logo

చితికిన బతుకులు.. సాయానికి ఎదురుచూపులు

జిల్లాలో పలు చోట్ల గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. మృతుల కుటుంబాలు అనాథలుగా మిగిలారు. కొన్ని ఘటనల్లో తల్లిదండ్రులు కన్నబిడ్డలను కోల్పోగా, మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలయ్యారు. భార్య, భర్త, అన్నా, తమ్ముడు,

Published : 26 Sep 2022 04:53 IST

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పలు చోట్ల గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. మృతుల కుటుంబాలు అనాథలుగా మిగిలారు. కొన్ని ఘటనల్లో తల్లిదండ్రులు కన్నబిడ్డలను కోల్పోగా, మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలయ్యారు. భార్య, భర్త, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లెలు.. ఆప్తులు దూరమైన కుటుంబాల్లో తీరని వ్యథే మిగిలింది. కొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకపోవడంతో వారిపై ఆధారపడిన వారి బతుకులు చితికిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి దీనస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనమిది.


పాఠశాల ఫీజులూ కట్టలేని దైన్యం

సంతోష్‌ చిత్రపటంతో ఆయన భార్య కోమలత, తల్లి సుభద్ర

సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కకావికలం చేసింది. పాలకుర్తికి కేంద్రానికి చెందిన జీడి సంతోష్‌(33) గతేడాది రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంతోష్‌ దర్జీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయన మృతితో భార్య కోమలత, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. సంతోష్‌ పెద్ద కుమారుడు 5వ తరగతి, చిన్న కుమారుడు నర్సరీ చదువుతున్నారు. వారి పాఠశాల ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రసుత్తం సంతోష్‌ తండ్రి సోమయ్య ఇళ్ల నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

- న్యూస్‌టుడే, పాలకుర్తి


అనాథలైన కుటుంబ సభ్యులు

 భర్తను కోల్పోయిన మహేశ్వరి, కుమార్తెలు     

జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన దావెర రాజు, మహేశ్వరి దంపతులది నిరుపేద కుటుంబం. వారిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కల్యాణి, సౌమ్య ఉన్నారు. 2016లో రాజు కూలి పనుల కోసం ట్రాక్టర్‌పై వెళ్తుండగా.. జనగామలో రైల్వే పై వంతెన మీది నుంచి ట్రాక్టర్‌ బోల్తా పడటంతో రాజు మృతి చెందాడు. కుటుంబ యజమాని మృతి చెందడంతో భార్యా, పిల్లలు అనాథలుగా మిగిలారు. దీంతో మహేశ్వరి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

- న్యూస్‌టుడే, జనగామరూరల్‌


కూలి పనులతో కుటుంబ పోషణ

బ్రహ్మాచారి ఫొటోతో కుటుంబ సభ్యులు

బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెంకు చెందిన వడ్లూరి బ్రహ్మాచారి(40) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం బచ్చన్నపేటలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో బ్రహ్మాచారి మృతి చెందాడు. ఆయనకు భార్య మల్లేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏడో తరగతి, చిన్న కూతురు ఐదో తరగతి చదువుతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కయిన బ్రహ్మాచారి మరణించడంతో వారి ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. ఆయన భార్య మల్లేశ్వరి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పిల్లలిద్దరినీ చదివించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పింఛను కూడా రావడం లేదని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, బచ్చన్నపేట


అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన రాంచందర్‌, కరుణాకర్‌

జనగామలోని బాణాపురం ఇందిరమ్మకాలనీకి చెందిన మరికుక్కల అంజయ్య(55) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ తన ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. ఆయన భార్య గంగమ్మ 18 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. అంజయ్య గతేడాది ఆగస్టులో శామీర్‌పేట సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా డీసీఎం వాహనం ఢీకొని మృతి చెందాడు. దీంతో వారి కుమారులిద్దరు అనాథలయ్యారు. పెద్ద కుమారుడు కరుణాకర్‌కు అంగ వైకల్యం ఉండడంతో నడవలేడు. ఆరో తరగతి వరకు చదివిన చిన్న కుమారుడు రాంచందర్‌ 17 ఏళ్ల వయసులోనే కూలి పనులకు వెళ్తున్నాడు. తండ్రి బతికున్నప్పుడే  70 గజాల స్థలంలో చిన్న రేకులషెడ్డు వేయడంతో అందులోనే నివాసం ఉంటున్నారు. చిన్నప్పుడే అమ్మ.. రోడ్డు ప్రమాదంలో నాన్న మరణించడంతో దివ్యాంగుడైన తన సోదరుడి పోషణ బాధ్యత తనపై పడిందని, తన వయస్సు చిన్నది కావడంతో ఎవరూ పనిలో పెట్టుకోవడం లేదని రాంచందర్‌ వాపోతున్నాడు. తనకు చదువుకోవాలనే ఆశ ఉందని, సార్వత్రిక విధానంలో పదో తరగతి పరీక్ష రాస్తానని చెప్పాడు. ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరాడు.

- న్యూస్‌టుడే, జనగామటౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు