logo

నగరంపైనా భద్రతా కవచం

ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు  మహా నగరపాలక సంస్థ అడుగులేస్తోంది. ఆకర్షణీయ నగరం(స్మార్ట్‌ సిటీ) పథకం ద్వారా సుమారు రూ.90 కోట్లతో సమీకృత నిఘా నిర్వహణ కేంద్రం(ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా నూతన కౌన్సిల్‌ హాల్‌ భవనంలో

Updated : 19 Aug 2022 06:32 IST

బల్దియాలో రూ.90 కోట్లతో సమీకృత నిర్వహణ కేంద్రం ఏర్పాటు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు  మహా నగరపాలక సంస్థ అడుగులేస్తోంది. ఆకర్షణీయ నగరం(స్మార్ట్‌ సిటీ) పథకం ద్వారా సుమారు రూ.90 కోట్లతో సమీకృత నిఘా నిర్వహణ కేంద్రం(ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా నూతన కౌన్సిల్‌ హాల్‌ భవనంలో తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. కమిషనర్‌ ఛాంబర్‌ భవనం రెండో అంతస్తులో శాశ్వతంగా ఈ  కేంద్రం పనులు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీ పథకం కింద ఎంపికైన 100 నగరాల్లో తప్పని సరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. మే 7 న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బల్దియాలో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తక్షణ సేవల కోసం కొత్త కౌన్సిల్‌ హాల్‌ మొదటి అంతస్తులో తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. నాలుగు ఎల్‌ఈడీ తెరలు, నాలుగు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీˆలు, ఆడియో సిస్టమ్‌, కుర్చీలు ఏర్పాటు చేశారు. రెండు, మూడు వారాలుగా కొన్ని సేవలను కమిషనర్‌ ప్రావీణ్య, వింగ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. బల్దియా వాహనాలకు ఏర్పాటు చేసిన వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, జీపీˆఆర్‌ఎస్‌ సిస్టమ్‌, వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ తదితర సేవలు పర్యవేక్షిస్తున్నారు. మూడు, నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులంటున్నారు.
సేవలు ఇలా..

* వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ సెంటర్‌లోఉన్న నిఘా వ్యవస్థకు అనుసంధానంగా ఈకేంద్రం పనిచేస్తుంది. 14 అంశాల్లో ఆధునిక సేవలు అందుబాటులోకి తెస్తారు. దీని ద్వారా వరంగల్‌ నగర పరిధిలో ఏం జరుగుతుందో పరిశీలించే వీలుంటుంది. వాతావరణం, భారీ వర్షాలు తదితరాలపై ముందస్తు హెచ్చరికలు తెలిసే వీలుంటుంది.
* నగరంపై నిఘా
*మెరుగైన రాకపోకల వ్యవస్థకు ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంటు సిస్టం
* 10 ప్రాంతాల్లో ఎర్ర బుగ్గ అతిక్రమణ గుర్తించే సెన్సార్లు
* 10 ప్రాంతాల్లో వాహనాల వేగం గుర్తించే సెన్సార్లు
* ఒక ప్రాంతంలో వ్యతిరేక దిశలో నడిచే వాహనాన్ని గుర్తించే సెన్సార్లు
* ఇ-చలానా పంపించే ఏర్పాట్లు
* 10 ప్రాంతాల్లో వాతావరణ సమాచారాన్ని గుర్తించే సెన్సార్లు
*  10 ప్రాంతాల్లో అస్థిర(వేరియబుల్‌) సమాచారం పంపే ఏర్పాట్లు
* హోస్టింగ్‌ స్టేట్‌ డేటా సెంటర్‌
* జీఐఎస్‌
* ఇ-గవర్నెన్స్‌
* సమీకృత వాతావరణ సమాచారానికి ఐఎండీతో అనుసంధానం
* ఐసీటీ బేస్డ్‌ ఘనవ్యర్థాల నిర్వహణ విధానం
* సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(సీసీఎంఎస్‌) వీధి దీపాలు
* వరంగల్‌ మహా నగరపాలక సంస్థకు సంబంధించిన పరిపాలన, క్షేత్రస్థాయి పనులు, తాగునీటి సరఫరా, లేఅవుట్‌ ఓపెన్‌ స్పేస్‌లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు తదితరాలను ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని