logo

ఓటరు జాబితా నవీకరణ షురూ!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో ఓటరు నూతన ఓటరు జాబితా రూపొందించడంతో పాటు నవీకరణకు ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితాలోని వారి ఆధార్‌ వివరాలు సేకరించి వాటిని ఓటరు కార్డుతో అనుసంధానం చేయనున్నారు. బూత్‌లెవల్‌ అధికారులు

Published : 13 Aug 2022 04:37 IST

న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌

బీఎల్‌వోలకు శిక్షణ ఇస్తున్న అధికారులు

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో ఓటరు నూతన ఓటరు జాబితా రూపొందించడంతో పాటు నవీకరణకు ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితాలోని వారి ఆధార్‌ వివరాలు సేకరించి వాటిని ఓటరు కార్డుతో అనుసంధానం చేయనున్నారు. బూత్‌లెవల్‌ అధికారులు పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోని 479 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సర్వే నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన ఫారం 6బీలో బూత్‌ లెవల్‌ అధికారులు ఆధార్‌ సంఖ్యను సేకరిస్తారు. ఆధార్‌ వివరాలు ఇవ్వాలా... వద్దా అనేది ఓటరు ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. బలవంతంగా వివరాలు సేకరించవద్దని ఇటీవల న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే చెప్పింది. బూత్‌ లెవల్‌ అధికారులు ఆధార్‌ వివరాలు గోప్యంగా ఉంచాలని జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో ఇటీవల బీఎల్‌వోలకు అవగాహన, శిక్షణ కూడా నిర్వహించారు.
నమోదు, మార్పులు, చేర్పులు ఇలా..
ఓటరు నమోదు, మార్పులు, సవరణలకు ఇదివరకు ఉండే నమూనా దరఖాస్తు ఫారాల్లో పలు మార్పులు చేశారు. ఓటు నమోదు ఫారం.6తో పాటు ఫారం.6బీ పూర్తి చేసి జతచేయాలి. విదేశాల్లో భారతీయులు ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం.6ఏ జతచేయాలి. ఓటరు జాబితాలో సవరణ, మార్పులకు ఫారం.8లో దరఖాస్తు చేయాలి. గతంలో దీనికి ఫారం.8బీ ఉండగా ప్రస్తుతం దీన్ని రద్దు చేశారు. జాబితా నుంచి ఓటరు పేరును తొలగించేందుకు గతంలో మాదిరిగానే ఫారం.7 ఉపయోగించాలి. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఇకనుంచి ఏటా నాలుగు సార్లు..
ఎన్నికల సంఘం ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి నూతనంగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించేది. తరువాత దరఖాస్తు కోసం ఏడాది పాటు ఆగాల్సి వచ్చేది. ఇక ఈ విధానానికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. ఇప్పటి నుంచి ఏటా నాలుగు సార్లు అంటే జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1 తేదీల నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
17 ఏళ్లు దాటితే ముందస్తుగా..
ఇక ఓటు నమోదుకు 18 ఏళ్లు నిండాల్సిన అవసరం లేదు. 17 ఏళ్లు నిండిన వారు సైతం ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు మాత్రం 18 ఏళ్లు పూర్తయ్యాకే ఇస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 9 నుంచి ఈ ముందస్తు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1 తేదీల నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు ఈ ఏడాదిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు.


ఏదేని ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలు..
- వాసుచంద్ర, ఆర్డీవో, హనుమకొండ

బూత్‌ లెవల్‌ అధికారులు సర్వే చేస్తున్న క్రమంలో 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాలి. దీనితో రెండు ఓటర్లుగా నమోదైన వారిని గుర్తించే అవకాశం ఉంటుంది. జిల్లాలో అర్హులైన వారు నూతన ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించొచ్చు.


నియోజకవర్గం బూత్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
పరకాల   238 1,01,396 1,04,995 03 2,06,394  
వరంగల్‌ పశ్చిమ 241 1,35,419 1,36,365 12 2,71,796

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని