logo

పుస్తకాలు గప్‌చిప్‌..!!

శాస్త్ర, సాంకేతిక నిపుణులు రచించిన లక్షలాది పుస్తకాలకు మరింత భద్రత కల్పించేలా వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లోని గ్రంథాలయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ)

Published : 18 Aug 2022 05:24 IST

నిట్‌ గ్రంథాలయంలో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికత

- న్యూస్‌టుడే, నిట్‌ క్యాంపస్‌

గ్రంథాలయంలో అధ్యయనంలో నిమగ్నమైన విద్యార్థులు

శాస్త్ర, సాంకేతిక నిపుణులు రచించిన లక్షలాది పుస్తకాలకు మరింత భద్రత కల్పించేలా వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లోని గ్రంథాలయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీని అమలు చేశారు. ఎస్‌ఆర్‌.రంగనాథన్‌ జయంతి సందర్భంగా ఇటీవల జరిగిన జాతీయ గ్రంథాలయ దినోత్సవం రోజున ఈ సాంకేతికతతో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన లైబ్రరీని డైరెక్టర్‌ ఆచార్య రమణారావు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన సాంకేతికతతో ప్రతి పుస్తకానికి చిప్‌ అమర్చడం వంటి భద్రతతో పాటు ఉపయోగకరమైన అంశాలున్నాయి.

కనిపించకుండా చిప్‌..

పలు దేశాల్లో పుస్తకాలకు అమర్చుతున్న క్యూఆర్‌ కోడ్‌, ఎలక్ట్రానిక్‌ చిప్స్‌, మ్యాగ్నటిక్స్‌ విధానంలా గ్రంథాలయంలోని పుస్తకంలో ఎవరికీ కనిపించకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ (ఈఎంఎస్‌) అమరుస్తారు. చిప్‌ ఏటీఏం కార్డు మాదిరిగా ఉంటుంది. ఎవరైనా చిప్‌ చించేస్తే మరో మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ గుర్తిస్తుంది. ఈఎంఎస్‌ స్ట్రిప్‌ను గుర్తించడం ఎవరి వల్ల సాధ్యం కాదు.

అలారంతో అప్రమత్తం..

అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి లైబ్రరీలో సభ్యత్వం ఉంటుంది. సభ్యులను కేటగిరీలుగా విభజించి టెక్నాలజీ చిప్‌తో రూపొందించిన గుర్తింపు కార్డులు జారీ చేశారు. అధ్యాపకులకు ఎరుపు రంగు, విద్యార్థులకు ఆకుపచ్చ, బోధనేతర సిబ్బందికి నీలి రంగు, మాస్టర్స్‌ విద్యార్థులకు గులాబీ రంగు చిహ్నంతో కార్డులు జారీ చేశారు. లైబ్రరీ ప్రవేశ మార్గంలో ‘మెటల్‌ సెక్యూరిటీ గేట్‌’ ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు అనధికారికంగా పుస్తకం బయటకు తీసుకెళ్తే వెంటనే అలారంతో సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

యంత్రంలో నమోదు చేస్తే..

గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకోవాలంటే సభ్యుల వివరాలు నమోదు చేసుకుని జారీ చేసేవారు. ఇక నుంచి మరింత సులభతరంగా పుస్తకాలు తీసుకెళ్లవచ్ఛు ఏటీఎం మాదిరి యంత్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పుస్తకం తీసుకెళ్లేవారు యంత్రం వద్ద ఐడీ కార్డు ద్వారా స్వయంగా నమోదు చేసి తీసుకెళ్లవచ్ఛు ఎనీ టైమ్‌ బుక్‌ సిస్టం పేరుతో ఏర్పాటు చేసిన ఈ యంత్రంలో ఇష్యూ, రెన్యూవల్‌, రిటన్‌, అకౌంట్స్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. పుస్తకం తిరిగి ఇవ్వాలనుకునే వారు ‘రిటన్‌ ఆప్షన్‌’ ఎంచుకోవాలి. కొత్తగా తీసుకునే వారు ఇష్యూ ఆప్షన్‌, గడువు పొడగింపునకు రెన్యువల్‌, ఖాతా వివరాలకు అకౌంట్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. యంత్రం వద్ద పుస్తకం సమర్పించిన తర్వాత నమోదు చేయకుండా అదే పుస్తకం బయటకు తీసుకెళ్తే ప్రవేశమార్గంలో అల్లారం మోగుతూ ఎరుపు రంగు బుగ్గ హెచ్చరిక జారీ చేస్తుంది.

సెలవుల్లోనూ..

సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు డ్రాప్‌ బాక్స్‌ విధానం ప్రవేశపెట్టారు. లైబ్రరీ బయట ప్రవేశ మార్గంలో డ్రాప్‌ బాక్స్‌ పేరుతో యంత్రం ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఎప్పుడైనా సరే పుస్తకాలు తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. డ్రాప్‌ బాక్సు వద్ద కంప్యూటర్‌పైన పుస్తకం ఉంచితే వివరాలు కనిపిస్తాయి. ‘సబ్‌మిట్‌ బుక్‌ ఆప్షన్‌’ ఎంపిక చేస్తే పుస్తకం లోపలికి వెళ్లి రశీదు బయటకు వస్తుంది. వెంటనే సభ్యుల ఖాతా నుంచి పుస్తకం తిరిగి సమర్పించినట్లు నమోదవుతుంది. త్వరలోనే లైబ్రరీ లోపలికి వెళ్లడానికి రాత్రి సమయం పొడిగించి మానవరహిత సేవలు అందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రికార్డు స్థాయిలో..

ఆర్‌ఈసీగా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సేకరించిన పుస్తకాలు, జర్నల్స్‌ ఇక్కడ రికార్డు స్థాయిలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనంత పుస్తక సంపద నిట్‌ లైబ్రరీ సొంతం. 1923లో ముద్రించిన ‘ఎర్తింగ్‌ ప్రిన్సిపల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌’ అనే పుస్తకం నుంచి 2023 విద్యాసంవత్సరానికి గాను ప్రచురించిన కొత్త గ్రంథాలు సుమారు 1,85,000 వరకు ఉన్నాయి. గతంలో ఏటా ఆడిట్‌ నిర్వహించినప్పుడు లెక్క తేల్చడానికి ఏడు నెలల సమయం పట్టేది. ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీతో వారం రోజుల్లోనే పూర్తి చేయవచ్ఛు అల్మారాలో పుస్తకాలు తారు మారైనప్పుడు స్కానర్‌ సాయంతో ఎక్కడున్నా గురించవచ్ఛు కంప్యూటర్‌లో పుస్తకం కోడ్‌ ఎంటర్‌ చేసి స్కానర్‌ చూపిస్తూ పోతే మాయమైన పుస్తకం ఉన్న చోటు పసిగట్టి అల్లారం వినిపిస్తుంది.

నాలులు నెలలు శ్రమించి.. - డాక్టర్‌ కె.వీరాంజనేయులు, గ్రంథపాలకుడు.

లైబ్రరీలోని అన్ని పుస్తకాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ అనుసంధానం చేయడానికి నాలుగు బృందాలు కలిసి సుమారు నాలుగు మాసాలు శ్రమించాం. అరుదైన గ్రంథాలు, నిపుణుల రచనలకు జాగ్రత్తగా చిప్‌లు అమర్చాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు, సభ్యులకు మరింత సులభతరంగా పుస్తకాలు ఇచ్చి, పుచ్చుకునే అవకాశం కలిగింది.

భావితరాలకు అందించేందుకే.. - ఆచార్య ఎన్‌వీ.రమణారావు, నిట్‌ సంచాలకుడు

దేశంలో ఏ విద్యాసంస్థలో లేనన్ని పుస్తకాలు నిట్‌లో ఉన్నాయి. అరుదైన పురాతన గ్రంథాలతో పాటు, శాస్త్ర, సాంకేతిక నిపుణుల రచనలు, విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగకరమైన సంపద లైబ్రరీలో ఉంది. అన్నింటినీ భావితరాలకు అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి తెచ్చాం. పుస్తక పాఠకులకు సమయం ఆధా కావడంతో పాటు, పారదర్శకంగా సేవలు అందుతాయి. ఇక నుంచి ఎట్టి పరిస్థితిలోనూ పుస్తకాలు మాయం కావడం, తారుమారు కావడం లాంటి సమస్యలు తలెత్తవు.

నిట్‌లో

అధ్యాపకులు : 328

యూజీ విద్యార్థులు : 3815

మాస్టర్స్‌ విద్యార్థులు : 1979

పీహెచ్‌డీ విద్యార్థులు : 750

నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ : 250

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని