logo

కొడకండ్ల పోస్టుమాస్టర్‌ అరెస్టుకు రంగం సిద్ధం?

కొడకండ్ల తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ సుమారు రూ.1.72 కోటి అవినీతికి పాల్పడిన పోస్టుమాస్టర్‌ కె.సతీష్‌ పోస్టల్‌, విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం.

Updated : 13 Aug 2022 07:01 IST

కొడకండ్ల, న్యూస్‌టుడే: కొడకండ్ల తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ సుమారు రూ.1.72 కోటి అవినీతికి పాల్పడిన పోస్టుమాస్టర్‌ కె.సతీష్‌ పోస్టల్‌, విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల కిందట ఆయన చేసిన అవినీతి వెలుగు చూడడంతో విధుల నుంచి తొలగించారు. తపాలా శాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టగా, పోస్టల్‌ సాఫ్ట్‌వేర్‌ లొసుగుల ఆధారంగా సెలవు దినాల ముందు రోజుల్లో రూ.లక్షల్లో ఇతరుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. తిరిగి ఆ ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకొని సొంతానికి వినియోగించుకొన్నట్లు గుర్తించారు. స్థానిక తపాలా కార్యాలయంలోని కింది స్థాయి సిబ్బంది ఖాతాకు నగదును మళ్లించడాన్ని గుర్తించిన అధికారులు ఒకరిని విధుల నుంచి తొలగించి ఆయన బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తపాలా శాఖలో రూ.కోటి అవినీతిపై గత నెల సీబీఐ అధికారులు వరంగల్‌ కేంద్రంలో తపాలా అధికారులను కలిసి అవినీతి వివరాలు సేకరించారు. వారం రోజుల కిందట పూర్తి వివరాలు రాబట్టిన సీబీఐ పోస్టుమాస్టర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పోస్టుమాస్టర్‌ తమకు అందుబాటులో లేకుండా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి పరారీలో ఉన్నట్లు తపాలా శాఖ అధికారులు వివరించారు. పోస్టుమాస్టర్‌ ముందస్తు బెయిల్‌ ప్రయత్నాల్లో ఉన్నట్లు తమకు తెలిసినట్లు కొడకండ్ల కార్యాలయ పరిశీలనకు వచ్చిన తపాలా అధికారి ఒకరు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని