logo

నిధులు పరిచి.. నాణ్యత మరిచి!

‘రాజుల సొమ్ము రాళ్లపాలైనట్లు’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృధ్ధికి కేటాయిస్తున్న నిధులు గుత్తేదారుల పాలవుతున్నాయి. కొత్తగా నిర్మించిన రహదారులు, వంతెనలు, భవనాలు, పంట, మురుగు కాల్వల లైనింగ్‌, చెరువు తూములు..

Published : 11 Aug 2022 03:48 IST

కొద్ది కాలానికే ధ్వంసమవుతున్న రహదారులు

వాజేడు మండలం చండ్రుపట్ల సమీపంలో రోడ్డు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోగా బయటపడిన కల్వర్టు పైపులు

వెంకటాపురం, ములుగు, న్యూస్‌టుడే: ‘రాజుల సొమ్ము రాళ్లపాలైనట్లు’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృధ్ధికి కేటాయిస్తున్న నిధులు గుత్తేదారుల పాలవుతున్నాయి. కొత్తగా నిర్మించిన రహదారులు, వంతెనలు, భవనాలు, పంట, మురుగు కాల్వల లైనింగ్‌, చెరువు తూములు.. పట్టుమని పది నెలలు నిలవకుండానే ఛిద్రమైపోతున్నాయి. నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఉన్నప్పటికీ వారిచ్చే ధ్రువపత్రాలు నామమాత్రంగా మారుతున్నాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ కొరవడుతోంది.

‘తారు’మారైనా.. తీరు మారలే!

* వాజేడు మండలంలోని 163 జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఎల్‌డబ్ల్యూఈ నిధుల కింద ఈ ఏడాది చంద్రుపట్ల-గంగారం, టేకులగూడెంల మీదుగా రెండు లింకు రోడ్లను నిర్మించారు. రూ. కోట్ల నిధులు వెచ్చించి ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో పనులను మే నెలలోనే పూర్తి చేశారు. గత నెలలో వరదలకు చంద్రుపట్ల నుంచి ఫెర్రీకి వెళ్లే మార్గం సుమారు 500 మీటర్లు, పేరూరు-టేకులగూడెం మార్గం దాదాపు 400 మీటర్ల మేరా కొట్టుకుపోయింది. సుమారు రూ.కోటి నష్టం జరిగినట్లు ర.భశాఖ అధికారులు అంచనా వేశారు. వేసిన మూడు నెలలకే కొట్టుకుపోవడం నాణ్యతకు అద్దం పడుతోంది.

* వెంకటాపురం-మల్లాపురం మధ్య పీఎంజీఎస్‌వైలో భాగంగా రూ.2.66 కోట్లు వెచ్చించి 4.1 కిమీ తారుదారిని నిర్మించారు. ఆరంభంలోనే అధిక వర్షాలకు కంకలవాగు ప్రవాహ ఉద్ధృతికి చెంతనే సుమారు 50 మీటర్ల దారి పూర్తిగా కొట్టుకుపోయి మొరం బయటపడింది. గత నెలలో గోదావరి వరద, వాగు ప్రవాహానికి మరో ప్రాంతంలో సుమారు 100 మీటర్ల మేర తారు మారైంది. రూ.15 లక్షల మేరకు ప్రజాప్రధనం దుర్వినియోగం జరిగింది.  

* ములుగు మండలం ములుగు-బుద్దారం రోడ్డు పటిష్ఠం, విస్తరణ పేరుతో 2016లో రూ. 15 కోట్లు మంజూరు చేశారు. 16 కిలోమీటర్ల పొడవు గల ఆ రోడ్డు పనిని సుమారు నాలుగేళ్లకు పూర్తి చేశారు. నిర్మాణం జరుగుతుండగానే అక్కడక్కడా రోడ్డుపై గుంతలు పడడం ప్రారంభమైంది. రోడ్డు మధ్యలో డివైడర్‌ నిర్మాణం జరిగింది. ప్రస్తుం అది అక్కడక్కడా కూలిపోతోంది. రోడ్డుపై గుంతలు పడుతున్నాయి.

ధ్వంసమైన వెంకటాపురం-మల్లాపురం తారుదారి

పైపై పనులు..

వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఆర్‌అండ్‌బీకి చెందిన రెండు లైన్ల భద్రాచలం-చండ్రుపట్ల మార్గం 48 కి.మీ విస్తరించి ఉంది. ఈ రహదారి పునఃనిర్మాణం చేపట్టకపోవడంతో వందల సంఖ్యలు గుంతలు ఏర్పడ్డాయి. గతేడాది మరమ్మతు పనులకు గాను ఆర్‌అండ్‌బీ శాఖ రూ.40 లక్షలను కేటాయించింది. ఎప్పుడూ అప్పగించే గుత్తేదారులకు ఈ గుంతల పూడ్చివేత మరమ్మతులు చేజిక్కాయి. ఇంకేముంది పైపై పూత పూసి నిధులను పక్కదారి పట్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరమ్మతులు చేపట్టగా ఇటీవల వర్షాలకు మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

అధికారులు ఏమంటున్నారంటే..

‘గోదావరి ఉగ్రరూపానికి చంద్రుపట్ల, పేరూరు మధ్య రహదారి కొట్టుకుపోయింది. నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు జరగలేదు. సుమారు రూ. కోటి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించాం. ఆ పనులు మళ్లీ గుత్తేదారునే చేపట్టాలని ఆదేశించాం. వారితోనే నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాం’ అని ఆర్‌అండ్‌బీ డీఈ రఘువీర్‌ పేర్కొన్నారు. వెంకటాపురం-మల్లాపురం మధ్య తారుమారైన రహదారిని బాగు చేయాలని గుత్తేదారుకు మౌఖికంగా సూచించామని పీఆర్‌ ఏఈ రాజేశ్‌ తెలిపారు. వర్షాలు తగ్గాక ఆ పనులు చేయిస్తామన్నారు.

రెండేళ్ల వరకు గుత్తేదారుదే బాధ్యత - వెంకటేశ్వర్లు, ఈఈ, రోడ్లు భవనాల శాఖ

నిర్మాణ పని ఏదైనా సరే పని పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు గుత్తేదారుదే బాధ్యత ఉంటుంది. పని జరుగుతుంటే దశల వారీగా బిల్లుల చెల్లింపు జరుగుతుంది. చివరి బిల్లు చెల్లించే ముందు క్వాలిటీ కంట్రోలు అధికారులు నాణ్యతపై ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి పనికి క్వాలిటీ కంట్రోలు నియంత్రణ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని