logo

మినహాయింపునకు ఎదురుచూపులు

భూగర్భంలోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటారు చీకటి సూర్యులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బొగ్గు వెలికి తీస్తుంటారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లేకపోవడం  సింగరేణి కార్మికులకు భారంగా మారింది. ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రధాన హామీగా మలుచుకుంటున్న

Published : 26 Sep 2022 04:53 IST

సింగరేణి కార్మికులకు భారంగా ఆదాయపు పన్ను

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే: భూగర్భంలోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటారు చీకటి సూర్యులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బొగ్గు వెలికి తీస్తుంటారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లేకపోవడం  సింగరేణి కార్మికులకు భారంగా మారింది. ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రధాన హామీగా మలుచుకుంటున్న పార్టీలు తర్వాత దాన్ని గాలికొదిలేస్తున్నాయి. పన్ను నుంచి మినహాయింపు కోసం ఏళ్ల తరబడి కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విమాన, జలరంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల మాదిరే తమకూ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఆరో వేజ్‌బోర్డు నుంచే..  

సింగరేణి సంస్థలో గతంలో 1.27 లక్షల మంది కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 43 వేల మంది పనిచేస్తున్నారు. 5వ వేజ్‌ బోర్డు వరకు వేతనాల పెరుగుదల తక్కువగా ఉండేది. దీంతో వారు పెద్దగా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం రాలేదు. 1996 జులై 1 నుంచి ఆరో వేజ్‌బోర్డు వేతనాల పెరుగుదల ఎక్కువకావడంతో సింగరేణి కార్మికులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. అప్పటి నుంచి 2001లో ఏడో, 2006లో 8వ, 2011లో 9వ, 2016 నుంచి 10వ వేజ్‌బోర్డు ప్రకారం వేతనాలు అమలవుతున్నాయి. అయితే 9, 10వ వేజ్‌బోర్డుల్లో కార్మికులకు భారీగా వేతనాలు పెరగడంతో ఆదాయపన్ను కూడా అదే స్థాయిలో చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు యాజమాన్యం కార్మికుల క్వార్టర్ల కోసం చెల్లించే అద్దెను కూడా వేతనంలోనే చూపిస్తోంది. దీంతో కార్మికులు పొందని వేతనాన్ని కూడా పన్ను రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

రెండు నుంచి నాలుగు నెలల జీతం..  

ఏడాదికి 2 నుంచి 4 నెలల వేతనాన్ని ఆదాయపు పన్ను రూపంలోనే చెల్లించాల్సి వస్తోందని కార్మికులు, అధికారులు వాపోతున్నారు. దీనికి తోడు కార్మికుడు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో సంస్థను వదిలేసినప్పుడు యాజమాన్యం సదరు కార్మికునికి రూ.25 లక్షలు చెల్లిస్తుంది.. దీనిపై కూడా 30 శాతం ఆదాయపు పన్ను విధించడంతో కార్మికుడి చేతికి సుమారు రూ.17.5 లక్షలు వస్తోంది.

కోల్‌ఇండియాలో భిన్నంగా..  

సింగరేణికి భిన్నంగా కోల్‌ఇండియాలో పరిస్థితి ఉంది. అక్కడి కార్మికులు చెల్లించే ఆదాయపన్నులో భత్యాలపై పడే పన్నును కోల్‌ఇండియా యాజమాన్యం వారికే తిరిగి చెల్లిస్తోంది. అదే విధానాన్ని సింగరేణిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా.. అది అమలు కావడం లేదు.


పన్ను రూపంలో చెల్లిస్తున్నాం  

- పసునూటీ రాజేందర్‌, ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు

కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు తప్పనిసరిగా ఇవ్వాలి. ఏడాదంతా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ దేశానికి వెలుగులు పంచుతున్నారు. 2 నుంచి 4 నెలల వేతనాలను పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఆర్థికంగా నష్టపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి.


భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది

- కంపేటీ రాజయ్య, సీఐటీయూ కార్యదర్శి  

కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. అయినా సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దాదాపుగా 20 ఏళ్లుగా కార్మికులపై ఆదాయపు పన్ను భారం మోపుతూనే ఉన్నారు. పన్ను రూపంలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. రక్తాన్ని చెమటగా మార్చి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని