logo

తనిఖీకి వచ్చిన ప్రజాప్రతినిధులపై గురుకుల ప్రిన్సిపల్‌ ఆగ్రహం

మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులపై పర్వతగిరి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ చేసే అధికారం మీకెక్కడిదంటూ వాదనకు దిగడం చర్చనీయాంశంగా

Published : 18 Aug 2022 05:24 IST

కూరను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు

పర్వతగిరి, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులపై పర్వతగిరి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ చేసే అధికారం మీకెక్కడిదంటూ వాదనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి జడ్పీటీసీ సభ్యుడు, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం జిల్లా ఛైర్మన్‌ బానోతు సింగులాల్‌ బుధవారం ఎంపీపీ లూనవత్‌ కమల, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ.సర్వర్‌, సర్పంచులు మాలతి, రేణుక, ఎంపీటీసీ సభ్యురాలు మహేంద్రతో కలిసి సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగదిలో భోజనాలు పరిశీలిస్తుండగా ప్రిన్సిపల్‌ సమ్మయ్య అక్కడికి వచ్చి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహించారు. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో పరిశీలించేందుకు వచ్చామని ప్రజాప్రతినిధులు తెలిపారు. డీసీవోగా, ప్రిన్సిపల్‌గా ఉన్న మీరు సహనం కోల్పోయి గిరిజన, మహిళా ప్రజా ప్రతినిధులను అగౌరవ పరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.

ఈ సందర్భంగా సింగులాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థినుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన తమపై దౌర్జన్యంగా మాట్లాడిన ప్రిన్సిపల్‌తో పాటు కేర్‌ టేకర్‌ వీణ, రికార్డు అసిస్టెంట్‌ పవన్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. విషయం ఆర్‌సీవో విద్యారాణి దృష్టికి వెళ్లగా ఆమె ఆదేశాల మేరకు ఏఆర్‌సీవో శరత్‌బాబు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

రాజీకి యత్నం!

మండల కేంద్రానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న జడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌ను ప్రిన్సిపల్‌ కలిసి రాజీకి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపల్‌ను ‘న్యూస్‌టుడే’ చరవాణిలో సంప్రదించగా.. పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారని, మరేం జరగలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని