logo

కాలానుగుణ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు

‘వర్షాకాలం ఆరంభం కాగానే వాతావరణంలో కలిగే మార్పులు, పరిసరాల అపరిశుభ్రత వంటి కారణాలతో కాలానుగుణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి మెరుగైన వైద్య చికిత్స పొందడం

Published : 11 Aug 2022 03:48 IST

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి హరీష్‌రాజ్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ‘వర్షాకాలం ఆరంభం కాగానే వాతావరణంలో కలిగే మార్పులు, పరిసరాల అపరిశుభ్రత వంటి కారణాలతో కాలానుగుణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి మెరుగైన వైద్య చికిత్స పొందడం వల్ల ప్రాణాపాయం తప్పుతుంది’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. కాలానుగుణ వ్యాధుల నివారణ, చికిత్సలపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారితో నిర్వహించిన ‘ఈనాడు’ నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి రోగులు తమ అనారోగ్య సమస్యలు, నేరుగా వైద్యాధికారికి వివరించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


సమస్య: గార్ల మండలం చిన్నకిష్టాపురం పంచాయతీ పరిధిలోని తండాల్లో వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇటీవల వాంతులు, విరోచనాలతో ఒకరు మృతి చెందారు. తండాలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? - మాలోతు సురేష్‌, చిన్నకిష్టాపురం.
డీఎంహెచ్‌వో: తండాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. ముందుగా గ్రామంలోని ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను సంప్రదిస్తే ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఆరోగ్య ఉపకేంద్రాలకు వెళితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.


కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యా. రెండు రోజులుగా  నీరసంగా అనిపిస్తుంది. గ్రామీణ వైద్యుని సంప్రదించి మందులు వాడుతున్నా. -వి.భద్రయ్య, ఇనుగుర్తి
కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.  నీరసంగా ఉందంటున్నారు కాబట్టి అవసరమైతే ఆసుపత్రిలో జాయిన్‌ చేసుకొని మెరుగైన వైద్య అందిస్తారు.


కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నాం. తర్వాత ఎన్ని రోజులకు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలి. ఎక్కడ వేయించుకోవచ్చు. - దరావతు రాజు, డోర్నకల్‌
రెండో డోస్‌ వేసుకుని ఆరు నెలలు గడిచిన తర్వాత ఎప్పుడైన బూస్టర్‌ డోస్‌ వేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బూస్టర్‌ డోస్‌ అందుబాటులో ఉన్నాయి.


మలేరియా, టైఫాయిడ్‌ నిర్ధారణకు పరీక్షలు ఎక్కడ చేస్తారు. ఫలితాలు ఎప్పుడు వస్తాయి? -బి.మల్లేశం, కందికొండ, కురవి మండలం

గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రాథమికంగా జ్వరాలకు మందులు ఉచితంగా ఇస్తారు. జ్వరం తగ్గనట్లయితే లక్షణాల మేరకు మలేరియా సంబంధించి రెండు రకాల పరీక్షలు ఉంటాయి. మొదటగా ఆర్‌టీపీసీఆర్‌ చేసి వెంటనే చెబుతారు. అనుమానముంటే రక్తనమూనా సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. టైఫాయిడ్‌ నిర్ధారణకు కూడా రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు పంపిస్తారు. మరుసటి రోజే ఫలితం వస్తుంది. రోగి చరవాణికి కూడా సమాచారం వస్తుంది.


నాకు రెండుసార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తరువాత శరీరం బలహీనంగా ఉంది. మరోసారి వస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా? - ఎం.శ్రీనివాస్‌, మహబూబాబాద్‌

రెండుసార్లు పాజిటివ్‌ వచ్చినా వారిలో ఉన్న రోగ నిరోధక శక్తిని బట్టి కొందరు ఆరోగ్యంగా ఉంటారు. మరికొందరు బలహీనంగా కనిపిస్తారు. పౌష్టికాహారం, పండ్లు తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే కరోనా పలుమార్లు రావచ్చు. ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. వైద్యులను సంప్రదించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.


జ్వరం వచ్చి నీరసంగా ఉంటోంది. ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుంటే ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేస్తారా? - బి.రాములు, మహబూబాబాద్‌.

ప్లేట్‌లెట్స్‌ తక్కువగా ఉన్నాయని భయాందోళన వద్దు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరితే చికిత్స ప్రారంభిస్తారు. అన్ని రకాల వ్యాధులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని సర్కారు ఆసుపత్రులో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు.


మొదట జలుబు, దగ్గుతో పాటు జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ వద్ద మందులు వాడాం. నెల రోజుల నుంచి దగ్గు తక్కువ కావడం లేదు.? - కె.సరస్వతి, మహబూబాబాద్‌.
దగ్గు తగ్గడం లేదంటున్నారు. ఊపిరిత్తులకు సంబంధించి ఇతర అనారోగ్య సమస్యలు ఉండవచ్చు అందువల్ల పీహెచ్‌సీకి వెళితే తెమడ పరీక్షలు నిర్వహిస్తారు. వెంటనే పరీక్ష చేయించుకొని మందులను వాడాలి. వైద్యులను సంప్రదించాలి.


కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? -జి.రమేష్‌, మల్యాల
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. నిరుపయోగంగా ఉన్న కుండీలు, టైర్లు, ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీరు నిలువకుండా చూడాలి. దోమలు నిర్మూలించే చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని