి, సీఎంహెచ్‌వో డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, సీహెచ్‌వో శ్రీనివాస్‌, ఈఈ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు పరుగు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఫ్రీడమ్‌ పరుగు నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి సొటాల ఇందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6.30 గంటలకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఓసిటీలోని క్రీడామైదానం వరకు ఈ పరుగు కొనసాగుతుంది. యువతకు ఈ నెల 13, 14వ తేదీల్లో అండర్‌-17, 20 విభాగాల్లో మండల స్థాయి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ పోటీలు ఈ నెల 18న ఓసిటీ మైదానంలో జిల్లాస్థాయి జూడో, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌, రెజ్లింగ్‌ తదితర అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు 19వ తేదీన బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చదరంగం, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నికాయిట్‌లో పోటీలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని