logo

పైసలిస్తేనే భవనాల నిర్మాణానికి అనుమతి!

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులను  పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ అమల్లోకి తెచ్చింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల ప్రమేయం లేకుండా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా నిబంధనలు ఖరారు చేశారు.

Published : 13 Aug 2022 04:37 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులను  పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ అమల్లోకి తెచ్చింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల ప్రమేయం లేకుండా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా నిబంధనలు ఖరారు చేశారు. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పీˆఆర్‌ శాఖల అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ వరంగల్‌లో కొందరు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఉద్యోగులు పరోక్షంగా అనుమతులను శాసిస్తున్నారు. పైసలిస్తే కేవలం రెండు రోజుల్లోనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్‌ శివారులోని నాయుడు పెట్రోల్‌ బంకు ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఓ భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతి వివాదాస్పదమైంది. రెండు తప్పిదాలు జరిగినట్లు తెలిసింది. ఒకటి జిల్లా న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే అనుమతి ఇవ్వడం, రెండొది రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల్లో భర్త పేరు ఉంటే భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి అడ్డంగా దొరికిపోయారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగం చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఫిర్యాదుదారున్ని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయొద్దంటున్నారు. నిబంధనల ప్రకారమైతే న్యాయస్థానంలో కేసు ఉంటే అనుమతి ఇవ్వకూడదు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజులో ఎవరి పేరు ఉంటే వారి పేరుతోనే అనుమతి ఇవ్వాలి. బల్దియా టౌన్‌ప్లానింగ్‌ విభాగం చేసిన తప్పులు బయట పడకుండా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పక్కకు తప్పించారు. కమిషనర్‌ ప్రావీణ్య ఆదేశించినా పూర్తిస్థాయి విచారణ చేపట్టడం లేదు.  బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎలా సాధ్యమైంది?
రెండు రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతి ఎలా ఇచ్చారనేది బల్దియా కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జులై 20వ తేదీన టీఎస్‌-బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేశారు. 22వ తేదీ సాయంత్రానికి అనుమతి ఇవ్వడంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సైతం ఖంగు తిన్నారు. నిబంధనల ప్రకారమైతే 21 రోజుల్లోగా అనుమతులు ఇవ్వాలి. ఎంత వేగంగా చేసిన వారం రోజుల సమయం పడుతుంది. నాయుడు పెట్రోల్‌ బంకు, ఆర్టీవో కార్యాలయం వద్ద 234 గజాల స్థలానికి రెండు రోజుల్లో అనుమతులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు స్థలంపై ఇద్దరు వ్యక్తుల మధ్య జిల్లా న్యాయస్థానంలో కేసు నడుస్తుండగానే  అనుమతి ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పెరుమాళ్ల లక్ష్మణ్‌ కమిషనర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని