logo
Published : 18 Aug 2022 05:24 IST

దారులు మార్చి.. పోలీసులను తప్పించుకొని!!

సీఎల్పీ బృందం పర్యటనలో ఉద్రిక్తత

భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబును వాహనంలో తరలిస్తున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, భూపాలపల్లి, గణపురం: సీఎల్పీ బృందం చేపట్టిన కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. గోదావరి ముంపు బాధితులను పరామర్శించడానికి, ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌ సందర్శించేందుకు వచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని, ములుగు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి తదితరులను భూపాలపల్లి పట్టణంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఒక్కో అడ్డంకి దాటుకుంటూ..

సీఎల్పీ బృందం మంగళవారం రాత్రికే కాళేశ్వరం వెళ్లాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి.. బుధవారం ఉదయం కాళేశ్వరం బయల్దేరారు. ముందస్తుగానే పోలీసులు ఎక్కడిక్కడ అప్రమత్తం అయ్యారు. అయినా దారులు మార్చుకుంటూ బలగాలను తప్పించుకుంటూ వారి పయనం సాగింది. ములుగు నుంచి గణపురం మీదుగా వస్తారని భావించిన పోలీసులు గణపురం, భూపాలపల్లిలో మోహరించారు. కానీ బుద్దారం, వెళ్తుర్లపల్లి నుంచి వెంకటాపురం-భూపాలపల్లి రోడ్డుకు వెళ్లారు. భూపాలపల్లిలో పోలీసులు ఉన్నారని తెలుసుకుని వారు గొల్లపల్లి క్రాస్‌ నుంచి చెల్పూరులో పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాళేశ్వరం వెళ్తుండగా భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండ వేడిమి తాళలేక భట్టి నీరసించి అలిసిపోయారు. తన వెనుకాల కూర్చున్న కార్యకర్తపై వాలిపోయి కాసేపు సేదతీరారు. దాదాపు గంట సమయం వరకు కాంగ్రెస్‌ శ్రేణులు రహదారిపై రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అరెస్టు చేసి గణపురం ఠాణాకు తీసుకెళ్లారు. అక్కడే వారు భోజనాలు చేశారు. అనంతరం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో 40 మందిని సొంత పూచీకత్తుతో సాయంత్రం 4 గంటల తర్వాత వారిని హైదరాబాద్‌కు పంపించారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని