logo
Published : 18 Aug 2022 05:24 IST

అసైన్డు భూములకు రిజిస్ట్రేషన్‌!!

భూపాలపల్లిలోని అసైన్డు భూములు ఇవే

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. ఇది చట్ట విరుద్ధం. రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం 22ఏ జాబితా పంపుతుంది. ఈ జాబితాలో ఆ కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ, అసైన్డు, ఇనాం, గ్రామ కంట్లం తదితర భూముల వివరాలు ఉంటాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆ జాబితా పరిశీలించి, అందులో లేని సర్వే నంబర్లకు సంబంధించిన ప్లాట్లకే రిజిస్ట్రేషన్‌ చేయాలి. కానీ కొంత మంది అధికారులు, సిబ్బందికి అవేమీ పట్టడం లేదు. అక్రమార్కులకు సహకరిస్తూ, కొన్ని చోట్ల బైనంబర్లతో, మరికొన్ని ప్రాంతాల్లో పక్కన ఉన్న సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. సిబ్బంది, ప్రైవేటు డాక్యుమెంటు రైటర్లు ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో కీలక భూమిక పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కార్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారే ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు ఆలస్యం కాకుండా పలు మార్పులు తెచ్చింది. అంతర్జాలంలో నమోదు చేసుకుని స్లాట్‌లో పేర్కొన్న సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్ఛు డాక్యుమెంట్‌ రైటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అయినా ఇప్పటికీ కార్యాలయాల్లో డాక్యుమెంటు రైటర్లు తిష్ఠవేశారు. వారి ద్వారా అక్రమార్కులు వివరాలను నమోదు చేయించి, సిబ్బందితో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నెలకొన్నాయి.

మచ్చుకు కొన్ని..

భూపాలపల్లిలోని భాస్కర్‌గడ్డ ప్రాంతంలో సర్వేనంబరు 363లో 46.32 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. గతంలో సింగరేణికి అప్పగించారు. 2013లో ప్రజాఅవసరాల నిమిత్తం 10 ఎకరాలు రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొని 140 మందికి 120 గజాల చొప్పున పంపిణీ చేసింది. ఈ అసైన్డు భూముల్లో కొందరు ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

భూపాలపల్లి పట్టణానికి సమీపంలోనే 170 సర్వేనంబరులో సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమిని 1989లో 16 మందికి సాగు కోసం అసైన్డు పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 10 నుంచి 20 గుంటల చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇస్తే ప్రస్తుతం ఇతరుల అధీనంలోనే ఉన్నాయి. దళారులు అక్రమంగా పట్టాలు చేసుకుని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

మంజూరునగర్‌లో 141 సర్వేనంబరులో పుల్లూరిరామయ్యపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలకు 1982లో 40 మందికి 26 ఎకరాల వరకు అసైన్డు పట్టాలు జారీ చేశారు. ఇందులో పది ఎకరాలు కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణానికి, ఏరియా ఆసుపత్రికి కేటాయించారు. మిగతా భూములు ఇళ్ల స్థలాలకు, రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. ఇందులోనే ఎకరం భూమిని ఓ రియల్టరు ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించినట్లు తెలిసింది.

ధరణి వచ్చిన తర్వాత..

ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆయా మండలాల తహసీల్దార్లు చేపడుతున్నారు. పట్టా భూములు గజాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలంటే తప్పనిసరిగా నాలా అనుమతులు ఉండాలి. అసైన్డు భూములకు రిజిస్ట్రేషన్లు అసలు చేయకూడదు. కానీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ఈ విషయమై ములుగు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా బేగం ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 22ఏ జాబితా ఉంటుందని, దాని ప్రకారం ప్రభుత్వ, అసైన్టు భూములను గుర్తిస్తున్నామన్నారు.

2007లోనే 22ఏ జాబితా పంపించారు. అదేవిధంగా 2013లో ఒకసారి సీడీ రూపంలో ప్రభుత్వ, అసైన్డు భూముల జాబితా పంపించగా, ఆ జాబితా స్కానింగ్‌ చేసి, ఆన్‌లైన్‌లోనే ఆ భూములను ‘లాక్‌ ’ చేయడం జరిగింది. దీని ద్వారానే పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు అరికట్టడానికి వీలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ, అసైన్డు భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారులపైనే కూడా ఉంది. కొందరు అవగాహన లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని