logo

ఓసిటీ స్టేడియంలో ఉద్రిక్తత

కాశీబుగ్గ ఓసిటిలోని వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ మైదానంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం అర్థరాత్రి స్టేడియంలో పోచమ్మ తల్లి విగ్రహాలను గుర్తించారు. ఇది తెలిసి కాశీబుగ్గ, ఓసిటీ,

Published : 18 Aug 2022 05:24 IST

పోచమ్మ దేవత ప్రతిమ

వరంగల్‌ క్రీడావిభాగం, లేబర్‌ కాలనీ, న్యూస్‌టుడే: కాశీబుగ్గ ఓసిటిలోని వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ మైదానంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం అర్థరాత్రి స్టేడియంలో పోచమ్మ తల్లి విగ్రహాలను గుర్తించారు. ఇది తెలిసి కాశీబుగ్గ, ఓసిటీ, భగత్‌సింగ్‌నగర్‌, లేబర్‌కాలనీ, సొసైటీకాలనీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుని పూజలు చేయడం ఆరంభించారు. కొందరు బోనాలతో తరలివచ్చారు. మరికొందరు చీరలు సమర్పించుకున్నారు. చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులు పూజలు చేసిన అనంతరం అమ్మవారి ప్రతిమల వద్ద కోళ్లను, గొర్రెలను బలిచ్చారు. మహిళల పూనకాలతో స్టేడియం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న జిల్లా క్రీడల అధికారి సొటాల ఇందిర స్టేడియానికి చేరుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆమెపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించగా అక్కడే ఉన్న కోచ్‌లు అడ్డుపడ్డారు. ఇదే విషయాన్ని క్రీడల అధికారి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌ను పంపించారు. అప్పటికి పలువురు ఆందోళనకు దిగడంతో ఏసీపీ గిరికుమార్‌, ఇంతేజార్‌గంజ్‌, మిల్స్‌కాలనీ సీఐలు, క్రీడా శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్రీడా ప్రాంగణంలో పూజలు చేయవద్దని కోరారు. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అమ్మవారి భక్తులకు అధికారులకు మధ్య స్వల్పవాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు పూజలు ఆపలేదు. క్రీడల మైదానాన్ని క్రీడల కోసమే ఉపయోగించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ గోపి తెలిపినట్లు క్రీడల అధికారి తెలిపారు. ఉద్రిక్తతల నడుమ మిల్స్‌కాలనీ ఠాణాలో క్రీడల అధికారి ఇందిర ఫిర్యాదు చేశారు.

భక్తులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని