logo

చరవాణి వదిలేద్దాం.. పల్లెను చుట్ట్టొద్దాం

దసరా పండగ.. బోలెడు సెలవులు.. పిల్లలూ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు? చరవాణుల్లో సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్‌లతో మాత్రం సమయాన్ని వృథా చేయొద్దు.. ఏం చేద్దామంటారా.. అందివచ్చిన సెలవులను ఇలా సద్వినియోగం చేసుకుందాం.. దసరా సందర్భంగా సోమవారం నుంచి 14 రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ సెలవులు

Published : 26 Sep 2022 04:53 IST

దసరా సెలవులను  సద్వినియోగం చేసుకుందాం

న్యూస్‌టుడే, వరంగల్‌ సాంస్కృతికం

దసరా పండగ.. బోలెడు సెలవులు.. పిల్లలూ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు? చరవాణుల్లో సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్‌లతో మాత్రం సమయాన్ని వృథా చేయొద్దు.. ఏం చేద్దామంటారా.. అందివచ్చిన సెలవులను ఇలా సద్వినియోగం చేసుకుందాం.. దసరా సందర్భంగా సోమవారం నుంచి 14 రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. నగరంలో ఉండే వారంతా ఎక్కువశాతం తమ స్వగ్రామాలకు వెళ్లి గడుపుతారు. ఈ క్రమంలో చిన్నారులు చరవాణులు పక్కనపెట్టి పల్లె విషయాలు తెలుసుకోవాలి. పక్కా ప్రణాళికతో  ఏ రోజు ఏం నేర్చుకోవచ్చో మీ అవగాహన కోసం   సూచిస్తూ ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

1వ రోజు బతుకమ్మ విశిష్టత: మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. బతుకమ్మ పేర్చడం నుంచి మొదలు ముగింపు వేడుకల వరకు నిర్వహించే కార్యక్రమాలను పెద్దవారిని అడిగి తెలుసుకోవాలి.

* హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రం పంచాయతీ వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మీరు వెళ్లిన గ్రామంలో జరిగే సంబురాలనూ ప్రత్యక్షంగా చూసి విశేషాలు తెలుసుకోవాలి.


2 గ్రామ పరిపాలనపై పట్టు:   పల్లె పాలనపై అవగాహన పెంచుకోవాలి. వరంగల్‌ జిల్లాలో ఆదర్శ గ్రామాలుగా గంగదేవిపల్లి,  మరియపురం అభివృద్ధి చెందాయి. మీ గ్రామం ఇలా అభివృద్ధి చెందడానికి పలు సూచనలు చేయొచ్చు.


గ్రంథాలయం సందర్శన: సమీపంలోని గ్రంథాలయానికి వెళ్లి అక్కడున్న పుస్తకాలు, గ్రంథాలయాల నిర్వహణను   పరిశీలించాలి. గ్రంథపాలకులతో ముచ్చటించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు.

* హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ప్రజా గ్రంథాలయం ఉంది. ఇలా మీ గ్రామంలోని గ్రంథాలయానికి వెళ్లి రోజంతా గడపండి.


4 పాడి, పంటలు : రైతులు ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తుంటారు. వరి, మిరప, పప్పు దినుసులు, పత్తి, పసుపు తదితర  పంటలు ఎలా సాగు చేస్తారో తెలుసుకోవాలి. పొలాల వద్దకు అమ్మానాన్నలు, పెద్దవారితో కలిసి క్షేత్ర పర్యటన చేయాలి. పాడి పరిశ్రమకు ఆవులు, గేదెల ఉత్పత్తులు ఎలా అందుతున్నాయి.. అనే అంశాలపై పరిశీలించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి.


5 పురాణ కథలు వినాలి :  ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం నగరాల్లో జీవించేవారు ఈ దసరా సెలవుల్లో తాతయ్య, బామ్మలను కలిసే సదవకాశం వచ్చింది. రామాయణం, మహాభారతం లాంటి పురాణ ఇతిహాసాలను వినాలి.  జీవన విధానం, క్రమశిక్షణ, కుటుంబ విలువలు తదితర అంశాలపై వ్యక్తిత్వ వికాసం పెంచుకోవాలి.


6 సకుటుంబంతో ముచ్చట్లు :  కుటుంబసభ్యులంతా ఒకే చోటకు చేరాలి. చరవాణులు పక్కనపెట్టి పిల్లలతో ముచ్చటించాలి. ఇంటి పెద్దలు, కుటుంబ సభ్యులు బాల్యం నుంచి పెరిగిన వాతావరణం, అనుభవించిన కష్ట సుఖాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. సాటి మనిషికి సాయం చేయడం, ఆత్మ రక్షణ లాంటి అంశాలను వివరించాలి.


7 ఆలయాలు : ఉమ్మడి  జిల్లాలో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. మీ సమీపంలో ఉన్నవాటిని సకుటుంబంగా సందర్శించాలి.  కట్టడాలు, నిర్మాణ తీరు, శిల్ప సంపద గురించి తెలుసుకోవాలి.

* ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన వారు సమీప రామప్పదేవాలయం చూడొచ్చు.


8 అనాథ, వృద్ధాశ్రమాలు: గ్రామాలు, సమీప ప్రాంతాల్లో అనాథ, వృద్ధాశ్రమాలు సందర్శించి సేవలు తెలుసుకోవాలి. ఆశ్రమాల్లో ఉన్న వారితో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి.

* జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలంలో అవసరార్థులకు సేవలు అందించే‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని సందర్శిస్తే సేవాభావం పెరుగుతుంది.


9 వంటలు నేర్చుకోవడం : ఈ రోజంతా వంటలు చేయడం నేర్చుకోవాలి. నానమ్మ, అమ్మ వంట చేస్తుంటే సాయం చేయాలి.  సంప్రదాయ వంటకాల తయారీపై రోజంతా అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి.


10 గ్రామీణ ఆటలు : గ్రామాల్లో  పులి-మేక, అష్టా చెమ్మ, వైకుంఠ పాళి, కబడ్డీ, కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, దాగుడు మూతలు, వామన గుంటలు  వంటి అనేకం కనువిందుగా ఉంటాయి. ఇరుగు, పొరుగు చిన్నారులతో కలిసి ఇంటి పరిసరాల్లోనే ఇలాంటివి ఆడుతూ ఉల్లాసంగా గడపాలి.


11 ప్రభుత్వ పాఠశాలల సందర్శన:   ప్రభుత్వ బడులు సందర్శించాలి.  ఈ సెలవుల్లో మూసివేసి ఉన్నా ఉపాధ్యాయు లను అడిగి వాటిలో విద్యాబోధన గురించి తెలుసుకోవచ్చు. గూడూరు మండలం పొనుగోడు పాఠశాలలో దాతల ప్రోత్సాహంతో మెరుగైన బోధన అందిస్తున్నారు. వీటి గురించి తెలుసుకోవాలి.

12 ఆరోగ్య సూత్రాలు :  పూర్వీకులు ఆరోగ్య సూత్రాలు పాటించేవారు. సమయానికి భోజనం చేయడం, నిద్ర పోవడం, లాంటివి తప్పకుండా పాటించే వారు. పల్లెకు వెళ్లి రోజంతా ఆరోగ్య సూత్రాలు తెలుసుకునే పనిలో మునిగితేలాలి.


13 దసరా ప్రాముఖ్యం: చెడుపై మంచికి గెలుపు సంకేతమే విజయదశమి. రావణుడిపై రాముడు విజయం సాధించిన రోజు. గ్రామ దేవతవద్ద పూజలు, జమ్మి చెట్టు వద్ద వేదమంత్రాలు జరిపించి ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆయుధ పూజలు నిర్వహించడం తదితర వేడుకల ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలి.  


14 అన్ని విషయాలు రాసిపెట్టుకోవడం : పల్లెల్లో 14 రోజుల పాటు పక్కా ప్రణాళికతో చేపట్టిన కార్యక్రమాలను ప్రతి రోజూ పుస్తకంలో రాసి పెట్టుకోవాలి.   పెద్దయ్యాక చిరకాల గుర్తు కోసం భద్రంగా దాచుకోవాలి. అదే పుస్తకంలో బంధు మిత్రులతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుండేలా అక్షరబద్ధం చేయాలి.


సెలవుల్లో మా ఊరిలో గడిపాం: - కాకులమర్రి ప్రవీణ్‌ కుమార్‌, హనుమకొండ

మా స్వగ్రామం ములుగు జిల్లా ఏటూరునాగారం. ప్రస్తుతం మేము హనుమకొండ అశోక్‌ కాలనీలో ఉంటున్నాం. గతేడాది దసరా సెలవులు వచ్చినప్పుడు మా స్వగ్రామానికి వెళ్లాం. అక్కడ మా తల్లిదండ్రులు ఉంటారు. మా అన్నయ్య, అక్కయ్య కుటుంబంతో పాటు మేమందరం కలుస్తాం. మా నాన్న గారు మా పిల్లలకు అనేక విషయాలు చెబుతారు. నైతిక విలువలు, పురాణ కథలతో పాటు ఆచార, అలవాట్లపై అవగాహన కల్పిస్తారు.


మానసిక ఉల్లాసం పొందుతారు

- డాక్టర్‌ శేషుమాధవ్‌, పిల్లల వైద్య నిపుణులు, బాలసముద్రం

సెలవు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా కలిసి గడపడం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, లాంటి అంశాలు మార్పు తెస్తాయి. సెల్‌ఫోన్లు పక్కన పెట్టి కుటుంబ సభ్యులందరూ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలి. సరదాగా మాట్లాడుకుంటే పిల్లలు మానసిక ఉల్లాసం పొందడంతో ఎదుగుదల లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని