logo

కుమార్తెను పరీక్షకు తీసుకెళ్తూ పరలోకానికి..

తన కూతురు ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించిన ఆ తండ్రి ఆశల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. పెద్ద కుమారుడి నిశ్చితార్థం 18న ఉండటంతో ఘనంగా వివాహం చేయాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. కమలాపూర్‌

Published : 14 Aug 2022 05:58 IST

శ్యాం సుందర్‌

కమలాపూర్‌, న్యూస్‌టుడే: తన కూతురు ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించిన ఆ తండ్రి ఆశల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. పెద్ద కుమారుడి నిశ్చితార్థం 18న ఉండటంతో ఘనంగా వివాహం చేయాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. కమలాపూర్‌ మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. సీఐ సంజీవ్‌ వివరాల ప్రకారం.. హనుమకొండ నుంచి వేములపల్లి వైపు వరంగల్‌ డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళుతోంది. ఈ క్రమంలో డ్రైవర్‌ అంబాల శివారులోని వాగు సమీప మూలమలుపు వద్దకు రాగానే తన కుమార్తె సింధూజతో కలిసి హనుమకొండ వైపు వెళ్తున్న కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన గన్ను శ్యాంసుందర్‌ (50) ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయాలై శ్యాంసుందర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న సింధూజ తలకు, కాళ్లు, చేతులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సింధూజ డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. శనివారం హనుమకొండలో పరీక్ష ఉండటంతో తండ్రి తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌ గుడికందుల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

వారంలోనే రెండో ప్రమాదం..

వారం రోజుల వ్యవధిలో ఒక్కటే మార్గంలో ఇద్దరు బస్సు కారణంగానే మృతి చెందారు. గత ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకని శనిగరం గ్రామానికి చెందిన హరికృష్ణ వెళ్తుండగా బస్సు ఢీకొట్టి మృతి చెందారు. శనివారం నాటి దుర్ఘటనలో కుమార్తెని పరీక్షకు తీసుకెళ్తూ బస్సు ఢీకొట్టడంతో తండ్రి దుర్మరణం పాలయ్యాడు. ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల అతివేగం, అజాగ్రత్తనే రెండు నిండు ప్రాణాలను బలిగొందని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల అతివేగాన్ని నియంత్రించి డ్రైవర్ల వేగానికి కళ్లెం వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని