logo

స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు కదిలించాయి

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రెండు సినిమా థియేటర్లలో బుధవారం ఉదయం పాఠశాల విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమాను ప్రదర్శించారు. మొదటి రోజు మంగళవారం కలెక్టర్‌ భవేష్‌మిశ్రా విద్యార్థులతో

Published : 11 Aug 2022 03:48 IST

‘గాంధీ’ సినిమా చూసిన విద్యార్థుల మనోగతం


భూపాలపల్లిలోని ఓ థియేటర్‌లో..

భూపాలపల్లి, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రెండు సినిమా థియేటర్లలో బుధవారం ఉదయం పాఠశాల విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమాను ప్రదర్శించారు. మొదటి రోజు మంగళవారం కలెక్టర్‌ భవేష్‌మిశ్రా విద్యార్థులతో కలిసి సినిమాను వీక్షించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులను పాఠశాలల బస్సుల్లో థియేటర్లకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి మనోగతాన్ని ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. భారత స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు.  దేశ చరిత్ర తెలుసుకోవడం ఆనందంగా ఉందని, మహాత్మాగాంధీ పాత్ర వెలకట్టలేనిదన్నారు.  

మనుషులంతా ఒక్కటే - వి.చరణ్‌, పదో తరగతి

స్వాతంత్య్ర ఉద్యమంలో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ఎందరో ప్రాణత్యాగం చేశారని, సినిమా చివర్లో హిందూ, ముస్లింలు మతం పేరుతో  ఘర్షణలకు పాల్పడిన సన్నివేశాలు బాధ కలిగించాయి. మనుషులంతా ఒక్కటేనని బాపూజీ చెప్పిన మాటలు ఎంతగానో నచ్చాయి.  ఇతరులతో ప్రేమతో మెలగాలనే సందేశం నచ్చింది.  

మహిళలను గౌరవించాలి - జి.రాహుల్‌రెడ్డి

సమాజంలో మహిళలను పురుషులతో సమానంగా గౌరవించాలని, వారిపై వివక్ష చూపకూడదనే విషయం బోధపడింది. గాంధీ చేనేత వస్త్రాలను నేయడం కొత్త అనిపించింది. చేనేత వస్త్రాల తయారీని ప్రభుత్వంతో పాటు ప్రజలు ప్రోత్సహించాలని తెలుసుకున్నా. మతం పేరుతో దేశం విడిపోవడం బాధాకరం. ఈ దేశంలో అందరూ సమానమనే భావన రావాలి.

కుల వివక్షను అధిగమిద్దాం - జి.సంజయ్‌

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో చదువుకునే సమయంలో ఎదుర్కొన్న వివక్ష బాధించింది. దీనిపై ఆయన పోరాడిన తీరు ప్రజలను సంఘటితం చేసి, ఉద్యమాలు చేయడం ఆకట్టుకున్నాయి. దేశంలో కుల వివక్షను అధిగమించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం ఎల్లప్పుడూ ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉండాలని నేర్చుకున్నా.

మహనీయుల త్యాగంతోనే స్వాతంత్య్ర సాధన - ఎండి.మైహినోజ్‌, 7వ తరగతి

గాంధీ చిత్రం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం, సమరయోధుల గురించి తెలుసుకునే అవకాశం కల్గింది. ఎందరో మహనీయుల త్యాగంతోనే  స్వాతంత్య్రం సిద్ధించిందని తెలుసుకున్నా. ఈ అవకాశం రావడం మంచిదని భావిస్తున్నా. మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర సాధన గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ప్రభావితం చేసింది - టి.రమ్య, 7వ తరగతి

మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నన్ను ప్రభావితం చేసింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా స్వదేశీ వస్తువుల తయారీ, వినియోగించాలనే అంశాలు నాకు నచ్చాయి. మన దేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలనే విషయం అర్థమైంది. గాంధీజీ అహింస, సత్యం నినాదాలు ప్రేరణ కల్గించాయి. అహింసావాదంతో స్వాతంత్య్ర సిద్ధించేలా చేయడం ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని