logo

కాళోజీ స్ఫూర్తి .. అవయవదానంలో మేటి

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన రచనలే కాదు, తన పార్థివదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందజేయాలని కోరుకున్న కాళన్న భౌతికదేహం వైద్య విద్యార్థులకు పాఠమైంది. ఆ మహనీయుడి నుంచి వరంగల్‌కు

Updated : 13 Aug 2022 06:52 IST

 


కరీమాబాద్‌లో డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌తో అవయవదాన హామీ పత్రాలను చూపుతున్న దాతలు

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన రచనలే కాదు, తన పార్థివదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందజేయాలని కోరుకున్న కాళన్న భౌతికదేహం వైద్య విద్యార్థులకు పాఠమైంది. ఆ మహనీయుడి నుంచి వరంగల్‌కు చెందిన ఆయూష్‌ వైద్యుడు పరికిపండ్ల అశోక్‌, విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి స్ఫూర్తి పొందారు. సమాజానికి సేవ చేయాలని సంకల్పించారు. గత ఎనిమిదేళ్లుగా నేత్రదానం, అవయవదానం, మృతదేహాల దానంపై పనిచేస్తూ ఎందరికో స్పూర్తినిస్తున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.    -ఈనాడు, వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే:
ఒప్పిస్తూ.. అవగాహన కల్పిస్తూ
అవయవదానంపై చాలామందికి అవగాహన లేదు. అవయవదానంతో చిరంజీవులవుతారని వారికి అవగాహన కల్పించడంలో తెలంగాణ నేత్ర, శరీర, అవయవదాతల అసోసియేషన్‌ గత 8 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ వారి నుంచి ముందస్తుగా అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. నేత్ర, శరీర దానం చేసిన వారి దశదినకర్మల సమయంలో డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌, మల్లారెడ్డి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రమాదం లేదా ఇతర కారణంతో కొందరు జీవన్మృతులు (బ్రెయిన్‌ డెడ్‌)గా మారతారు. వారి కుటుంబ సభ్యులు కొండంత దుఃఖంలోనూ అవయవదానాలకు అంగీకరిస్తారు. మల్లారెడ్డి వారి దశదినకర్మకు వెళ్లి సంతాపసభ నిర్వహిస్తారు. అవయవదానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. మధ్యలో కార్నియా కోల్పోయిన అంధులకు నేత్రదానంతో కళ్లు వచ్చే అవకాశం ఉంది. వీరిని కార్నియా అంధులంటారు. ఇలాంటి వారు దేశంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని అంచనా. శ్రీలంకలో చనిపోయిన ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలనే నిబంధన ఉందట. మనదేశంలోనూ ఇలాంటి చట్టం చేస్తే కేవలం పది రోజుల్లో అంధులందరికీ చూపు వస్తుందని అంటున్నారు.  

అలాంటి వారు ఎంతో మంది
* ఇటీవల పోలీసు కమిషనరేట్లో ఓ కానిస్టేబుల్‌కు బ్రెయిన్‌డెడ్‌ అయింది. ఆయన భార్య ఆర్నెల్ల గర్భిణీ. కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి జీవన్‌దాన్‌కు అవయవదానం చేశారు. గతేడాది హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురు. ప్రమాదంలో గాయపడి జీవన్మృతురాలిగా మారడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు.
* 2018లో హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన రైతు నర్సింహారెడ్డి తలకు బలమైన గాయమైంది. ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయిందని వైద్యులు చెప్పారు. తెలంగాణ నేత్ర, అవయవ శరీర దాతల సంఘం సభ్యులు ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఆయన కళ్లు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను దానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడారు.
* వరంగల్‌ నాయుడు పెట్రోల్‌బంకు వద్ద మే 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గణపతినగర్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్‌ సెల్వం సతీష్‌(36) తలకు గాయమైంది. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మే 9న బ్రెయిన్‌ డెడ్‌ అయింది. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, 2 మూత్రపిండాలను దానం చేశారు.
* వరంగల్‌ రెడ్డిపాలెంకు చెందిన నాగపూరి నవీన్‌(24)అనే విద్యార్థికి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయింది. ఆయన కుటుంబ సభ్యులు నాగపూరి మొగిలి, వరలక్ష్మి.. నవీన్‌ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు మూత్రపిండాలు, నేత్రాలను దానం చేసి 8మందికి పునర్జన్మ నిచ్చారు.


ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా
- డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌, తెలంగాణ నేత్ర, శరీర, అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

దానాల్లోకెళ్లా అవయవ దానం అత్యుత్తమమైనది, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలి. 2015 నుంచి శరీర అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవయవదానం చేస్తున్నారు.


విశ్రాంత జీవితం దీనికే అంకితం
- మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నేత్ర, శరీర, అవయవదాతల సంఘం

ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి శరీర, అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. వందల సంఖ్యలో  అవయమ, నేత్రదానాలు చేయగలిగాను.  ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా మంది ముందుకు వస్తున్నారు. కేఎంసీˆ వైద్యవిద్యార్థుల పరిశోధనకు అవయవదానం ఉపయోగపడుతోంది.


నాన్న కోరిక మేరకు..
- ఎనమల్ల భిక్షపతి, కరీమాబాద్‌

మానాన్న ఎనమల్ల చేరాలు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో మేనేజర్‌గా పని చేసేవారు. 2019 సెప్టెంబర్‌లో చనిపోయారు. తన దేహాన్ని కేఎంసీˆ వైద్య విద్యార్థుల పరిశోధనకు ఇవ్వాలని అయన అప్పట్లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కేఎంసీˆకి మృతదేహాన్ని అప్పగించాం. నాన్న దేహం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడటం గర్వంగా ఉంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని