logo

రూ.70 లక్షలు ఏమయ్యాయి?

దొరికితే దొంగ, దొరకక పోతే దొర అన్నట్లుగా ఉంది గ్రేటర్‌ వరంగల్‌లో అధికారుల తీరు. 452 మంది కాంట్రాక్టు కార్మికుల పేరు మీద జమ చేయాల్సిన ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ రూ.70 లక్షల సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనేది తాజాగా చర్చనీయాంశమైంది. కార్మికుల డబ్బు స్వాహా చేశారని ప్రచారం

Published : 26 Sep 2022 04:53 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: దొరికితే దొంగ, దొరకక పోతే దొర అన్నట్లుగా ఉంది గ్రేటర్‌ వరంగల్‌లో అధికారుల తీరు. 452 మంది కాంట్రాక్టు కార్మికుల పేరు మీద జమ చేయాల్సిన ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ రూ.70 లక్షల సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనేది తాజాగా చర్చనీయాంశమైంది. కార్మికుల డబ్బు స్వాహా చేశారని ప్రచారం జరుగుతోంది. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారుల అండతోనే కాంట్రాక్టర్‌ ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ము తన ఖాతాలో వేసుకున్నారని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. నిబంధనల ప్రకారమైతే నెల నుంచే కార్మికుల వ్యక్తిగత పేర్లతో కలిగిన ఖాతాల్లో ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్‌ జమ చేయాలి. చేస్తున్నాడా? లేదా? అనేది అధికారులు పరిశీలించాలి. జమ చేయకపోతే కాంట్రాక్టర్‌కు నోటీసు జారీ చేయాలి. అడిగే వారు లేకపోవడంతో కార్మికుల సొమ్ము పక్కదారి పట్టింది. వాస్తవంగా పరిశీలిస్తే 452 మంది కాంట్రాక్టు నియామకాల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వివాదాస్పదమే. గత పాలకవర్గం పదవీ కాలం చివరి దశలో వీరి నియామకాలు జరిగాయి. రాజకీయ ఒత్తిళ్లతో ఆరేడు నెలల పాటు తుది జాబితా ఖరారవ్వలేదు. నెల నెలా కార్మికుల పేర్లు మారాయి. ప్రస్తుత కమిషనర్‌ ప్రావీణ్య చొరవతో జనవరి నెలలో తుది జాబితా ఖరారైంది. అదనంగా నియమితులైన 52 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

జాబితాపై ఆరా

కాంట్రాక్టు కార్మికుల నియామకంలో జరిగిన పైరవీలను డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి బయట పెట్టారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, బల్దియా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, మాజీ మేయర్‌, మాజీ కార్పొరేటర్లు, మీడియా సిఫారసుల జాబితా విడుదల చేయడంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కార్మికుల నియామకాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్‌ నాయకులకు ఆధారాలు ఎలా లభించాయి? ఆడియో టేపులు తదితర అంశాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. బల్దియా అధికారులు కూడా సిఫారసులు చేయడంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని