logo

రాములోరి భూములు అన్యాక్రాంతం..!

పాలకుర్తి, న్యూస్‌టుడే: దక్షిణ అయోధ్యగా పిలిచే వల్మిడి సీతా రామచంద్రస్వామి ఆలయ భూములు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రహస్యంగా వాటిని కబ్జా చేస్తుండడంతో క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దేవాదాయ శాఖ, పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నా.

Updated : 13 Aug 2022 05:04 IST

వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం

పాలకుర్తి, న్యూస్‌టుడే: దక్షిణ అయోధ్యగా పిలిచే వల్మిడి సీతా రామచంద్రస్వామి ఆలయ భూములు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రహస్యంగా వాటిని కబ్జా చేస్తుండడంతో క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దేవాదాయ శాఖ, పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నా.. వారి కన్నులనుగప్పి ఆక్రమిస్తున్నారు. సీతా రామచంద్రస్వామి ఆలయ పరిధిలో వందల ఎకరాల భూములున్నాయి. అయితే వాటిని ప్రస్తుతం కౌలుకు ఇస్తున్నదెవరో, సాగు చేస్తున్నదెవరో తెలియని పరిస్థితి. సమగ్ర వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.
తరతరాల చరిత్ర..
జిల్లాలో ధూప దీప నైవేద్యాల పేరుతో వచ్చిన భూములను కొందరు వ్యాపారులు స్థానిక రైతులతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నల్గొండ జిల్లా చౌళ్లరామారం గ్రామానికి చెందిన స్థానాచార్యులు గతంలో దేవస్థానంలో పూజారిగా ఉన్న సమయంలో ఆలయాల కోసం దేశ్‌ముఖ్‌(దొరల) వద్ద నుంచి భూములు సేకరించారు. వీటిపై వచ్చిన ఆదాయాన్ని సీతా రామచంద్ర స్వామి వారి ఉత్సవాలు, పూజలు, జాతర ఇతర ఖర్చులకు వినియోగించేవారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖల లెక్కల ప్రకారం దేవస్థానం కింద పలు మండలాల్లో భూములున్నాయి.
విలువ రూ.కోట్లలోనే..
వల్మిడి సీతా రామచంద్ర స్వామివారి స్థలాలు.. రికార్డులపరంగా చూస్తే దాదాపు 57 ఎకరాల వరకు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో రూ.కోట్లలోనే ఉంటుంది. అన్యాక్రాంతమైన భూములను సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెరుగుతున్న మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తే కౌలు ఎక్కువగా వస్తుందని, ఫలితంగా ఆలయ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తాత్కాలిక పాలక మండలి సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. పాలకుర్తి మండలంలోని ఇతర ఆలయాల స్థలాల పరిస్థితి సైతం ఇలాగే ఉందని తెలుస్తోంది. చాలా చోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు.
రికార్డుల్లో తారుమారు..
దేవరుప్పుల మండలంలో ఆలయానికి సుమారు పదుల ఎకరాల్లో భూములు ఉన్నాయి. అయితే ఓ గ్రామంలో ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. కొందరు కొంతమేర కొన్నేళ్లుగా ఆక్రమించుకున్నారు. తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా బడా నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు దేవాదాయశాఖ అధికారులు ఆలయ భూములని బోర్డులు పెట్టినా, నోటీసులు అందజేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఒకరిని చూసి మరొకరు అన్నట్లు ఇప్పటికే చాలామంది తిష్ఠ వేశారు. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తోందని సమాచారం. ఇక కొడకండ్ల మండలంలో ఆలయం పేరిట ఉండాల్సిన భూమి ఓ వ్యక్తి పేరుగా రికార్డుల్లో చూపిస్తోంది. ధరిణిలోనూ ఇదే సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే శాఖాధికారులు కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. ఎలాంటి తీర్పు రాలేదు.


 పూర్తి వివరాలు తెలుసుకుంటా..
- రజినికుమారి, సోమేశ్వరాలయ ఈవో

స్వామివారి భూములు కొంతమేర కబ్జాకు గురవుతున్నా విషయం సిబ్బంది ద్వారా తెలుసుకున్నా. బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలే అవుతుంది. ఇంకా పూర్తి స్థాయి ఛార్జి తీసుకోలేదు. ప్రస్తుతమున్న స్థలాలను పాలకమండలి సభ్యుల సహకారంతో కౌలుకు ఇస్తున్నాం. కొందరు కౌలు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో గతంలో అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటా.


మొత్తం భూములు:   57 ఎకరాలు
విస్తరించిన మండలాలు  పాలకుర్తి, దేవరుప్పుల,  కొడకండ్ల (జనగామ జిల్లా), రాయపర్తి (వరంగల్‌),   పెద్దవంగర (మహబూబాబాద్‌)

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని