logo

ఆటలో నెగ్గి.. శిక్షకుడిగా ఎదిగి..!

హ్యాండ్‌బాల్‌ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ప్రస్తుతం అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్రీడపై నేటితరం ఆసక్తి కనబరుస్తోంది. పాఠశాల దశలో ఈ హ్యాండ్‌బాల్‌ క్రీడలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. నేడు జాతీయ జట్టుకు కోచ్‌గా ఎదిగారు. భారత మహిళా బీచ్‌ హ్యాండ్‌బాల్‌ జట్టు కోచ్‌గా రాణించారు.

Published : 26 Sep 2022 04:53 IST

-న్యూస్‌టుడే, వరంగల్‌ క్రీడావిభాగం, రంగంపేట

హ్యాండ్‌బాల్‌ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ప్రస్తుతం అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్రీడపై నేటితరం ఆసక్తి కనబరుస్తోంది. పాఠశాల దశలో ఈ హ్యాండ్‌బాల్‌ క్రీడలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. నేడు జాతీయ జట్టుకు కోచ్‌గా ఎదిగారు. భారత మహిళా బీచ్‌ హ్యాండ్‌బాల్‌ జట్టు కోచ్‌గా రాణించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న  విష్ణువర్ధన్‌పై ‘న్యూస్‌టుడే’ స్ఫూర్తిదాయక కథనం.

తొలి గురువు రామ్మూర్తి ప్రోత్సాహం  

ఖిలావరంగల్‌కు చెందిన విష్ణువర్ధన్‌ విద్యార్థి దశలో ఆరేపల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో కోచ్‌ రామ్మూర్తి వద్ద 2004లో హ్యాండ్‌బాల్‌లో శిక్షణ తీసుకున్నారు. పదో తరగతి పూర్తిచేసే లోపు జిల్లా స్థాయిలో అండర్‌-14 విభాగంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో చురుగ్గా రాణించారు. విష్ణువర్ధన్‌ ఆసక్తిని, ప్రతిభను గమనించిన రామ్మూర్తి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో దూసుకెళ్లాడు. 2014వరకు క్రీడాకారుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన విష్ణువర్ధన్‌ 2016 నుంచి హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ శిక్షకుడిగా కొనసాగుతున్నారు.

జాతీయ జట్టుకు కోచ్‌గా

ఇటీవల థాయ్‌లాండ్‌లో 8వ ఏషియన్‌ ఉమెన్‌ బీచ్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో పాల్గొన్న భారత మహిళా జట్టుకు విష్ణువర్ధన్‌ కోచ్‌గా వ్యవహరించారు. వియత్నాం, హాంగ్‌కాంగ్‌, థాయ్‌లాండ్‌ దేశాల జట్లు పాల్గొన్నాయి. జిల్లా, రాష్ట్రాల జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవంతో తొలిసారిగా జాతీయ జట్టుకు నేతృత్వం వహించారు. ఈ టోర్నీలో భారత జట్టు మూడో స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రిఫరీగా అనుభవం విష్ణు సొంతం. ఇలా మూడు విభిన్న పాత్రల్లో రాణిస్తూ యువత, క్రీడాకారులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

జాతీయ స్థాయికి తీసుకెళ్తా..: బొడ్డు విష్ణువర్ధన్‌

హ్యాండ్‌బాల్‌ క్రీడలో ప్రతిభగల క్రీడాకారులను తయారుచేస్తా. డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రణాళికతో కూడిన శిక్షణ కొనసాగుతోంది.  ఇటీవల హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిబిరంలో నూతన తరం విద్యార్థులు హ్యాండ్‌బాల్‌ వైపు ఆసక్తి చూపారు. వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లేవరకు ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. తన విజయంలో సీనియర్‌ శిక్షకులు రామ్మూర్తి, శ్యామల పవన్‌, శాట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సొటాల ధనలక్ష్మి, క్రీడల అభివృద్ధి అధికారులు ఇందిర, శివకుమార్‌ పాత్ర ఎంతో ఉంది.  

భారత బీచ్‌ హ్యాండ్‌బాల్‌ మహిళా జట్టుతో విష్ణువర్ధన్‌

క్రీడాకారుడిగా విజయాలు..

* వరంగల్‌లో 2015లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

* ఛత్తీస్‌గఢ్‌లో 2015లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

* తమిళనాడులో 2019లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

శిక్షకుడిగా..

* ఏషియన్‌ ఉమెన్‌ బీచ్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో జట్టుకు కాంస్యం

* హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం

* హైదరాబాద్‌ జరిగిన ఆల్‌ ఇండియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం

* ఖిలావరంగల్‌లో జరిగిన సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

* సిద్ధిపేటలో జరిగిన జాతీయ స్థాయి బాలుర విభాగంలో కాంస్యం

* హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన టాలెంట్ హంట్‌లో స్వర్ణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని