logo

వాహనం నిలిపే స్థలమెక్కడ?

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా మారి ఏళ్లు గడిచినా ట్రాఫిక్‌ సమస్య తీరడం లేదు. పట్టణాభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. రద్దీ ఎక్కువై వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు లేక నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెల్లార్లను

Published : 26 Sep 2022 04:53 IST

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యలు

నెహ్రూ కూడలిలో రహదారిపైనే ..

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా మారి ఏళ్లు గడిచినా ట్రాఫిక్‌ సమస్య తీరడం లేదు. పట్టణాభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. రద్దీ ఎక్కువై వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు లేక నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెల్లార్లను వాహనాల పార్కింగ్‌కు కాకుండా భవనాల యజమానులు తమ సొంత పనులకు వినియోగిస్తుండడంతో వాణిజ్య, వ్యాపార అవసరాలకు వచ్చిన వాహనదారులకు బండి నిలిపేందుకు స్థలం కరవైంది. విధిలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం నెలకొని తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయి. పురపాలక అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల కొందరు రహదారులను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. పండగ రోజుల్లో వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రోడ్లపైనే పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి. రహదారుల వెంట నిలిపిన వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు ఫొటోలు తీసి జరిమానా విధిస్తున్నారు. వాణిజ్య వ్యాపారాల దుకాణ భవన సముదాయాల్లోని సెల్లార్లలో వాహనాలు పార్కింగ్‌ చేస్తే కొంత వరకు ట్రాపిక్‌ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.  దీనికితోడు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు దిశగా పురపాలక, పోలీస్‌ శాఖ తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

రద్దీగా ఉండే ప్రదేశాలు ఇవే

పట్టణంలోని నెహ్రూ సెంటర్‌, కూరగాయాల మార్కెట్‌, శ్రీనివాస కూడలి, మదర్‌ థెరిసా కూడలిలో రోజూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఉదయం సమయంలో కూలీ పనుల కోసం వచ్చే వారితో శ్రీనివాస కూడలి రద్దీగా మారి వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. నెహ్రూసెంటర్‌లో బ్యాంకులు ఉండటం వల్ల వాహనాలు ఎక్కువగా రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తున్నారు.

రోజూ యాతనే....

పట్టణంలోని పాత బజారు నుంచి కొత్త బజారుకు రావడానికి రైల్వే గేటు గుండా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని అండర్‌ బ్రిడ్జి ద్వారా నిర్మిస్తున్న రహదారి కారణంగా వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.


ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

- వై.సతీష్‌, సీఐ, మహబూబాబద్‌ పట్టణం

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని రెండు కూడళ్లలో సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వాణిజ్య వ్యాపార దుకాణాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాహనాల పార్కింగ్‌ కోసం సెల్లార్లు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశాం. ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని