logo

ఎగరాలి జెండా..ఓరుగల్లు నిండా!!

సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగ ఫలం.. మన స్వాతంత్య్రం. పొందిన స్వేచ్ఛతో ఎత్తాలి జెండా.. అదే స్ఫూర్తితో కట్టాలి పతాకం ఆంక్షల్లేని ఆకాశం నిండా. ఇంటింటా, వాడవాడలా ఎగరాలి..ఓరుగల్లులో సమైక్యతా భావం వెల్లివిరియాలి

Updated : 13 Aug 2022 06:57 IST

‘దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండ మనదే’

సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగ ఫలం.. మన స్వాతంత్య్రం. పొందిన స్వేచ్ఛతో ఎత్తాలి జెండా.. అదే స్ఫూర్తితో కట్టాలి పతాకం ఆంక్షల్లేని ఆకాశం నిండా. ఇంటింటా, వాడవాడలా ఎగరాలి..ఓరుగల్లులో సమైక్యతా భావం వెల్లివిరియాలి.
సువర్ణ అవకాశం
2022 జులై 19 నూతన సంస్కరణల ప్రకారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసుకోవచ్చు. సగర్వంగా వందనం చేసుకోవచ్చు. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటవచ్చు. ఇంటిపై జెండా రెపరెపలాడుతుంటే.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, జాతీయ నేతల విగ్రహాలున్న చోట కనిపించే జాతీయజెండా ఇప్పుడిక మన చెంత చేరింది. ఎన్నడూలేని విధంగా ఇళ్లపై పతాకాలు రెపరెపలాడుతున్నాయి. స్వాతంత్య్ర భారత కీర్తిని నలుమూలల చాటడంతో పాటు ప్రజల్లో దేశభక్తి, నాటి స్ఫూర్తి రగిలించడానికి నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో ఓరుగల్లు పౌరులుగా మనం క్రియాశీలక భూమిక పోషిద్దాం. సగర్వంగా దేశ గౌరవం నలు వైపులా వ్యాప్తి చెందేలా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిద్దాం. జాతీయ స్ఫూర్తిని చాటడానికి కలిసికట్టుగా కదులుదాం. ఉమ్మడి జిల్లాలోని 9,73,611 గృహాలకు త్రివర్ణ శోభ తీసుకొద్దాం.


పిల్లలూ...దిక్సూచి కండి
పిల్లలూ...మీకు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు, జాతీయ నేతల పోరాట పటిమ తెలియందేమీ కాదు. వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ‘గాంధీ’ సినిమా చూశారుగా. ఎందరో త్యాగ మూర్తుల పోరాట ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువు పీల్చుతున్నామని తెలుసుకున్నారు. మీ ఇంట్లో గానీ, ఊళ్లో గానీ నిరక్షరాస్యులు ఉంటే వారికి వారి ఇంటి మీద జెండా ఎగురవేసుకునేలా చైతన్యపర్చండి.  75 వసంతాల పండగ ప్రాధాన్యం గురించి వివరించండి.

 


ఆ రోజుల్లో పండగ వాతావరణం
- గోపయ్య, తోడేళ్లగూడెం, డోర్నకల్‌

ఇప్పుడు నాకు 81 ఏళ్లు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు చిన్న పిల్లాడిని.  అప్పట్లో స్వాతంత్య్ర వేడుకలొస్తే పండగ వాతావరణం ప్రస్ఫుటించేది.  సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులిచ్చేది.

గుడిసెపై...
ఈమె పేరు వనం లచ్చమ్మ. భర్త లేరు. కొడుకులిద్దరూ చనిపోయారు. పక్కన నిల్చుంది కూతురు పద్మ. మూగ, చెవిటి. అల్లుడూ చనిపోవడంతో తల్లి వద్ద ఉంటుంది. ఉండడానికి ఇల్లు లేదు. మట్టి గోడలు, గడ్డి తాటాకులు కప్పిన కప్పుతో గుడిసె ఉంది. వీరికి జీవనాధారం పింఛనే. ఇంతటి దుర్భర దయనీయ స్థితిలోనూ వీరు పంచాయతీ సమకూర్చిన జాతీయ జెండా విలువ తెలుసుకుని గుడిసె మీద రెపరెపలాడించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అమ్మపాలెంలో జాతీయ భావం ప్రదర్శించిన వీరు అందరికీ ఆదర్శం.

అందిపుచ్చుకుందీ వీధి
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ పట్టణంలోని సుభాష్‌వీధి ఇది. ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలనే పిలుపును అందిపుచ్చుకుంది. పురపాలిక సిబ్బంది పంపిణీ చేసిన పతాకాల్ని ఎవరికి వారు తమ ఇళ్ల మీద ఆవిష్కరించుకున్నారు. డోర్నకల్‌ నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో ఇళ్లపై రెపరెపలాడుతున్న జెండాలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.

ఉద్యమ గడ్డ మనది..
కాళోజీ, దాశరథి, హయగ్రీవాచారి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మధుసూదన్‌రావు రగిల్చిన ఉద్యమ ప్రేరణ ఎప్పటికీ అనుసరణీయం. స్వాతంత్య్రం వచ్చిన రోజే మహబూబాబాద్‌కు చెందిన బీఎన్‌ గుప్త నిజాం పాలనకు వ్యతిరేకంగా తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి కదం తొక్కారు. ఇనుగుర్తికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు సోదరులు 1922లోనే తొలి తెనుగు పత్రిక స్థాపించి ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపడంతోపాటు నిజాం నిరంకుశ పాలన తీరుతెన్నులు ఎండగట్టారు.


తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించింది బీఎన్‌గుప్త
- రవీంద్రగుప్త, మహబూబాబాద్‌

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా మనకు నిజాం నిరంకుశ పాలన చెర వీడలేదు. స్వాతంత్య్ర సమరయోధుడైన మా నాన్న బీఎన్‌ గుప్త మొక్కవోని పట్టుదలతో మహబూబాబాద్‌లోని ఇంటిపై జాతీయ జెండావిష్కరించారు. అదే రోజు మద్రాసులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిజాం నిరంకుశ పాలనని ధిక్కరిస్తూ ఇచ్చిన ఉపన్యాసంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని వెంటనే భారత యూనియన్‌లో కలపాలని నినదించారు. అప్పుడు నా వయసు మూడేళ్లు. నాటి ఘట్టాలేవీ నాకు గుర్తు లేవు. అయితే అప్పటి ఘట్టాలు మా నాన్న నాకు తర్వాత వివరించారు.

చేయాల్సినవి..
* జాతీయ పతాకం కచ్చితంగా దీర్ఘ చతురస్రాకారంలో 3:2 నిష్పత్తుల కొలతలతో ఉండాలి.

* ఎగురవేసేటప్పుడు వడివడిగా, దింపేటప్పుడు నెమ్మదిగా దింపాలి.

* పక్కన మిగతా జెండాలు ఉంటే, త్రివర్ణ పతాకం అన్నింటికన్నా ఎత్తున ఉండాలి.

*  గతంలో నూలు, నేసిన ఉన్ని, పత్తి సిల్క్‌, ఖాదీని ఉపయోగించి చేతితో తయారు చేసిన జెండాలనే వాడాలనే నిబంధన ఉండేది. తాజా సవరణలో పాలిస్టర్‌తో చేసిన వాటినీ వినియోగించొచ్చని కేంద్రం స్పష్టం చేసింది

*  ఇదివరకు యంత్రాలపై తయారు చేసిన వాటిపై వినియోగంపై నిషేధం ఉండేది. ఇప్పుడు వాడవచ్చు.

*  ప్రతి వ్యక్తి తన ఇంటి మీద ఎగురవేసే వీలు కల్పిస్తూ సవరణలు చేసింది.

*  ఇప్పుడు పగలూరాత్రి ఎగరవేయొచ్చు. ఆ తర్వాత అవనతం చేసి, ఇంట్లో భద్రపరచుకోవాలి.

* పొరపాటున జెండా చిరిగితే  రహస్య ప్రదేశంలో కాల్చివేయాలి. అందరి  ముందు చేయొద్దు.


పతాకావిష్కరణలో జాగ్రత్తలు
చేయకూడనివి..
*చిరిగిపోయిన, ముడతలు పడిన, రంగు వెలిసిన పతాకాలు వినియోగించొద్దు.
* కింద పడేయడం, నీళ్లలో వేయడంలాంటివి చేయకూడదు.
* చించివేయడం, కాల్చడం లాంటివి నిషేధం.
* జెండాపై ఎలాంటివి రాయకూడదు. రంగులు, చిత్రాలు వేయొద్దు.
* అలంకరణ కోసం వినియోగించొద్దు. వస్తువులపైనా కప్పకూడదు.
* కర్ర సగంలో (మధ్యలో) జెండా ఎగురవేయకూడదు. చివరలో ఉండాలి.

- న్యూస్‌టుడే, దేవరుప్పుల (జనగామ జిల్లా)

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని