logo

జెండా ఎగరేసి ప్రాణాలొదిలిన యుద్ధవీరుడు

లచ్చవ్వా.. బిడ్డలను జాగ్రత్తగా చూసుకో.. పసివాడిని ఏడవకుండా చూడు.. ఇంటిమీదకు రజాకార్లు రావొచ్చు.. అని రోజూ చెబుతుండే ఆయనకు ఆ రోజే చివరి ఘడియలు సమీపిస్తాయనుకోలేదు ఆమె. 15 రోజుల బాబును, ఇద్దరు బిడ్డలను,

Published : 11 Aug 2022 03:53 IST

నేడు బత్తిని మొగిలయ్యగౌడ్‌ వర్ధంతి

-ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, ఖిలావరంగల్‌

లచ్చవ్వా.. బిడ్డలను జాగ్రత్తగా చూసుకో.. పసివాడిని ఏడవకుండా చూడు.. ఇంటిమీదకు రజాకార్లు రావొచ్చు.. అని రోజూ చెబుతుండే ఆయనకు ఆ రోజే చివరి ఘడియలు సమీపిస్తాయనుకోలేదు ఆమె. 15 రోజుల బాబును, ఇద్దరు బిడ్డలను, భార్యను శాశ్వతంగా వదిలి దేశం కోసం ప్రాణాలు వదిలారు ఆయన. ఆయనే బత్తిని మొగిలయ్య. స్వాతంత్య్ర పోరాటంలో ఆయనదో ప్రత్యేక స్థానం.. తన సహచరులను కాపాడుకోవడానికి 1946 ఆగస్టు 11న నేలకొరిగిన మొగిలయ్యను  ఘనంగా స్మరించుకుందాం..  

వరంగల్‌ తూర్పు కోటకు చెందిన మొగిలయ్యది సామాన్య మధ్య తరగతి గీత కార్మిక కుటుంబం. ఆర్య సమాజంపై ఉన్న మక్కువతో వాలంటీర్లకు కర్రసాములో శిక్షణ ఇచ్చేవారు. విద్యావంతుడైన అన్న రామస్వామి ప్రోత్సాహంతో అప్పటికే ఉద్యమ కార్యకర్తగా పని చేస్తున్నారు. కర్రసాము శిక్షణ అనంతరం ప్రతి ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించేవారు.     రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ తరఫున వరంగల్‌లో ఖాసిం షరీఫ్‌(లకడీ పహల్వాన్‌) వారి సైన్యాన్ని నడిపించారు. కోట కేంద్రంగా జాతీయ జెండాను ఎగుర వేస్తున్నారని తెలిసిన రజాకార్లు 150 మంది  దాడి చేసేందుకు కోటకు వచ్చారు. అప్పటికే జాతీయ జెండాను ఎగుర వేసి  తేనీరు తాగేందుకు మొగిలయ్య ఇంటికి చేరుకున్నారు ఉద్యమకారులు. మొగిలయ్య మాత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అన్న రామస్వామి, సహచర బృందంపై దాడి జరుగుతోందన్న విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్న మొగిలయ్య నిజాం సైన్యంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన కత్తి పిడి విరిగిపోయింది. దీంతో రాజకార్లు దొంగదెబ్బ తీశారు. ఇలా తన సహచరులను కాపాడిన మొగిలయ్య భరతమాత ఒడిలో ఒరిగిపోయారు.

ఖిలావరంగల్‌ తూర్పుకోటలోని మొగిలయ్య ఇల్లు

చరిత్రను మరవొద్దని..  

నాటి మొగిలయ్య ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా స్వాతంత్ర సమరయోధులు జేపీఎన్‌ రోడ్డులో మొగిలయ్య పేరిట భవనం నిర్మించారు. ఆయన ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ ‘చరిత్రను మరిచిన ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్‌’ పేరుతో కట్టగాని కొమురయ్యగౌడ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కొమురయ్య కుమారుడు కట్టగాని రవీందర్‌ పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు.

పింఛను తప్ప ఏ గుర్తింపూ అందలేదు..

స్వాతంత్య్రం వచ్చాక ఆ కుటుంబానికి పింఛను సాయం తప్ప ఏమీ అందలేదు. భర్త పింఛనుతోనే ఇద్దరు కూతుళ్లు, కొడుకును పెంచి పెద్ద చేశారు లచ్చవ్వ. ‘అమ్మ నాలుగేళ్ల కిందట చనిపోయింది.. స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలకు ఎటువంటి గుర్తింపు లేదు’ అని మొగిలయ్య కుమారుడు బత్తిని బాబుగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలయ్య స్నేహితులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నా.. వారి నుంచి సాయం పొందలేకపోయామని కన్నీటిపర్యంతమయ్యారు.   హైదరాబాద్‌లో ఉన్న సోదరి దగ్గర పెరిగి బాబు ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ కంపెనీ(ఈసీఈ)లో పని చేసి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. పెద్ద అక్క విమలక్క మరణించగా చిన్న అక్క సుక్కుబాయి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని