logo

విద్యుత్తు తీగలు.. మృత్యుపాశాలు

రేగొండ మండలం దుంపిల్లపల్లికి చెందిన బత్తిని కుమారస్వామి(45) అనే రైతు మూడు రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మిర్చి సాగు కోసం నాగలి భుజాన ఎత్తుకుని వెళ్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తగిలి చేనులోనే విగతజీవిగా మారారు. ఇక్కడ ప్రమాదముందని గుర్తించినా అధికారులు సకాలంలో పని

Updated : 26 Sep 2022 04:58 IST

రేగొండ మండలం దుంపిల్లపల్లికి చెందిన బత్తిని కుమారస్వామి(45) అనే రైతు మూడు రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మిర్చి సాగు కోసం నాగలి భుజాన ఎత్తుకుని వెళ్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తగిలి చేనులోనే విగతజీవిగా మారారు. ఇక్కడ ప్రమాదముందని గుర్తించినా అధికారులు సకాలంలో పని చేయకపోవడంతో ఓ నిండు ప్రాణం బలయ్యింది.

ఈనాడు డిజిటల్‌, ములుగు: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రైతులు తన పంట పొలాన్నే తలుచుకుంటారు. ఈరోజు దుక్కిదున్నాను.. రేపు విత్తనాలు వేయాలి.. మరుసటి రోజు ఎరువులు వేద్దాం.. పైరుకు నీరు పెట్టాలి.. విద్యుత్తు ఏ సమయానికి వస్తుందో ఇలా మదిలో సాగుపైనే ఆలోచనంతా.. అలాంటి రైతులకు విద్యుత్తు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా చేతికి అందే విధంగా జాలువారిన విద్యుత్తు తీగలు, పొలాల్లో గట్లు, ఊతకర్రల ఆధారంగా ఉన్న లైన్లు, కంచెలేని  నియంత్రికలు, పగుళ్లు బారిన స్తంభాలు ఇలా.. ప్రమాదభరితంగా ఉంటున్నాయి.. చివరకు విద్యుదాఘాతానికి గురై అమాయక రైతులు విద్యుదాఘాతానికి బలవుతున్నారు.


ఇది ఖానాపురంలోని నల్లాల బావి రోడ్డులో పొలాలకు వెళ్లే విద్యుత్తు లైన్‌. స్తంభం కింది భాగంలో శిథిలమై ప్రమాదకరంగా మారింది. అధికారులు దాన్ని తొలగించకుండానే పక్కన మరో స్తంభం వేశారు. వేసవిలో ప్రమాదం పొంచి ఉన్నందున తొలగించాలని స్థానికులు కోరారు. గ్రామ శివారులోని నక్కల ఒర్రె పొలాల్లో తీగలు కిందికి వేలాడుతున్నాయని సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఈ సమస్యలు అలాగే ఉన్నాయి.


ఇది రేగొండ మండలం జగ్గయ్యపేటలోనిది. తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఇటువైపు నుంచే రైతులు పొలాలకు వెళ్తుంటారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు.


గత నెల 3న టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్‌(వి)కు చెందిన కర్రె కోమల(40) గుమ్మడవెల్లి శివారులో వరినాటు వేసేందుకు కూలీ పనికి వెళ్లారు. పొలంలో అప్పటికే 11 కేవీ విద్యుత్తు పొలంలో పడి ఉంది. పని చేస్తుండగా తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.


పల్లె ప్రగతిలో పరిష్కారం కాని సమస్యలు..

పల్లె ప్రగతిలో విద్యుత్తు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశాలున్నాయి. అధికారులు, సిబ్బంది సమస్యలు గుర్తించినా వాటికి వ్యయం ఎక్కువవుతుందని.. కేవలం అత్యవసరమైనవి మాత్రమే చేపట్టి మమ అనిపించారు. వర్షాకాలం ముందస్తు జాగ్రత్త చర్యల కింద మరమ్మతులు చేయాల్సి ఉన్నా పలుచోట్ల పట్టించుకోలేదు.  

* క్షేత్ర స్థాయి సిబ్బంది ఖాళీలు వేధిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉండే ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. వారికి సరైన అవగాహన లేక పనులు సక్రమంగా చేపట్టడం లేదు.

* వదులు తీగలు, శిథిలమైన విద్యుత్తు స్తంభాల తొలగింపు, కంచె లేని నియంత్రికలు, తదితర సమస్యలను గుర్తించి అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.


పట్టించుకోవడం లేదు   - కుమార్‌, రైతు జగ్గయ్యపల్లి

పొలాల వైపు వెళ్లే విద్యుత్తు లైను తీగలు కిందకు వేలాడుతున్నాయి. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రమాదం పొంచి ఉంది. అలాగే అక్కడే లెవన్‌ కేవీ తీగ కూడా తెగిపోయింది. దానికి విద్యుత్తు సరఫరా లేకపోయినా అది అలాగే వదిలేశారు. తెగిన తీగను చెట్టుకు కట్టారు.  


రక్షణ చర్యలు తీసుకుంటున్నాం   - ఎ. గోపాల్‌రావు, సీఎండీ, ఎన్పీడీసీఎల్‌

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఇంకా కొన్ని ఖాళీలున్నాయి. వాటిని కూడా నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు విద్యుత్తు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్యలుంటే అధికారులను సంప్రదించాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని